ఉపాధ్యాయులలో ఉత్కంఠ

14 Sep, 2014 01:51 IST|Sakshi

సుదీర్ఘకాలం తర్వాత ప్రభుత్వం విద్యాశాఖలో బదిలీలు, రేషనలైజేషన్, సర్వీసు నిబంధనల మార్పును చేపడుతోంది. దీంతో ఉపాధ్యాయులలో ఒకింత ఉత్కంఠ నెలకొంది. ఉన్నతస్థాయి కమిటీ వెలువరించే నివేదిక, నియమ నిబంధనల కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఈ దసరా సెలవులలో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సర్కారు భావిస్తోంది.
 
నిజామాబాద్ అర్బన్: ఉపాధ్యాయులలో ఉత్కంఠ నెలకొంది. వచ్చే దసరా సెలవులలో రేషనలైజేషన్, సర్వీసు నిబంధనలు, పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం వేగంగా కసరత్తు చేయనుండడమే దీనికి ప్రధాన కారణం. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత సర్వీసు నిబంధనల గురించి కమిటీని వేసింది. పాఠశాల విద్య అదనపు డెరైక్టర్ గోపాల్‌రెడ్డి, మోడల్ స్కూల్స్ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి, పాఠ్య పుస్తకాల ప్రచురణ విభాగం డెరైక్టర్ సుధాకర్‌రెడ్డి, జాయింట్ డెరైక్టర్ శ్రీహరితో కూడిన ఈ కమిటీ వీటిపై కసరత్తు చేయనుంది. ఇదివరకే ప్రాథమిక నివేదికను విద్యాశాఖ మంత్రికి అందించారు. ఇందులో ఉన్న నియమ నిబంధనలు ఏమిటో తెలియక ఉపాధ్యాయులు కలవరపడుతున్నారు.
 
అందరి దృష్టీ అటే!

జిల్లాలో 463 ఉన్నత పాఠశాలలు, 973 ప్రాథమిక పాఠశాలలు, 753 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. రెండున్నర లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 10 వేల మంది విద్యా బోధన చేపడుతున్నారు. వీరికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ, రేషనలైజేషన్ ముఖ్యంగా మారాయి. ఈ ఏడాది ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలో ఒకే సారి బదిలీలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిని ఎలా చేస్తారన్నదే ఉపాధ్యాయులకు సందేహం. నాలుగేళ్లు పూర్తిచేసుకున్న ప్రధానోపాధ్యాయులకు ఈసారి త ప్పనిసరిగా స్థాన చలనం కలిగించనున్నారు. ఐదేళ్లు పూర్తయిన ఉనాధ్యాయులను బదిలీ చేయనున్నారు. కనీస బదిలీకి రెండేళ్లుగా నిర్ణయించారు.
 
బదిలీల్లో అదనపు పో స్టులకు సంబంధించి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులను, సీనియర్ ఉపాధ్యాయులను ఎవరిని పక్కకు జరుపుతారనేది సందేహం. జిల్లాస్థాయిలో బదిలీలు చేపడతారా, మండల స్థాయికే పరిమితం చేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2012 మేలో జరిగిన బదిలీలలో టీచర్లు నేటికీ రీలివ్ కాలేదు. వీరి పరిస్థితి ఏమిటన్నదీ తెలియడం లేదు. ఈ బదిలీలు మేనేజ్‌మెంట్ ప్రకారమా, జిల్లా మొత్తం ఒక యూనిట్‌గా బదిలీ చేస్తారా అన్నది చర్చనీయాంశమైంది. ఎంఈఓల నియామకం తర్వాతనే బదిలీలు చేసే అవకాశం ఉంది.
 
రేషనలైజేషన్‌తో 30 పాఠశాలలకు ప్రమాదమే!

రేషనలైజేషన్‌తో జిల్లాలో 30 పాఠశాలలు మూతపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 20 మంది కన్న తక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలను సమీప పా ఠశాలలలో విలీనం చేయనున్నారు. 1:30 ప్రకారం రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలలను మూసి వేయనున్నారు. దీంతో జిల్లాలో 14 పాఠశాలలు ఇతర ప్రాంతాలకు తరలిపోయే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రేషనలైజేషన్ ద్వారా వచ్చే టీచర్లను, కచ్చితమైన నిబంధనలు పాటించి అత్యవసరం ఉన్న మారుమూల ప్రాంతాల పాఠశాలలకే కేటాయించాలని నిర్ణయించారు.
 
సర్‌ప్లస్ టీచర్లు ఉన్నప్పుడు, ఇందులో జూనియర్ ఉన్న టీచ ర్ సర్వీసును, సీనియర్ ఉన్న సర్వీసును ఏది పరిగణలోకి తీసుకుంటారో ముఖ్యంగా మారింది. రేషనలైజేషన్‌లో పాఠశాలలను మూడు కిలోమీటర్ల దూరం, పాఠశాలల సంఖ్య ఆధారంగా చేస్తారన్నది టీచర్లు ఆలోచిస్తున్నారు. ఈసారి పాఠశాలల సహాయకులు సబ్జెక్టును మార్చుకునే అవకాశం కల్పించారు. దీని ప్రకారం టీచర్లకు సబ్జెక్టు పై పట్టుదొరికే అవకాశం ఏర్పడుతుంది. మరో మూడు రోజులలో ఉన్నత స్థాయి కమిటీ నివేదిక, నిబంధనలను బహిర్గతం చేయనుంది. అప్పుడే సందేహాలు తీరు అవకాశముంది.

మరిన్ని వార్తలు