‘టెక్‌’ సాయం!

29 Nov, 2017 02:53 IST|Sakshi

భవిష్యత్‌లో కొత్త పుంతలు తొక్కనున్న సాగు

జీఈఎస్‌లో నేడు ఈ అంశంపై చర్చ

కలుపు తీసే రోబోలు..
వ్యవసాయంలో రైతులకు ఖర్చు పెంచే కార్యక్రమాల్లో కలుపుతీత ఒకటి. కూలీల కు డిమాండ్‌ పెరిగిపో తున్న తరుణంలో పలు సంస్థలు కలుపుతీతకు యంత్రాలను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. రూంబా పేరు తో కొన్నేళ్ల క్రితం కృత్రిమ మేధస్సు(ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఆధారంగా పనిచేసే వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను తయారు చేసిన కంపెనీ... తాజాగా టెట్రిల్‌ పేరుతో కలుపుతీత యంత్రాన్ని అభివృద్ధి చేసింది.

ఆప్టికల్‌ సెన్సర్ల సాయంతో కలుపు మొక్కలను గుర్తించి నాశనం చేసే ఈ యంత్రం ప్రస్తుతానికి పెరటి పంటలకు పనికొస్తుంది. మరోవైపు బాష్‌ లాంటి అంతర్జాతీయ సంస్థలు పొలాల్లో పనిచేయగల కలుపుతీత రోబోలను సిద్ధం చేస్తున్నాయి. ఈ యంత్రాలు కలుపు మొక్కలను గుర్తించి.. అక్కడికక్కడే భూమిలో కలిపేస్తాయి. మరికొన్ని కంపెనీలు కేవలం కలుపు మొక్కలపై మాత్రమే రసాయన మందులను చల్లే యంత్రాలను తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి.

దుక్కిదున్నే ట్రాక్టర్‌..
డ్రైవర్‌ అవసరం లేని కార్ల గురించి వినే ఉంటాం. అదే టెక్నాలజీ ద్వారా వ్యవసాయానికి సాయం చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి పలు కంపెనీలు. నిజానికి డ్రైవర్ల అవసరం లేని ట్రాక్టర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నా.. వాటిని రిమోట్‌ కంట్రోల్‌లో నడపాల్సి ఉండేది. ఇప్పుడా పని కూడా తప్పిపోయింది. కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌ సెన్సర్ల సాయంతో పొలం తీరుతెన్నులు, వాతావరణం వంటి విషయాలను పరిశీలిస్తే.. ట్రాక్టర్‌ తన పని తాను చేసుకుపోతుంది. దుక్కి దున్నడంతోపాటు విత్తనాలు వేయడం, ఎరువులు చల్లడం వంటి అన్ని పనులు చేసేస్తుంది. ఒకే పనిని మళ్లీ మళ్లీ చేయడం, వనరుల వృథాను అరికట్టడం ద్వారా డ్రైవర్‌లెస్‌ ట్రాక్టర్లు రైతులకు ఎంతో లాభం చేకూరుస్తాయని ట్రాక్టర్ల తయారీ రంగంలో అగ్రగామి అయిన జాన్‌ డీర్‌ సంస్థ చెబుతోంది.

పంటల నిర్వహణకు డ్రోన్లు
మానవరహిత విమానాలు లేదా క్లుప్తంగా డ్రోన్లు విదేశాల్లో వ్యవసాయంలోనూ కీలక పోషిస్తున్నాయి. పంట ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనించేందుకు, చీడపీడలు వస్తే వెంటనే గుర్తించి.. తగిన నివారణ చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. పొలంలోని ప్రతి ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి చీడపీడలు, పోషక లోపాలను గుర్తించేందుకు వీలుగా సెన్సర్లు, ఇతర టెక్నాలజీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. న్యూజిలాండ్‌లో ఎరువులు చల్లే డ్రోన్లకు ఇటీవలే అక్కడి ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చేసింది. చైనా అభివృద్ధి చేసిన ‘ద ఆగ్రాస్‌ ఎంజీ–1’డ్రోన్‌ కేవలం పది నిమిషాల్లో ఎకరా పొలంపై మందులు చల్లేయగలదు.

భూసార పరీక్షలకు కూడా..
అందుబాటులో ఉండే వనరులను వీలైనంత సమర్థంగా వాడుకోవడమన్నది ఏ రైతుకైనా మేలు చేసేదే. కాకపోతే అది ఎలా సాధ్యమన్నదే ప్రశ్న. ఈ లోటును పూరించేందుకు ప్రత్యేకమైన సెన్సర్లు అందుబాటులోకి వస్తున్నాయి. పొలంలోని నిర్దిష్ట ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేసుకుంటే చాలు.. నేలలో తేమ ఎంత ఉంది? పోషకాల పరిస్థితి ఏమిటి? ఎక్కడ ఎరువులు ఎక్కువ వేయాలి? ఎక్కడ తక్కువేసినా సరిపోతుంది? వంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ సెన్సర్లు ఇచ్చే సమాచారాన్ని హైటెక్‌ డ్రోన్లు, ట్రాక్టర్లకు అనుసంధానించుకుంటే రైతు పని మరింత సులువైపోతుంది.

కాయలెప్పుడు కోయాలో రోబోలు చూసుకుంటాయి
పత్తి సాగు చేసే ఏ రైతునైనా అడగండి.. పత్తి ఏరడానికయ్యే ఖర్చు, శ్రమ చాలా ఎక్కువని అంటారు. పత్తిని సకాలంలో తీయడం, తిరిగి పెరగగానే మళ్లీ తీయడం దీనికి కారణం. మరిన్ని పంటల్లోనూ ఇదే తరహా పరిస్థితి ఉంటుంది. ఉత్పత్తిని తీయడంలో ఆలస్యమైతే.. దిగుబడి దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో కాయల్ని నిత్యం పరిశీలిస్తూ.. సరైన సమయంలో వాటిని కోసేందుకు కూడా రోబోలు సిద్ధమవుతున్నాయి. విదేశాల్లో ఇప్పటికే స్టాబెర్రీలు, కివీలు వంటి చాలా పంటలకు ఇలాంటి రోబోలు అందుబాటులో ఉన్నాయి.

వ్యవసాయం ఎప్పుడూ ఆశల జూదమే.. కురవని చినుకు.. పెరిగిపోతున్న కూలీల ఖర్చులు.. ఎరువులు, విత్తనాలు సరిగా వేయలేని నైపుణ్య లేమి.. తద్వారా తగ్గే దిగుబడి.. కానీ ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని వ్యవసాయం కొత్త పుంతలు తొక్కనుంది. రానున్న కాలంలో వ్యవసాయానికి ‘టెక్‌’సాయం అందనుంది.. ఆ సంగతులేమిటో చూద్దామా..

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు