విజ్ఞానమే తలదించుకునేలా!

16 Feb, 2018 03:29 IST|Sakshi

విద్యార్థులకు పసుపు బియ్యం పెట్టిన టీచర్‌

రూ.200 దొంగిలించారని టీచర్‌ ఆరోపణ  

జగిత్యాల జిల్లాలో ఘటన   

గొల్లపల్లి(ధర్మపురి): విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు మూఢనమ్మకాలు పాటించి విద్యార్థులకు పసు పు బియ్యం పెట్టింది. పాఠశాలలో పోగొట్టుకున్న రూ.200 కోసం విద్యార్థులపై దొంగ తనం నెపం మోపి వారితో పసుపు బియ్యం తినిపించింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.  

ఇవ్వకపోతే చచ్చిపోతారని..
రాపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో మొత్తం 19 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో ఇంగ్లిష్‌ టీచర్‌గా పనిచేస్తున్న రజిత పర్సులోని రూ.200 ఈ నెల 6వ తేదీన పోయాయి. విద్యార్థులే తనడబ్బులు దొంగిలించినట్లు ఉపాధ్యాయురాలు భావించింది. మరుసటిరోజు టీచర్‌ పసుపు బియ్యంతో పాఠశాలకు వచ్చింది. 12 మంది విద్యార్థులకు వాటిని పెట్టింది. బియ్యం తిన్నవారు తన డబ్బులు తీయలేదని, తిననివారు దొంగతనం చేసినట్లే అని చెప్పింది. తీసినవారు మరుసటి రోజు డబ్బులు తెచ్చి ఎవరికీ చెప్పకుండా ఇవ్వాలని లేకపోతే చచ్చిపోతారని బెదిరించింది. దీంతో చేసేది లేక విద్యార్థులు పసుపు బియ్యం తిన్నారు. ఈ విషయం ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పారు.

ఈ క్రమంలో గ్రామంలో శివరాత్రి జాతర ఉండటం, పాఠశాలకు సెలవులు వచ్చాయి. పాఠశాల గురువారం ప్రారంభం కావడంతో జరిగిన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి టీచర్‌ రజితను నిలదీశారు. పసుపు ఆంటీబయాటిక్‌ అని ఇది తింటే ఏమీ కాదని దొంగతనం చేసిన డబ్బులు తిరిగి తెస్తారని ఇలా చేసానని తల్లిదండ్రులతో టీచర్‌ చెప్పారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు టీచరుపై చర్య తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు.

క్రమశిక్షణలో పెట్టేందుకే..
పిల్లలకు చెడు అలవాట్లు చేసుకోవద్దని వారిని క్రమశిక్షణలో పెట్టేందుకే పిల్లలకు పసుపు బియ్యం పెట్టాను. నా రూ.200 కోసం ఇలా చేయలేదు. పసుపు బియ్యం కూడా ఆంటిబయాటిక్‌గా పనిచేస్తాయి. వాటితో ఎలాంటి హానీ ఉండదు. విద్యార్థులు దొంగతనం చేసి ఉంటే మరోసారి చేయకుండా భయపెట్టాలని ఇలా చేశాను. నేను చేసింది తప్పు అయితే క్షమించండి. అందరూ నాపై కక్షకట్టి రాద్దాంతం చేస్తున్నారు.   – రజిత, ఇంగ్లిష్‌ టీచర్‌  

మరిన్ని వార్తలు