మానవ మేధస్సును మించింది లేదు

27 Apr, 2019 05:45 IST|Sakshi

సెల్‌ఫోన్‌లకు బానిసలు కావద్దు

విద్యార్థులకు గవర్నర్‌ సూచన

జేఎన్టీయూహెచ్‌ స్నాతకోత్సవంలో పాల్గొన్న నరసింహన్‌

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులు చేసిన పరిశోధనలు దేశానికి ఉపయోగపడాలని అప్పుడే వారి చదువుకు సార్థకత లభిస్తుందని తెలుగు రాష్ట్రాల గవర్నర్, జేఎన్టీయూహెచ్‌ చాన్స్‌లర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ వ్యాఖ్యానించారు. కూకట్‌పల్లిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌లో శుక్రవారం 8వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన గవర్నర్‌ మాట్లాడుతూ, విద్యార్థులు సెల్‌ఫోన్‌లకు బానిసలుగా మారవద్దని సూచించారు. కృత్రిమ మేధస్సుతో రూపొందించిన సాంకేతిక వస్తువులు జీవితంలో సౌకర్యాలను సులభతరం చేస్తాయి కానీ మానవ మేధస్సుకు ప్రతి రూపాలు కాలేవని అన్నారు. మానవ మేధస్సును మించింది లేదని ఉద్ఘాటించారు. జేఎన్టీయూహెచ్‌కు ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని.. ఇది మనందరికీ గర్వకారణం అని అన్నారు.

యూనివర్సిటీలోని ప్రయోగశాలలో నిత్యం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయని వాటి ఫలాలు క్షేత్రస్థాయిలో విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు నేర్చుకోవడం అనేది నిరంతర అభ్యాసంగా స్వీకరించాలని సూచించారు. సాంకేతికతను వినియోగించి ఆహార భద్రత, ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణకు పరిశోధనలు సాగాలని కోరారు. ఆరోగ్య భద్రతా రంగంలోనూ పరిశోధనలు చాలా అవసరం అని అభిప్రాయపడ్డారు. ప్రజలకు తక్కువ ధరకే వైద్యం అందించేలా సాంకేతికత మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టెక్నా లజీ పెరుగుతున్న కొద్దీ సమస్యలు పెరుగుతాయనడానికి సైబర్‌ టెర్రరిజం ఒక ప్రధాన ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. సైబర్‌ టెర్రరిజం నుంచి ముప్పు ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటని ఆయన అన్నారు. ఈ ఏడాది పట్టాలు పొందిన వారు చేసిన పరిశోధనల వివరాలన్నింటినీ తనకు అందించాలని వైస్‌ చాన్స్‌లర్‌ ఎ.వేణుగోపాల్‌రెడ్డిని కోరారు.  

పీహెచ్‌డీ పట్టాల ప్రదానం..
మేనేజ్‌మెంట్‌ కోర్సెస్‌ ఇన్‌ క్రైమ్‌ అనే అంశంపై ఏడీజీపీ (లా అండ్‌ ఆర్డర్‌) జితేందర్‌ పీహెచ్‌డీ పూర్తి చేయడంతో ఆయనకు గవర్నర్‌ చేతుల మీదుగా పట్టాను అందించారు. ఈ స్నాతకోత్సవంలో 2017–18 సంవత్సరానికి గానూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన 42 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందించారు. అదే విధంగా 217 మంది విద్యార్థులకు పీహెచ్‌డీ పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ యూబీ దేశాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా