అబ్దుల్లాపూర్‌మెట్‌లోనే తహసీల్దార్‌ కార్యాలయం!

21 Nov, 2019 05:00 IST|Sakshi

పెద్దఅంబర్‌పేట: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం ఘటన అనంతరం మూతపడిన ఆ కార్యాలయం తరలింపుపై జరుగుతున్న తర్జనభర్జనలు కొలిక్కి వచ్చినట్టేనని తెలుస్తోంది. అబ్దుల్లా పూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని హయత్‌నగర్‌ మండలానికి తరలించాలని అధికారులు చేసిన ప్రయత్నాలకు ప్రజలనుంచి వ్యతిరేకత రావడంతో అధికారులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. విజయారెడ్డి హత్య ఘటన అనంతరం సరూర్‌నగర్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినా ఆయన ఇక్కడికి రావడానికి విముఖత చూపారు.

ఇక్కడి సిబ్బంది కూడా కార్యాలయ భవనాన్ని మారిస్తేనే విధులకు హాజరవుతామని ఉన్నతాధికారులకు చెప్పారు. దీంతో ఈ కార్యాలయాన్ని హయత్‌నగర్‌ మండలానికి తరలించాలని అధికారులు ప్రయత్నించారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకతరావడంతో.. స్థానికంగానే మరో భవనాన్ని పరిశీలించారు. దీనిపై రెండ్రోజుల్లో స్పష్టత రానుంది. కాగా, ప్రభుత్వం షేక్‌పేట మండల తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డిని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయన గురువారం లేదా శుక్రవారం రానున్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు