ఆ డబ్బు ఎవరిచ్చారు?

19 Feb, 2019 03:55 IST|Sakshi

మిగిలిన రూ.4.5 కోట్లుఎక్కడుంచారు?

ఉదయ సింహాపై ఈడీ ప్రశ్నల వర్షం

నేడు విచారణకురానున్న రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు – కోట్లు’కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే డబ్బు ఎక్కడ నుంచి వచ్చిం దన్న విషయంపై టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి ఆయన కుమారులను ఈడీ విచారించిన సం గతి తెలిసిందే. తాజాగా సోమవారం ఈడీ విచారణకు కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయసింహా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందే తయారు చేసిన ప్రశ్నల జాబితా(బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఏసీబీ ఇచ్చిన అధారాలు)ను ఆయన ముందుంచి అధికారులు ప్రశ్నించినట్లు తెలిసిం ది. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు లంచంగా ఇవ్వజూపిన రూ.50 లక్షలను మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి చేరవేసారని ఉదయసింహా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ వీడియోలో త్వరలోనే మరో రూ.4.5 కోట్లు ఇస్తామని రేవంత్‌ చెప్పారు. మిగతా నగదు ఎవరు ఇచ్చేవారని ప్రశ్నించి నట్లు సమాచారం. దీనిపై తొలుత పొంతనలేని సమాధానాలు ఇచ్చిన ఉదయ సింహ నుంచి తరువాత విచారణలో పలు కీలక అంశాలు ఈడీ డైరెక్టర్‌ రాజశేఖర్‌ బృందం రాబట్టినట్లు తెలుస్తోంది. సుమారు 9 గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది.

నేపథ్యమిదీ..
2015 మేలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు లంచంగా ఎరవేశారు. ముందస్తు సమాచారంతో మాటువేసిన ఏసీబీ అధికారులు రేవంత్‌రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య,సెబాస్టియన్, ఉదయసింహా, మత్తయ్యలపై ఏసీబీ చార్జిషీటు దాఖలు చేసింది. ఇప్పటికే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహా ఇళ్లల్లో కూడా ఐటీ అధికారులు సోదా జరిపిన సంగతి తెలిసిందే. తరువాత ఈకేసును ఏసీబీ అధికారులు ఈడీకి బదిలీ చేశారు . ఈ కేసులో మత్తయ్య, సెబాస్టియన్, ఉదయసింహా, రేవంత్‌రెడ్డితోపాటు మరో టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి అతని కుమారులను కూడా ఈడీ విచారించింది. 

నేడు ఈడీ ముందుకు రేవంత్‌రెడ్డి
ఈ కేసులో ఇప్పటికే ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ) కింద ఈసీఐఆర్‌ నమోదు చేసిన ఈడీ.. 19న విచారణకు రావాలంటూ రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. మంగళవారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయనకు చెందిన ప్రశ్నావళిని ఈడీ అధికారులు ముందే సిద్ధం చేసినట్లు సమాచారం. తాజాగా ఉదయసింహా, వేం నరేందర్‌రెడ్డి, ఆయన కుమారులు ఇచ్చిన సమాధానాల ఆధారంగా వీటిని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తొలి నుంచి రేవంత్‌రెడ్డి అన్నీ తానై నడిపించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, స్టీఫెన్‌సన్‌లనూ విచారణకు రావాలని ఈడీ పిలిచే అవకాశముంది.

మరిన్ని వార్తలు