టీచర్ల బదిలీల షెడ్యూల్‌ ప్రకటించాలి

26 Feb, 2018 03:10 IST|Sakshi

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ డిమాండ్‌  

హైదరాబాద్‌: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(టీఎస్‌యూటీఎఫ్‌) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆదివారం హైదరాబాద్‌ దోమలగూడలోని యూటీఎఫ్‌ కార్యాల యంలో ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ రాములు అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో రెండేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారన్నారు. సర్వీస్‌ రూల్స్‌ సమస్య కోర్టు వివాదంలో ఉన్నందున ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా బదిలీలు, పదోన్నతుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు.

ఉప విద్యాధికారి, మండల విద్యాధికారి వంటి పర్యవేక్షణాధికారి పోస్టులు అధిక సంఖ్యలో ఖాళీగా ఉండటంతో విద్యా రంగం కుంటుపడుతోందని పేర్కొన్నారు. అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్‌లతో పదోన్నతుల ద్వారా జూనియర్, డైట్‌ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యా మిషన్‌ను ప్రక టించాలని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తరగతికొక ఉపాధ్యాయుడు, తరగతి గది ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌టీఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షుడు నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఎస్‌టీఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు సంయుక్త, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, ఉపాధ్యక్షులు సోమశేఖర్, దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు