సర్వీస్‌ రూల్స్‌పై విద్యాశాఖ కసరత్తు

6 Mar, 2019 03:33 IST|Sakshi

కొత్త జోనల్‌ ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు

రాష్ట్రపతి ఉత్తర్వులను హైకోర్టు కొట్టేయడంతో ప్రత్యామ్నాయం..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు కొత్త సర్వీసు రూల్స్‌ రూపకల్పనపై విద్యా శాఖ కసరత్తు ప్రారం భించింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన కొత్త జోనల్‌ విధానం ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా రూల్స్‌ రూపొందించే పనిలో పడింది. ప్రభుత్వ టీచర్లతో పాటు పంచాయతీరాజ్‌ టీచర్లను లోకల్‌ కేడర్‌గా ఆర్గనైజ్‌ చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టుకు కొట్టేయడంతో ప్రత్యా మ్నాయ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానానికి 2018 ఆగస్టులో రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దానికి అనుగుణంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. దానికంటే ముందే పంచాయతీరాజ్‌ టీచర్లను లోకల్‌ కేడర్‌గా ఆర్గనైజ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని సవాల్‌ చేస్తూ ప్రభుత్వ టీచర్లు హైకోర్టును ఆశ్రయించడంతో కొట్టేసింది. దీంతో ఆ తర్వాత వచ్చిన జోనల్‌ విధానానికి అనుగుణంగా మళ్లీ సర్వీసు రూల్స్‌ రూపకల్పనకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది.

అందులో కొత్త జోన్లతో పాటు జిల్లా కేడర్, జోనల్‌ కేడర్, మల్టీ జోన్‌ కేడర్లే ఉండేలా, 95 శాతం పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసేలా సవరణలు చేస్తూ రాష్ట్రపతి కొత్త జోన్లకు ఆమోదం తెలిపారు. అందులో మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, గవర్నమెంట్‌ టీచర్లు/ తత్సమాన కేటగిరీల వారు నాన్‌ గెజిటెడ్‌ కేటగిరీలోని జిల్లా కేడర్‌ పరిధిలోకి వస్తారని పేర్కొన్నారు. కొత్త జోనల్‌ విధానానికి రాష్ట్రపతి ఆమోదం ఉన్నందున అదే ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్ని మేనేజ్‌మెంట్ల టీచర్లు ఒకే కేటగిరీలో లోకల్‌ కేడర్‌గా పేర్కొన్న నేపథ్యంలో సర్వీసు రూల్స్‌ రూపకల్పనకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వాటిపైనా గతంలో కొందరు ప్రభుత్వ టీచర్లు కోర్టును ఆశ్రయించారు. జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గవర్నమెంట్‌ టీచర్లంతా లోకల్‌ కేడర్‌గా పేర్కొనడాన్ని సవాల్‌ చేసినా కోర్టు ఆ ఉత్తర్వులను కొట్టేయలేదు. తదుపరి విచారణ చేపట్టే దాకా ఎలాంటి చర్యలు చేపట్టొద్దని చెప్పిందని ప్రభుత్వ టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.వీరాచారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి రూల్స్‌ను రూపొందించి సిద్ధంగా ఉంటే కోర్టులో కేసు మళ్లీ విచారణకు వచ్చిన వెంటనే తదుపరి చర్యలు చేపట్టొచ్చని విద్యా శాఖ భావిస్తోంది. 

మరిన్ని వార్తలు