ఈ బంధం.. ఎందరికో ఆదర్శం

4 Sep, 2018 14:07 IST|Sakshi
గురువుతో శిష్యుడు

పేదరికంతో తాను చదువుకోలేక పోయినా.. శిష్యుడిని ప్రయోజకుడిని చేసిన గురువు

పేదరికంతో తాను చదువుకోలేక పోయాననే బాధను దిగమింగుకుని.. ఓ శిష్యున్ని తన కష్టార్జితంతో ఉన్నత శిఖరాలకు చేర్చిన ఓ గురువు జీవత గాథ ఇది. నా శిష్యుడిని గొప్ప శాస్త్రవేత్తను చేయాలనే ఆ గురువు తపన.. గురువు లక్ష్యానికి అనుగుణంగా శిష్యుడి కష్టం.. వెరసి ఈ అనుబంధం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. సెప్టెంబర్‌ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ గురు శిష్యుల బంధంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం....

కష్టాల కడలిని జయించి..

జనగామ :  వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి చెందిన నాసం రాజయ్య, సరోజని దంపతుల కుమారుడు నాసం రమేష్‌ 7వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు. పేదరికంలో పుట్టిన ఆ బిడ్డకు మంచి విద్యను అందించాలనే తపనతో తల్లిదండ్రులు గీతాంజలి ఆశ్రమ పాఠశాలలో  8వ తరగతిలో చేర్పించారు. కూలీ పని చేస్తూ కొడుకును చదివించుకున్నారు.  చదువుకోవాలనే తపన ఉన్నా... ఆర్థికంగా వెనకబడి.. తల్లిదండ్రులతో కలిసి పనికి వెళ్లేవాడు.  

పని చేస్తూనే పదో తరగతి పూర్తి చేశాడు. ఈ సమయంలోనే కొంతమంది స్నేహితులు, గురువులు కొంతం రవీందర్, బొల్లెబోయిన. కిషోర్, బండి. శ్రీనివాస్, వంగ రవీందర్‌.. రమేష్‌ను వెన్నుతట్టి ముందుకు నడిపించారు. గీతాంజలి స్కూల్‌లోనే పీఈటీగా(ప్రైవేటు) పోస్టింగ్‌ ఇప్పించారు.  విద్యార్థులకు శిక్షణ ఇస్తూనే...  రమేష్‌  పోలీసు జాబ్‌ కోసం అహోరాత్రులు కష్టపడి చదివాడు. రెండున్నరేళ్ల పాటు స్కూల్‌లోనే పని చేస్తూ... 2004లో సీఆర్పీఎఫ్‌ జవాన్‌గా ఎంపికయ్యాడు.

శిష్యుడికి చేయూత..

గీతాంజలి స్కూల్‌లో నాసం రమేష్‌ పని చేస్తున్న సమయంలో సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన బుట్టి రమేష్‌ చదువుకునే వాడు. బుట్టి రమేష్‌కు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడే తన తండ్రి గుండె పోటుతో చనిపోయాడు. అప్పటి నుంచి తల్లి మల్లికాంబ కూలీ పని చేస్తూ.. కొడుకును చదివించింది.  కుటుంబ పోషణ భారమవడంతో.. కుమారుడిని ఏడో తరగతిలోనే చదువు మాన్పించే ప్రయత్నం చేసింది.

 దీంతో అదే పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న గురువు నాసం రమేష్‌ను శిష్యుడు బి.రమేష్‌ (విద్యార్థి) కలిసి.. తన బాధను చెప్పకున్నాడు.  అప్పటి నుంచి ఆ విద్యార్థిని నాసం రమేష్‌ తన సొంతఖర్చులతో బాగా చదివించాడు. తాను చేరలేని లక్ష్యాన్ని శిష్యుడైనా చేరుకోవాలనే లక్ష్యంతో ప్రోత్సహించాడు.  బుట్టి రమేష్‌ఇంటర్‌ పూర్తి చేసిన తర్వాత ఏపీలోని కర్నూల్‌ ఏపీఆర్‌జేసీ ఎంట్రన్స్‌లో జీవరసాయన శాస్త్రంలో ఉస్మానియా రీజియన్‌లోనే మొదటి ర్యాంకు సాధించాడు.

ఆ తర్వాత హైదరాబాద్‌ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో అడ్మిషన్‌ లభించింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. శిష్యుడు రమేష్‌ పూణేలోని ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెల్‌ సైన్స్‌’ గేట్‌లో 129 ఆల్‌ ఇండియా ర్యాంక్‌తో పాటు ఐసీఎంఆర్, జేఆర్‌ఎఫ్‌ సాధించి.. తనపై గురువు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇందులోనే రమేష్‌కు క్యాన్సర్‌పై రీసెర్చ్‌ చేయడానికి అవకాశం రావడంతో.. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 

సైనికుడిగా నేను,    శాస్త్ర వేత్తగా నా శిష్యుడు.. భారతమాత రుణం తీర్చుకోవాలి.  మా మనసులు వేరైనా.. ఆలోచన, లక్ష్యం, కష్టం, బాధ్యత మాత్రం ఒక్కటిగా పంచుకున్నాం.  నేను నెరవేర్చలేకపోయిన ఆశయాన్ని మా శిష్యుడు సాధిస్తున్నాడు.  ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత.. శిష్యుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను.  మా పదహారేళ్ల ప్రయాణంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. వాటిని ఇష్టంగా స్వీకరిస్తూ.. ముందుకు వెళ్లాం. నా శిష్యుడిని గొప్ప శాస్త్ర వేత్తగా తయారుచేసి, జీవశాస్త్రంలో నోబెట్‌ బహుమతి సాధించేలా చేయాలన్నదే నా లక్ష్యం.

– నాసం రమేష్, గురువు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌

రమేష్‌సార్‌ మార్గదర్శకత్వమే 

నాకు బలంతల్లి బడికి వద్దురా బిడ్డా అన్న సమయంలో రమేష్‌ సార్‌ కనిపించి వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఆ రోజును నేను మరచిపోలేను. రమేష్‌ సర్‌ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవారు. ఒక వ్యక్తి జీవితంలో పైకి రావడానికి కావాల్సినవి పట్టుదల, మార్గదర్శకత్వం. నాకు పట్టుదల ఉంది,  రమేష్‌ సార్‌ నాకు మార్గదర్శనం చేశారు. అదే నా బలమైంది. సాధారణ విద్యార్థిని అయినా.. నా గురువు గొప్పమనిషిగా నన్ను తీర్చి దిద్దడానికి ప్రయత్నాలు కొనసాగించారు.

జీవితంలో వైఫలాలు ఉన్నా.. తనకు మాత్రం ఏ లోటు చేయలేదు.  కుటంబ సభ్యుడిగా ఆరాధించారు. నా బంధువులు సహాయం చేసే స్థితిలో ఉన్నప్పటికీ ఎవరూ కూడా అండగా నిలబడలేదు.  తన ప్రతి విజయం వెనక సార్‌ ప్రోత్సాహం కనిపిస్తుంది.  గురువు అనే వ్యక్తి తనకు ఉన్న లక్ష్యాలను నెరవేర్చుకోలేకపోయినా.. ఆ లక్ష్యాలను చేరుకునేలా గొప్ప విద్యార్థులను తయారు చేయగలరని నిరూపించాడు మా రమేష్‌ సార్‌.

– బుట్టి రమేష్, శిష్యుడు  

>
మరిన్ని వార్తలు