టెక్నాలజీతోనే నవ భారతం

14 Dec, 2014 02:04 IST|Sakshi
టెక్నాలజీతోనే నవ భారతం
  •  ‘టెక్ ఫర్ సేవా’ జాతీయ సదస్సులో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
  • సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నవభారతాన్ని నిర్మించేందుకు కార్పొరేట్లు, టెక్నోక్రాట్లు, స్వచ్ఛంధ సంస్థలు ముందుకు రావాలని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. దేశ నైపుణ్యానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోడైతే ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ ఇట్టే సాధ్యమవుతుందన్నారు.

    శనివారం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్(నిథిమ్)లో సేవా భారతి, యూత్ ఫర్ సేవ సంస్థలు  నిర్వహించిన ‘టెక్ ఫర్ సేవా’ సదస్సులో ఆయన  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీని ప్రజలకు చేరువ చేసేందుకు త్రీ-ఎస్ (స్పీడ్, స్కేల్, స్కిల్స్), త్రీ-డీ (డెమోక్రసీ, డెమోగ్రఫీ, డిమాండ్), త్రీ-ఈ (ఎడ్యుకేషన్, ఈ-కామర్స్, ఈ-హెల్త్) విధానాలను అవలంబిస్తున్నామన్నారు.

    వివిధ భాషల అనువాద ప్రక్రియను సులువు చేసేందుకు దేశంలోని అన్ని భాషలను డిజిటైజేషన్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో పరిచయాలను పెంచే ఉద్దేశంతోనే ‘టెక్ ఫర్ సేవా’ సదస్సు నిర్వహిస్తున్నట్లు సేవా భారతి సంస్థ తెలంగాణ యూనిట్ ప్రధాన కార్యదర్శి వీరవెల్లి రఘునాథ్ అన్నారు.  డీఆర్‌డీవో చైర్మన్ సారస్వత్ మాట్లాడుతూ.. మనిషి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు టెక్నాలజీ  దోహదపడుతుందన్నారు.
     
    తెలంగాణ, ఏపీల్లో 6 ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు

    ‘‘ఎలక్ట్రానిక్ వస్తూత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించేందుకు దేశంలో 20 క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెరో క్లస్టర్ మంజూరు చేశాం. అదనంగా ఒక్కో క్లస్టర్ మంజూరు చేసే ప్రక్రియ జరుగుతోంది. ఇద్దరు సీఎంల కోరిక మేరకు తెలంగాణలో మూడు, ఏపీలో మూడు చొప్పున మొత్తం 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం’’ అని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి రవిశంకర్‌ప్రసాద్ హామీ ఇచ్చారు.  

    కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవాల భాగంగా కూకట్‌పల్లి జేఎన్‌టీయూ కళాశాల ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావుతో కలసి ఆయన పాల్గొన్నారు.

    ‘నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్’(ఎన్‌ఓఎఫ్‌ఎన్) కార్యక్రమంలో భాగంగా మూడేళ్లలో దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలను ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తామన్నారు. దీనితో ఎలక్ట్రానిక్ ఆధారిత విద్య, వైద్యం, వ్యాపార రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఎన్‌ఓఎఫ్‌ఎన్ ఏర్పాటులో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
     

మరిన్ని వార్తలు