నియంతలకు పట్టిన గతే పడుతుంది

16 Apr, 2017 08:23 IST|Sakshi
నియంతలకు పట్టిన గతే పడుతుంది

హైదరాబాద్‌: అసెంబ్లీ నిబంధనలను పక్కనబెట్టి హరీష్‌రావు, సదారాం కనుసన్నల్లో సభ నడుస్తున్నదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, అసెంబ్లీలా కాకుండా టీఆర్‌ఎస్‌ కార్యాలయంలా నడుస్తోందని విమర్శించారు. పార్టీ కార్యాలయాలకతీతంగా స్పీకర్ కార్యాలయం పనిచేయాలన్నారు. ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సింది స్పీకరేనని, అయితే దురదృష్టంకొద్దీ అలా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నిన్నటివరకు టీడీపీ జెండా కింద పనిచేసింది మరిచిపోయారా అని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలమైన తమను బీఏసీకి రావాలని పిలిచి అవమానించడం దారుణమన్నారు. ఇది తెలంగాణ సమాజానికి జరిగిన అవమానం అని అన్నారు. అసెంబ్లీ కార్యదర్శి సదారాంను సస్పెండ్ చెయ్యాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

నియంతలకు పట్టిన గతే పడుతుంది: సండ్ర
ప్రభుత్వం, అసెంబ్లీ టీడీపీ గొంతు నొక్కుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శనివారం ఆయన స్పీకర్‌ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. బీఏసీ తమను అనుమతించక పోవడం దారుణమన్నారు. బీఏసీ మీటింగ్ కు రావాలని ఆహ్వానించి, అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో, శాసన సభలో భజన చేసేవారే ఉండాలన్నట్లు ప్రభుత్వం వ్యవహరుస్తోందని ఆరోపించారు. తమనేందుకు సస్పెండ్ చేశారో.. ఫుటేజ్ బయటికివ్వమని అడిగితే స్పీకర్  దగ్గర సమాదానం లేదని తెలిపారు. చరిత్రలో నియంతలకు పట్టిన గతే ఈ సర్కార్‌కు పడుతుందని దుమ్మెత్తి పోశారు.

>
మరిన్ని వార్తలు