‘దేశం’ ఆగమాగం!

23 Apr, 2015 01:02 IST|Sakshi

- అయోమయంలో తెలుగుతమ్ముళ్లు
- ఎమ్మెల్యేల నిష్ర్కమణతో నైరాశ్యం
- గులాబీ దళంలో ‘పాత’మిత్రులదే హవా
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
ముఖ్యనేతలు సైకిల్‌దిగి కారెక్కుతుండడంతో తెలుగుదేశం పార్టీ పూర్తిగా డీలా పడింది. పార్టీని నమ్ముకున్న ద్వితీయ శ్రేణి, కార్యకర్తల స్థాయిలో నైరాశ్యం అలుముకుంది. ఏకంగా ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెబుతుండడంతో ‘దేశం’ ఆయువుపట్టును కోల్పోతోంది. సుమారు రెండుదశాబ్దాలుగా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పార్టీని వీడుతుండడం తమ్ముళ్లను అయోమయంలో పడేసింది.

పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన కిషన్‌రెడ్డి గులాబీ గూటికి చేరాలనే నిర్ణయాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కాయి. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలతో జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. నాలుగునెలల క్రితం మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గులాబీ కం డువా కప్పుకోగా.. తాజాగా మంచిరెడ్డి కూడా కారెక్కేందుకు రెడీ అయిపోయారు. ఇంకోవైపు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా వీరి బాటలోనే పయనించే అవకాశంలేకపోలేదనే ప్రచారమూ జరుగుతోంది.

డైల మాలో శ్రేణులు
ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసి.. గులాబీ తీర్థంపుచ్చుకుంటున్నారనే వార్తలతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణు లు డైల మాలో పడ్డాయి. జిల్లా పార్టీ సారథి కూ డా వ్యవహరిస్తున్న ఆయన అనూహ్యంగా కారెక్కాలని నిర్ణయం తీసుకోవడం ముఖ్యనేతలను నివ్వెరపరిచింది. సిట్టింగ్ సీటును కాదని సీపీఎం ను ఒప్పించి కిషన్‌రెడ్డికి టికెట్ ఇప్పించిన చంద్రబాబును వదిలివెళ్లడం దారుణమని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రొక్కం భీమ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

పసుపు పోయి.. గులాబీ వచ్చే
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకనేతలుగా వ్యవహరించినవారే ఇప్పుడు గులాబీ పార్టీలో చ క్రం తిప్పుతున్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి మొదలు హరీశ్వర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, రత్నం, సంజీవరావు, తీగల, తాజాగా కిషన్‌రెడ్డి ఇలా టీడీపీలో ఒక వెలుగు వెలిగిన నాయకులంతా టీఆర్‌ఎస్ గూటికి చేరారు. ప్రస్తుతం ఆ పార్టీలో వీరి హవానే కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినవారంతా తెర వెనుకకు పోగా... వలసనేతలే కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఇదిలావుండగా, గతంలో టీడీపీలోనూ రెండువర్గాలుగా వ్యవహరించిన ఈ నేతలు ఇప్పుడు కూడా గ్రూపులుగా విడిపోయే అవకాశంలేకపోలేదు. మంత్రి మేహ ందర్‌రెడ్డి.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి మొదట్నుంచి అభిప్రాయభేదాలున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కిషన్‌రెడ్డి పార్టీలో చేరే అంశంపై అధిష్టానం మహేందర్‌తో చర్చించలేదని తెలుస్తోంది. కిషన్‌రెడ్డి కూడా దీనిపై మంత్రితో సంప్రదించలేదని సమాచారం. కిషన్‌రెడ్డితో రాయబా రం నడిపిన సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్‌రావు బుధవారం సీఎం క్యాంపు ఆఫీసుకు రావాలని మహేందర్‌కు కబు రు పంపినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే రెండువర్గాలుగా చీలిపోయిన గులాబీదళంలో మరో పవర్‌సెంటర్‌కు కిషన్‌రెడ్డి నాయకత్వం వహిస్తారనే ప్రచారం జరుగుతోంది.
 
నియోజకవర్గ ‘మంచి’ కోసమే..
సీఎంతో భేటీ.. రేపు గులాబీ తీర్థం

గట్టి హామీ లభించడంతో కారెక్కడానికి రెడీ ఉత్కంఠ వీడింది. ఊహాగానాలకు తెరదించుతూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్ గూటికి చేరారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన కిషన్‌రెడ్డి ఈనెల 24న గులాబీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించారు. అంతకుముందు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్‌రావు సంప్రదింపులు జరిపిన ఆయన అక్కడి నుంచి సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లారు.

నియోజకవర్గ అభివృద్ధికి చేయూతనిస్తానని సీఎం హామీ ఇచ్చినందునే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు మంచిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. నాగార్జునసాగర్ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడం, జాపాల్- రంగాపూర్ అబ్జర్వేటరీ అభివృద్ధి, ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును కృష్ణాజలాలతో నింపడం, మూసీ మురుగునీటి శుద్ధికి సీఎం సహకరిస్తానని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. కార్యకర్తలు, నాయకుల ఒత్తిడి మేరకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా తప్ప ఎలాంటి వ్యక్తిగత ఏజెండా లేదని స్పష్టం చేశారు. కేవలం ప్రజాప్రతినిధులతో కలిసి 24న టీఆర్‌ఎస్‌లో చేరుతున్నాని, త్వరలో ఇబ్రహీంపట్నంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని, దీనికి సీఎం రానున్నారని ఆయన చె ప్పారు.

>
మరిన్ని వార్తలు