త్వరలో బీజేపీలో చేరనున్న కోనేరు చిన్ని..!

7 Jul, 2019 11:36 IST|Sakshi
కోనేరు సత్యనారాయణ 

సాక్షి, కొత్తగూడెం : మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) మరో రెండు వారాల్లో బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. శనివారం హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షాను కలిసేందుకు చిన్ని వెళ్లారు. అయితే హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న కోనేరు చిన్నిని వేదికపైకి పిలిచినా ఆయన స్టేజీ ఎక్కలేదు. బీజేపీలో చేరే విషయంలో మరోసారి ఆలోచించి.. వచ్చే రెండు వారాల్లో ప్రకటిస్తానని ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు. ఏది ఏమైనా కోనేరు సత్యనారాయణ బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అయినట్లేనని అభిమానులు భావిస్తున్నారు.

రాష్ట్రంలో టీడీపీ హవా తగ్గిపోవడంతో జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు గతంలోనే టీఆర్‌ఎస్‌తోపాటు ఇతర పార్టీల్లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోనేరు సత్యనారాయణ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్‌ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ టికెట్‌ను కాంగ్రెస్‌కు కేటాయించారు. దీంతో మనస్తాపానికి గురైన కోనేరు.. అప్పుడే మరో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం బలంగా సాగింది. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చిన్నిని ప్రత్యేకంగా అమరావతికి పిలిపించి  బుజ్జగించారు. ఏపీలో టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తే టీటీడీ బోర్డులోకి తీసుకుంటారనే ప్రచారం కూడా సాగింది. కానీ అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఆపార్టీ ప్రాబల్యం తగ్గడంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం మరో పార్టీని చూసుకోక తప్పడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చిన్ని టీడీపీని వీడితే ఇక జిల్లాలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైనట్టేనని, జిల్లాలో ఆ పార్టీకి నాయకత్వం వహించేవారు ఇక లేనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు