మే నాటికి గురుకులాల్లో 8,434 పోస్టుల భర్తీ

24 Mar, 2018 03:54 IST|Sakshi

మండలిలో కడియం

240 గురుకుల భవనాలకు స్థలాలు సేకరించామని వెల్లడి

హక్కులకు భంగం కల్గిస్తున్నారంటూ చీఫ్‌ విప్‌పై సతీశ్‌ ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యాలయాల్లో వచ్చే మే నాటికి 8,434 పోస్టులను భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శాసనమండలిలో శుక్రవారం గురు కుల పాఠశాలలపై లఘు చర్చ జరిగింది. 10 మంది సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం సమాధానమిస్తూ.. ఆయా పోస్టులకు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు నిర్వహించిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 70 ఏళ్లలో 296 గురుకులాలు ఏర్పాటైతే, రాష్ట్రం ఏర్పాటు తర్వాత 577 గురుకులాలు అదనంగా ఏర్పాటయ్యా యని తెలిపారు. ఇది ఒక చరిత్రగా అభివర్ణించారు. రాష్ట్రంలో 240 గురుకుల పాఠశాలలకు నూతన భవనాల కోసం స్థలాలను సేకరించా మని చెప్పారు. 4 క్రికెట్‌ అకాడమీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని.. అందులో రెండు బాలికలకు, మరో రెండు బాలురకు కేటాయించామన్నారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ల ఏర్పాటుపై పరిశీలిస్తామని హామీనిచ్చారు.  

ఒక్కో విద్యార్థిపై ఏడాదికి లక్ష ఖర్చు..
పూర్వ కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో సైనిక్‌ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని కడియం చెప్పారు. అక్కడ వచ్చే ఫలితాలను బట్టి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. ఐదు సొసైటీల కింద ఉన్న గురుకులాలను విద్యాశాఖ పరిధిలోకి తేవాలన్న అంశాన్ని సీఎం పరిశీలిస్తున్నారని వెల్లడించారు. ప్రతీ విద్యార్థిపై తమ ప్రభుత్వం ఏడాదికి రూ.లక్ష ఖర్చు చేస్తోందన్నారు. గురుకులాల్లో 2.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. విదేశాల్లో అమలుచేస్తున్న విద్యావిధానాన్ని అధ్యయనం చేయడానికి త్వరలో విదేశాలకు ఒక బృందాన్ని పంపుతామని కడియం తెలిపారు.

సమయం కేటాయించడం వరకే చీఫ్‌ విప్‌ పని: సతీశ్‌
గురుకుల పాఠశాలలపై జరిగిన చర్చ సందర్భంగా అధికార పార్టీ సభ్యుల మధ్యే వాదోపవాదాలు జరిగాయి. అధికార పార్టీకి చెందిన సభ్యుడు పురాణం సతీశ్‌ మాట్లాడుతూ.. కొమురం భీం జిల్లాలో సైనిక్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి  జోక్యం చేసుకొని ‘గురుకులాల్లో సైనిక్‌ స్కూల్‌’ అనాలని చెప్పడంతో సతీశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సభ్యులకు సమయం, అంశం కేటాయించడం వరకే చీఫ్‌విప్‌ పని. సభ్యుల హక్కులకు పాతూరి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. అంతా ఆయనే మాట్లాడుతారు. జోక్యం చేసుకుంటారు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. మరో సభ్యుడు రాములు నాయక్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ‘దాన వీర శూర కర్ణ’లాంటి వారని, అందుకే బడుగువర్గాలకు గురుకులాలను ఏర్పాటు చేశారని కొనియాడారు.

మరిన్ని వార్తలు