ఆర్జిత సెలవుల పేరిట టీచర్ల అక్రమార్జన..

9 Jun, 2019 07:05 IST|Sakshi

పనిచేయకున్నా ఈఎల్స్‌కు భారీగా దరఖాస్తులు

టెన్త్‌ సప్లిమెంటరీ డ్యూటీ పేరిట సెలవులు తీసుకుంటున్న వైనం 

100% ఫలితాలు వచ్చిన పాఠశాలల్లోనూ ఇదే తంతు

ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆరా తీస్తున్న పాఠశాల విద్యాశాఖ  

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆర్జిత సెలవు(ఈఎల్స్‌)ల ప్రక్రియ గాడితప్పుతోంది. వేసవి సెలవుల్లో విధులు నిర్వహించకున్నా అక్రమంగా పొందుతున్నట్లు విద్యా శాఖ గుర్తించింది. ఒకరిద్దరు కాదు.. ఏకంగా వేలాది మంది బోధన, బోధనేతర సిబ్బంది ఇదే తరహాలో పొందుతున్న వైనంపై విద్యాశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ ఏడాది ఆర్జిత సెలవులకు ఎవరె వరు దరఖాస్తు చేసుకుంటున్నారనే దానిపై ఆ శాఖ ఆరా తీస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, జూనియర్‌ అసి స్టెంట్‌ లేదా సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ విధులు నిర్వహించాలి.

సెలవులు పూర్తయ్యే వరకు వారిద్దరు పాఠశాలలో అందుబాటులో ఉండి ఫెయిలైన విద్యార్థుల నామినల్‌ రోల్స్‌(ఎన్‌ఆర్‌) రూపకల్పన, ఫెయిల్‌ విద్యార్థుల మెమోల జారీ, వారి నుంచి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ఫీజుల స్వీకరణ తదితర పనులు చేయాల్సి ఉంటుంది. వీరితోపాటు పాఠశాల స్వీపర్‌ కూడా విధులకు హాజరుకావాలి. ఉద్యోగి పనిచేసిన రోజుల ఆధారంగా ఆర్జిత సెలవులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఈ విధులు నిర్వహించిన ఉద్యోగికి సగటున 10 నుంచి 24 రోజుల వరకు ఈఎల్స్‌ వస్తాయి. సగటున ఒక్కో ఉద్యోగి సగం నెల వేతనం పొందే అవకాశం ఉంటుంది. ఈ కేటగిరీలో ఏటా రూ.45 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

నూరు శాతం ఫలితాలొచ్చినా.. 
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన విధులను సాధారణంగా నూరు శాతం కంటే తక్కువ ఫలితాలొచ్చిన పాఠశాలల్లోనే నిర్వహిస్తారు. వంద శాతం ఫలితాలొస్తే అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారుండరు. కనుక అక్కడ ప్రత్యేకించి విధులు నిర్వహించాల్సిన పనిలేదు. కానీ నూరుశాతం ఫలితాలు సాధించిన స్కూళ్లలోనూ విధులు నిర్వహించినట్లు రికార్డులు రూపొందించి ఆర్జిత సెలవులు పొందుతున్నారు. గతేడాది పలు స్కూళ్లలో ఇదే తంతు జరిగినట్లు విద్యాశాఖ అధికారులు గుర్తిం చారు. ఈ క్రమంలో ప్రస్తుత ఏడాది ఈఎల్స్‌ దరఖాస్తులను సీరియస్‌గా పరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 11,026 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో ఈ ఏడాది ఏకంగా 4,374 పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించాయి. ఇందులో ప్రైవేటు పాఠశాలలు 2,279 కాగా, 1,580 జిల్లా పరిషత్‌ పాఠశాలలు, 59 ప్రభుత్వ పాఠశాలలు, 33 ఎయిడెడ్‌ పాఠశాలలు, 97 ఆదర్శ పాఠశాలలు, మిగతా కేటగిరీలో కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ పాఠశాలల నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ విధులు నిర్వహించిన కేటగిరీలో ఎందరు ఈఎల్స్‌ పొందుతున్నారనే వివరాలను రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోలను ఆదేశించింది. 

మరిన్ని వార్తలు