సైకిల్‌పై సవారీకి  వెనుకంజ !

12 Sep, 2018 10:38 IST|Sakshi

కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించే అవకాశాలున్న నియోజకవర్గంలో ఆ పార్టీ గుర్తుపై బరిలోకి దిగేందుకు ఆశావహులు వెనుకడుగు వేస్తున్నారు. బాల్కొండ స్థానం టీడీపీకి దక్కే అవకాశాలుండగా, 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓటింగ్‌  12 శాతమే.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ గుర్తు పై ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు టీ డీపీ ఆశావహులు సైతం ఆసక్తి చూ పడం లేదు. పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించే అవకాశాలున్న ఒక టీ రెండు నియోజకవర్గాల్లో ఆ పా ర్టీ గుర్తుపై బరిలోకి దిగేందుకు ఆశావహులు వెనుకడుగు వేస్తున్నారు. కాం గ్రెస్‌తో పొత్తులో భాగంగా జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో బాల్కొం డ స్థానం టీడీపీకి దక్కే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్థానాన్ని ఆశిస్తున్న అన్న పూర్ణమ్మ కుమారుడు డాక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి టీడీపీ బీఫారంపై కాకుండా, కాంగ్రెస్‌ గుర్తుపైనే పోటీ చేయాలని యోచనలో ఉన్నట్లు వారి అనుచరవర్గం పేర్కొంటోంది.

కాంగ్రెస్‌ ఓటుబ్యాంకుపైనే ఆశలు.. 
తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా జిల్లాలో ఆ పార్టీ ఉనికి లేకుండా పోయింది. ప్రస్తుతం మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ వంటి ఇద్దరు ముగ్గురు నాయకులే మిగిలారు. జిల్లా అంతటా టీడీపీ పూర్తిగా పట్టు కోల్పోయింది. 2014 ఎన్నికల ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే.. బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓట్లలో టీడీపీకి వచ్చిన ఓటింగ్‌ కేవలం 12 శాతమే. ఇందులో అభ్యర్థిని చూసి వేసిన ఓట్లే అధికం. 2014 ఎన్నికల తర్వాత జిల్లాలోని నాయకులంతా ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. చివరకు జిల్లా అధ్యక్షులు అర్కల నర్సారెడ్డి సైతం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీగా పనిచేసిన వీజీ గౌడ్‌ వంటి నేతలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పార్టీని వీడారు. గ్రామాల్లో కేడర్‌ కనుమరుగైంది.

చెప్పుకోదగిన నాయకులిద్దరు, ముగ్గురు మినహా టీడీపీ పూర్తిగా తన ప్రభావాన్ని కోల్పోయింది. ఓటింగ్‌ శాతం కూడా నామమాత్రానికి పడిపోయింది. దీంతో టీడీపీ గుర్తుపై పోటీ చేస్తే.. కాంగ్రెస్‌ ఓట్లు పూర్తి స్థాయిలో తమకు మళ్లే అవకాశాలు ఉండవని భావిస్తున్న ఆశావహులు.. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు పైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ పార్టీ గుర్తుపైనే బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారు. టీడీపీ గుర్తుపై పోటీ చేస్తే అసలుకే ఎసరొచ్చే అవకాశాలుండటంతో మల్లికార్జున్‌రెడ్డి కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు అనుచరవర్గంలో ప్రచారం కొనసాగుతోంది. కాంగ్రెస్‌ గుర్తుపై పోటీ చేస్తే టీడీపీ అధినాయకత్వం ఇందుకు అంగీకరిస్తుందా అనే అంశంపైనా చర్చ జరుగుతోంది. కాగా, ఈ స్థానాన్ని ఆశించిన మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేష్‌రెడ్డి కారెక్కారు. దీంతో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కు లైన్‌ క్లియరైంది. కానీ అనూహ్యంగా టీడీపీ పొత్తు తెరపైకి రావడంతో ఈరవత్రి టిక్కెట్‌ కోసం తన ప్రయత్నం ముమ్మరం చేయాల్సి వస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్‌ – టీడీపీ పొత్తు అంశంపై జిల్లా రాజకీయవర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు