వెట్టి కన్నా ఘోరం

1 May, 2018 22:20 IST|Sakshi

ప్రైవేటు విద్యా సంస్థల్లో బోధన సిబ్బంది అష్టకష్టాలు

చాలీచాలని వేతనాలు... అవీ ఎప్పుడిస్తారో తెలియదు

పండుగలు, జాతీయ సెలవు దినాల్లోనూ తప్పని విధులు

సాక్షి, అమరావతి : అక్కడ పని వెట్టి కన్నా ఘోరం.  చట్టాలు, నియమ నిబంధనలూ అస్సలు పట్టవు. ఉద్యోగం ఎన్నాళ్లుంటుందో... ఎప్పుడు తీసేస్తారో తెలియదు. ఇచ్చే వేతనాలూ అరకొర... అవీ ఎప్పుడిస్తారో దేవుడికే ఎరుక. ఇక మహిళల పరిస్థితి మరింత దారుణం. లైంగిక వేధింపులు షరా మామూలే. గర్భిణులు, బాలింతలకు ఇవ్వాల్సిన సెలవులు వీరికి వర్తించవు. ఇలా ఎన్ని చెప్పుకొన్నా తరగని ఈ వెతలు ప్రైవేటు విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందివి.   

నియమాలు చట్టుబండలు...
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో కేవలం హైస్కూలు స్థాయి వరకే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎక్కువ ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, బీఈడీ, డీఈడీ ఇలా ఇతర కాలేజీలన్నీ అత్యధికం ప్రైవేటులోనే ఉన్నాయి. విద్యార్ధులూ ప్రభుత్వ సంస్థల్లో కన్నా ప్రైవేటులోనే అత్యధికంగా ఉన్నారు. వీరి నుంచి కోట్ల కొద్దీ సొమ్మును ఫీజుల రూపేణా వసూలు చేస్తున్న ఈ సంస్థలు.. సిబ్బందికి చెల్లించేది మాత్రం నామమాత్రమే. స్కూళ్లు, కాలేజీల్లో కలిపి దాదాపు 5 లక్షల మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు పనిచేస్తున్నట్లు అంచనా. సిబ్బంది గురించి స్పష్టమైన గణాంకాలను ఆయా సంస్థలు ఇవ్వకుండా రికార్డులను వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు వేలల్లో∙ఉన్నాయి. వీటిలో దాదాపు 5.5 నుంచి 6 లక్షల మంది వరకు బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని 61 వేల బడుల్లో ప్రైవేటు స్కూళ్ల సంఖ్య తక్కువే అయినా మొత్తం 72 లక్షల మందిలో సగం వీటిల్లోనే చదువుతున్నారు. ఇంటర్మీడియెట్‌లో 9 లక్షల మంది విద్యార్థులుండగా వీరిలో కేవలం 2 లక్షల మందే ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్నారు. మిగిలిన వారు ప్రైవేటులోనే ఉన్నారు. డిగ్రీ కళాశాలల విషయంలోనూ ఇదే పరిస్థితి. 

దయనీయ పరిస్థితులు


  • బీఈడీ, ఎంఈడీ సహా పలు విద్యార్హతలున్న వారికి సైతం ఇచ్చేది రూ.10 నుంచి రూ.15 వేలే. అదికూడా 10 నెలలే. 

  • ఏడాదిపాటు చెప్పాల్సిన సిలబస్‌ను 5 నెలల్లో ముగించి టీచర్లను బయటకు పంపేస్తున్నారు. 

  • సీనియారిటీ పెరిగిన ఉద్యోగులకు వేతనాలుపెంచాల్సి వస్తుందన్న కారణంతో అకారణంగా ఉద్యోగం మానిపిస్తున్నారు.

  • స్కూల్‌/కాలేజీల్లో పిల్లల్ని చేర్పించే టీచర్ల మీదే మోపుతున్నారు. ఇందులో టార్గెట్లు చేరుకోవాలి.

  • ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీçసుకొని, ఇవ్వకుండా వేధిస్తున్నారు. 

  • ఆదివారాలు, పండగలు, జాతీయ పర్వదినాల్లోనూ సిబ్బందికి సెలవు ఇవ్వరు. 
  • సరైన వసతులు ఉండవు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు నిల్చునే పనిచేయాలి. 

మహిళల పరిస్థితి మరీ దారుణం..
మహిళా సిబ్బంది పరిస్థితి మరింత దయనీయం. మెటర్నీటీ లీవులు లేవు. నిండు గర్భంతో ఉన్నా విధులకు రావాల్సిందే. లేదంటే ఉద్యోగం మానుకోవాలి. కొన్ని సంస్థల్లో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులూ జరుగుతున్నాయి. అవేవీ బయటకు రాకుండా యాజమాన్యాలు మేనేజ్‌ చేస్తున్నాయి. ఈ సంస్థల్లో విద్యార్ధులే కాదు టీచర్లూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

చట్టం ఏం చెబుతోందంటే...


  • ప్రభుత్వ పాఠ్యప్రణాళికను, పాఠ్యాంశాలను, సమయవేళలను తప్పనిసరిగా అనుసరించాలి. 

  • విద్యాసంస్థలను వ్యాపార దృక్పథంతో నడపరాదు. 

  • ఉద్యోగ నియామకాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాలి. 

  • పీఎఫ్‌ వంటి ప్రభుత్వ నిబంధనలను టీచర్లకు, సిబ్బందికి వర్తింపచేయాలి. 

  • ఫీజుల్లో 5 శాతం మేనేజ్‌మెంటు ఉంచుకోవచ్చు, 15 శాతం స్కూలు నిర్వహణకు, 50 శాతం వేతనాలకు వినియోగించాలి.

  • 15 శాతం మొత్తాన్ని సిబ్బంది గ్రాట్యుటీ, ప్రావిడెంటు ఫండ్, ఇన్సూరెన్సుల కింద మేనేజ్‌మెంటు వాటాగా చెల్లించడానికి వినియోగించాలి.
  • ఉద్యోగుల్ని ఏకపక్షంగా తొలగించే అధికారం యాజమాన్యానికి లేదు. విధి నిర్వహణలో సరిగా లేకుంటే ఇంక్రిమెంట్ల కోత, సీనియార్టీ తగ్గింపు, అలవెన్సుల్లో కోత, వంటివి విధించవచ్చు.

మరిన్ని వార్తలు