ఆపరేషన్‌ ఆకర్ష్‌

6 Dec, 2018 09:20 IST|Sakshi
బాలానగర్‌లోని ఓ థియేటర్‌లో పట్టుబడిన డబ్బును చూపుతున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి శ్రావణి. చిత్రంలో థియేటర్‌ మేనేజర్‌ (చేతులు కట్టుకున్న వ్యక్తి)

ముగిసిన ప్రచార భేరిఅభ్యర్థుల్లో టెన్షన్‌ టెన్షన్‌..

మొదలైన పంపకాల ఎరలు

చివరి ఓటు వరకు టార్గెట్ల నిర్ణయం

గెలుపే లక్ష్యంగా ఆకర్షక విందులు

కూకట్‌పల్లిలో సీమాంధ్ర టీడీపీ నేతల మకాం

నగదు పంపిణీ చేస్తూ పోలీసులకు చిక్కిన వైనం

ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తున్న అభ్యర్థులు

హైటెక్‌ బాటలో నగదు పంపిణీకి శ్రీకారం

పోలీసుల రాకతో కాంగ్రెస్, టీడీపీ నేతల పలాయనం

సాక్షి,సిటీబ్యూరో/కూకట్‌పల్లి: ఐదేళ్ల కాలానికి తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు గంటల గడువే మిగిలింది. మూడు వారాల పాటు హోరెత్తిన ప్రచార జోరు బుధవారం సాయంత్రం 5 గంటలతో ముగియడంతో అభ్యర్థులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. బూత్‌ల వారిగా మహిళలు, యువకులు, కులాలు, వర్గాల వారిగా జాబితాలు సిద్ధం చేసుకున్న అభ్యర్థులు, వారి అనుయాయులు నగదు, బహుమతులు, గిప్ట్‌ కూపన్లు పంపిణీకి సిద్ధమయ్యారు. బుధవారం సాయంత్రం నుంచే మొదలైన పంపకాల వ్యవహారం పోలింగ్‌ ముగిసే దాకా కొనసాగే అవకాశం ఉంది. బరిలో ఉన్న అభ్యర్థుల్లోనూ టెన్షన్‌ మొదలైంది. ఎలాగైనా సరే గెలవాలని కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో విందుల రాజకీయం మొదలెట్టారు. నగరంలో దాదాపు మెజారిటీ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎవరికి వారు గెలుపు కోసం పంపకాల వ్యూహాన్ని రచించుకుంటున్నారు. పంపకాలు, ప్రలోభాల ద్వారా కనీసం ఐదు శాతం ఓరట్లనైనా తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. ఉన్న ఏ అవకాశాన్నీ ఏ అభ్యర్థీ వదులుకోవడం లేదు. ఈసారి ఎంఐఎం ప్రాబల్యం ఉన్న స్థానాల్లోనూ పోటీ ఉండడంతో పాతబస్తీలోనూ డబ్బు ప్రభావం భారీగానే కనిపిస్తోంది. శివారు నియోజకవర్గాల్లో కులం, ప్రాంతాలతో పాటు మహిళా సంఘాలకు బల్క్‌గా ఆన్‌లైన్‌ బదిలీలు చేస్తున్నట్లు సమాచారం. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి తదితర నియోజకవర్గాల్లో కరెన్సీ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం సైతం అంచనాకు వచ్చింది.

చివరి క్షణం దాకా ప్రచారమే..
నగరంలో తమ పార్టీ అభ్యర్థుల విజయాల కోసం ప్రధాని నరేంద్రమోఢీ,ఏఐసీసీ ముఖ్య నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ మొదలు.. ముఖ్యమంత్రులు చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్‌ చౌహాన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, కేంద్రమంత్రులు పాశ్వాన్, జేపీ నడ్డా, సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్‌ తదితరులు ప్రచార సభల్లో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు అన్నీ తామై వ్యవహరించి ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. ఎంఐఎం తరఫున ఎంపీ అసదుద్దీన్, అక్బరుద్దీన్‌ ఒవైసీలే ప్రచారాస్త్రాలను విసిరారు. 21 రోజుల పాటు సాగిన ప్రచారంలో అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల నాయకులు రోజుకు మూడు నుంచి నాలుగు గంటల విశ్రాంతే తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. ప్రచారం చివరి రోజు నగరంలో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా రోడ్డు షోలు, సభలు, సమావేశాలతో బిజీబీజీగా గడిపారు.  

తేలికగా నగదు బదిలీ ఇలా..
ప్రచారంలోనే కాదు.. ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకు నగదు పంపిణీలోనూ అభ్యర్థులు హైటెక్‌బాట పట్టారు. తేజ్‌ యాప్, పేటీఎం, ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ విధానాల ద్వారా ఓటర్లకు నగదు బదిలీ చేసేస్తున్నారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు బూత్‌లవారీగా ఇంటింటికీ తిరిగి ఓటర్ల ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాల నంబర్లను సేకరిస్తున్నారు. ఈ వివరాలను పార్టీ నేతలకు చేరవేయడంతో పాటు నగదు బదిలీకి ఇతోధికంగా సహకరిస్తున్నారు. ఎన్నికలకు గడువు కొన్ని గంటలు మాత్రమే మిగలడంతో ఈ కార్యకలాపాలు నగరంలో ఊపందుకున్నాయి. బస్తీలు, కాలనీలవాసుల్లో తొంభై శాతానికి పైగా బ్యాంకు ఖాతాలుండడంతో తమ పని సులువైందని ఆయా పార్టీల నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఒక్కో ఓటుకు ప్రాంతాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.4 వేల వరకు ధర నిర్ణయించినట్టు సమాచారం. నగరంలో పోలీసులు, ఎన్నికల సంఘం నిఘా బృందాలు నగదు, మద్యం రవాణాపై డేగకన్ను వేయడంతో అభ్యర్థులు, ద్వితీయశ్రేణి నాయకగణం హైటెక్‌ నగదు పంపిణీ బాటపట్టారు.  

కాలనీలకు తాయిలాలు..
మద్యం, నగదు పంపిణీతో పాటు మహిళలు, వృద్ధులు, యువత ఓట్లను రాబట్టుకునేందుకు అభ్యర్థులు, ద్వితీయశ్రేణి నాయకగణం కాలనీలు, బస్తీల్లో ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల ఓటర్లను కలుస్తూ భారీగా తాయిలాలు ప్రకటిస్తున్నారు. కొన్ని చోట్ల మిక్సీలు, కుట్టుమిషిన్లు, గృహోపకరణాలతో పాటు యువతకు క్రికెట్, వాలీబాల్‌ కిట్లు పంపిణీ చేస్తుండడం విశేషం. ఈ పంపిణీ ప్రక్రియ కూడా గుట్టుగానే సాగుతోంది. ఇప్పటికే ఆయా కాలనీలు, బస్తీల్లో కొందరు ముఖ్య నేతలు, కార్యకర్తల ఇళ్లలో నిల్వచేసిన వస్తువులు, మద్యాన్ని మాత్రమే ఓటర్ల ఇంటికే నేరుగా వెళ్లి పంపిణీ చేస్తుండడం గమనార్హం.

కూకట్‌పల్లిలో సీమాంధ్ర టీడీపీ నేతల హల్‌చల్‌  
ఈ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. సీమాంధ్ర నుంచి వచ్చిన పలువురు నాయకులు, కార్యకర్తలు అరాచకంగా డబ్బు, మద్యం పంపిణీతో ఓటర్లను ప్రలోభపెడుతుండడం సంచలనం సృష్టించింది. పక్షం రోజులుగా కూకట్‌పల్లిలోని వివిధ డివిజన్లలోని హాస్టళ్లు, లాడ్జీలు, రెస్ట్‌రూమ్‌లను అడ్డాగా చేసుకొని ఇప్పటి దాకా ప్రచారం చేశారు. దీనికితోడు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలను డివిజన్లు, బూత్‌ల వారీగా ఇన్‌చార్జులుగా నియమించి ఇంటింటికీ డబ్బు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. అనంతపురానికి చెందిన ప్రభాకర్‌చౌదరి ప్రలోభాలతో కులాలు, మతాల వారీగా, మహిళా సంఘాల వారీగా ఓట్లను కొనుగోలు చేసేందుకు తన అనుచరులతో నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం స్థానిక నాయకులకు కూడా సమాచారం లేకుండా పూర్తిస్థాయిలో ఏపీ నుంచి వచ్చిన నేతలు, యువకులతో గుంపులుగా వెళ్లి ఓట్లను గంపగుత్తగా కొనుగోలుచేసేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. పోలీసుల తనిఖీల నేపథ్యంలో హోటళ్లు, లాడ్జీల నుంచి మాకాంను ఓ కళాశాల ఆవరణలోకి, నిర్మాణంలో భవనంలోకి మార్చి అక్కడి నుంచి డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. బస్తీలు, మురికివాడలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ప్రధానంగా ఓల్డ్‌ బోయిన్‌పల్లి, బాలానగర్, ఫతేనగర్, అల్లాపూర్, మూసాపేట తదితర డివిజన్లలో డబ్బుల పంపిణీ అధికంగా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కోట్లాది రూపయాలతో ఇప్పటికే నియోజకవర్గంలో తిష్టవేసిన టీడీపీ చెందిన ఇతర ప్రాంతాల నాయకులను కట్టడి చేయడంలో ఎన్నికల అధికారులు, పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  

బాలానగర్‌లో లక్షల్లో నగదు పట్టివేత
బాలానగర్‌లోని ఓ థియేటర్‌ ఆవరణను అడ్డాగా మార్చుకొని కొందరు టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు ఓటర్లకు, కుల సంఘాల ప్రతినిధులకు డబ్బులు పంచేందుకు యత్నించగా స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసులకు పట్టించారు. బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుటనే ఉన్న టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే థియేటర్‌ కావడంతో ఎవరికీ అనుమానం రాకుండా డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. పోలీసులు, ఎన్నికల విభాగం ప్‌లైయింగ్‌ స్కాడ్‌ థియేటర్‌లోకి వెళ్లి తనిఖీ చేశారు. అప్పటికే అక్కడే ఉన్న పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు వారిని చూసి అక్కడి నుంచి జారుకున్నారు. గతంలో బాలానగర్‌ డివిజన్‌ నుంచి కార్పొటర్‌గా పోటీచేసిన ఇద్దరు టీడీపీ నాయకులు, కాంగ్రెస్‌ నాయకులు ఇక్కడి థియేటర్‌ ప్రాంగణంలో ఉండగా వారికి కూడా పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల తనిఖీల్లో రూ.8,80,700 పట్టుబడింది. అయితే సదరు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేకపోవడం గమనార్హం.  

రూ.40 లక్షల నగదు పట్టివేత
గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని ఐడీబీఐ బ్యాంక్‌ సమీపంలో రూ.40 లక్షలతో ఉన్న ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు బుధవారం రాత్రి అదుపులో తీసుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. అనంతరం అదాయ పన్నుశాఖ అధికారులకు సమాచారం అందించారు. పట్టుబడిన వ్యక్తులు మధ్యవర్తులుగా భావిస్తున్నట్టు పోలీసులు చెబుతన్నారు. ఎవరికి నగదు చేరవేసేందుకు ఐడీబీఐ బ్యాంక్‌ లాకర్‌ నుంచి తీసుకొచ్చారో తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు