కారెక్కనున్న.. టీడీపీ నేత

2 Nov, 2017 12:18 IST|Sakshi

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో మంతనాలు

మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే వీరేశం మధ్యవర్తిత్వం

భూపాల్‌రెడ్డితోపాటు, నల్లగొండ నియోజకవర్గ నేతలు

కాంగ్రెస్‌లో టికెట్‌ విషయమై స్పష్టత లేకనే గులాబీ దారి

 6న కేడర్‌తో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం

సాక్షిప్రతినిధి, నల్లగొండ :  టీడీపీ నేత కంచర్ల భూపాల్‌రెడ్డి చివరకు గులాబీ గూటికి చేరనున్నారు. రేవంత్‌రెడ్డితో కలిసి పయనం చేస్తానని అనుకున్న ఆయన తుదకు కారెక్కుతున్నారు. అసెంబ్లీ టికెట్‌ విషయంలో కాంగ్రెస్‌ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆయన టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపారు. బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కంచర్లతోపాటు ఆయన సోదరుడు కృష్ణారెడ్డి కలిసి పార్టీలో చేరికపై మంతనాలు జరిపారు. ఈ వ్యవహారానికి విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్యవర్తిత్వం వహించినట్లు విశ్వసనీయ సమాచారం. రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో భూపాల్‌రెడ్డి కూడా ఆయన బాటలోనే కాంగ్రెస్‌లోకి వెళ్దామని భావించారు. నల్లగొండ అసెంబ్లీ టికెట్‌ ఇస్తేనే ఆ పార్టీలోకి వెళ్తానని ఆయన ప్రకటించిన విషయం విదితమే.

ఈ నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీలో బలమైన నేతగా ఉండడంతో ఇటు టీపీసీసీ నుంచి కానీ, అటు ఏఐసీసీ నుంచి కానీ భూపాల్‌రెడ్డికి హామీ రాలేదు. దీంతో చివరకు మునుగోడు నుంచైనా అవకాశం వస్తుందోనని ఆయన వేచిచూసినట్లు తెలిసింది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఢిల్లీ నుంచి తిరుగుపయనంలో భూపాల్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఏఐసీసీ నుంచి కూడా నల్లగొండ విషయంలో ఏమీ మాట్లాడకపోవడంతో ఆయన కొంత సమయం వేచి చూడాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తన రాజకీయ భవిష్యత్‌ కోసం టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మంగళవారం రాత్రే అనుచర నేతలతో చర్చించి నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే వేముల వీరేశంలు కంచర్లతోపాటు ఆయన సోదరుడు కృష్ణారెడ్డిని ప్రగతిభవన్‌కు తీసుకెళ్లారు.

నల్లగొండలో కంచర్లకు పట్టు ఉందని..
కంచర్ల చేరికతో నల్లగొండ జిల్లా కేంద్రంలో పార్టీకి మరింత పట్టు ఉంటుందని, గత ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ఓట్లు తదితర విషయాలన్నీ సీఎంకు.. మంత్రి, ఎమ్మెల్యే వివరించినట్లు సమాచారం. మొత్తంగా నల్లగొండ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కంచర్ల సోదరులు సీఎంకు చెప్పిట్లు తెలిసింది. సోదరులిద్దరితో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ‘అన్నీ నేనే చూసుకుంటా’ అని సీఎం కంచర్ల సోదరులకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. కంచర్లతోపాటు టీడీపీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు, నల్లగొండ రూరల్, కనగల్, తిప్పర్తి మండలాల అధ్యక్షులు దేప వెంకట్‌రెడ్డి, అయితగోని యాదయ్య, లోడంగి గోవర్ధన్‌యాదవ్, 40వ వార్డు కౌన్సిలర్‌ భర్త గుండ్రెడ్డి యుగేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు మల్లేష్‌గౌడ్, పొడిశెట్టి రవి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మందాడి సైదిరెడ్డి, నేతలు సుంకరబోయిన సత్యనారాయణలు ప్రగతిభవన్‌కు వెళ్లిన వారిలో ఉన్నారు. ఈనెల 6న తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో కంచర్ల సోదరులతోపాటు కేడర్‌ టీఆర్‌ఎస్‌లో చేరనుంది.

అంతర్మథనంలో దుబ్బాక.. ?
కంచర్ల రాకతో టీఆర్‌ఎస్‌ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దుబ్బాక నర్సింహారెడ్డి అనుయాయులు అయోమయంలో పడ్డారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా దుబ్బాకకే టికెట్‌ వస్తుందని భావించినా ఈ పరిస్థితితో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. కంచర్ల ప్రగతిభవన్‌కు వెళ్లాడని సమాచారం నియోజకవర్గంలో వ్యాపించడంతో దుబ్బాక అనుచరులు చాలామంది ఆయన ఇంటికి వచ్చి పరిస్థితి ఏంటని నేతలను ఆరా తీశారు. అయితే కంచర్ల వెళ్తున్న సమాచారం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దుబ్బాకకు ఉందా..? అని ఆయన అనుచరులు చర్చించుకున్నారు. కంచర్ల కారెక్కడంతో నల్లగొండ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌లో రాజకీయం వేడెక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ టికెట్‌ కంచర్లకు ఇస్తానని çహామీ ఇస్తే.. దుబ్బాక భవితవ్యం ఏమిటీ..?, గుత్తా ఎలా స్పందిస్తారోనని.. దుబ్బాక అనుచరగణం వేచిచూస్తోంది. 

మరిన్ని వార్తలు