‘ఇడ్లీ.. వడ.. దోసె’ నాస్టాకి ఏం గావాల్నో సెప్పు..

4 Dec, 2018 08:23 IST|Sakshi

మల్లేసన్నా.. నాస్టాకి ఏం గావాల్నో సెప్పు.. ఇడ్లీ వడ దోసె’ పక్తు సర్వర్‌ లెక్క ఎంకటేసులు గట్ల స్టయిల్గ నిల్సుని అడుగుతుంటె నాకు నవ్వాగలె. సేతిలో సిన్న బుక్కు పట్కుని పొద్దుగాల్నే వచ్చి గిట్లడుగుతున్నడేంది అనుకున్న. ‘అరె.. పొద్దున్నే తమాషా సురు జేసినవ్‌. ఏంది కత’ కోపంగ అడిగిన. ‘నాకేం దెల్సు గా పరమేసన్న నిన్న సెప్పిండు. రేపు మీ గల్లీల అందర్కి నాస్ట దావత్‌ పెట్టించాలె. గదీ ఎవరికి ఏదిస్టమో దెల్సుకుని ఓటల్‌నుంచి తీస్కరావాలె.. తేడా వస్తె కస్టం మల్ల’ అన్నడు. అందుకే ఎందుకొచ్చిన పంచాయితీ అని గీ బుక్కుల రాసుకుంటున్న. జల్దీ సెప్పే అందర్వి రాస్కోవాలంటూ తొందరబెట్టిండు. ఆ పారాచూటు పరమేసన్న చివరికి టిపిన్లు బోజనం పెట్టిస్తుండ్రు. జూసిండ్రా గీ ఎలచ్చన్ల జోరు. మా పరమేసన్న తిండి పెట్టించేందుక్కూడా సిద్దమైండు.  

పరమేసన్న ఏం కర్మ. ఊర్లో అన్ని చోట్ల గిదే జాతర. మందు డబ్బులు సుత ఇస్తుండ్రంట. కానీ ఈసారి ఎలచ్చన్ల గిట్ల దావత్‌లు ఇచ్చుడే కొత్త. నిన్నటి దాన్కా కార్తీకమాసం పేరుతో జనాల్ని పోగేసి వనబోజనాలు పెట్టిండ్రు. గదీ ముగిసిపాయె. కానీ ఓటింగ్‌కి ఇంకా టైమున్నదె, ఏం జేయాల అని ఆలోచించి గీ ప్లాను ఏసినట్టుండ్రు. జనాల్ని పోగేసి పంక్షన్లు పెడ్తే అందర్కి దెల్సిపోతుందని న్యాక్‌గ వాన్‌లలో టిపిన్‌ పాకెట్లు దెచ్చి సీదా ఇండ్లకే ఇస్తుండ్రంట. అంటే పాలపాకెట్టు.. పేపర్లు సప్లయి జేస్తున్నట్లు గీ మూడ్రోజులు టిపిన్‌ బోజనం పాకెట్లు గూడ సప్లయి జేస్తరేమో మల్ల. ఏమైన సెప్పుండ్రి గీ కాండేట్ల అవస్తలు మామూలుగా లేదులె. ఎందుకన్న నిలుసున్నామా అనుకుటుండ్రేమో. పైసల్‌ పంచాల్నా.. టిపిన్లు.. దావత్‌లు పెట్టించాల్నా.. మందు పోయించాల్నా. గివన్నీ గా ఎగస్‌ పార్టీవోల్లకి, పోలీసులకు దెలీకుండ సూస్కోవాల్నా.. గింత జేసి ఆల్లు ఓటేస్తరో లేదో అని చూస్తూ కూసోవాలె. కర్చుకి కర్చు.. టెన్సన్‌కి టెన్సన్‌. థూ ఏందిర గీ కర్మ.. గెలుస్తమో లేదో గాని ఈ ఎలచ్చన్లు జల్దీ ముగుస్తె అంతే సాలు.. అంటుండ్రు.
 
గీ జనాలేం తక్కువ గాద్లే. సానా ఉషార్‌. మొన్న ఓ కాండేటు అపార్టుమెంట్‌ల ఎల్లి నాకు ఓటేయండ్రి.. ఏం గావాలన్న జేసి పెడ్త అన్నడంట. ఆల్లు గట్లేం లేదన్న నీకే ఓటేస్తం పైసల్‌ వద్దు గానీ గీ బిల్డింగ్‌కి జరంత రంగేసివ్వరాదె అని అడిగిండ్రంట. అరె దాన్దేముందమ్మ మీరడగాలె గానీ.. అన్న రంగేసేకి ఎంతవుదే అని ఆరా దీస్తే లక్షల్లో దేలింది. ఇంకేం మాట్లాడకుండా కాండేటు సరే చూస్తలె వస్త అంటూ జారుకుండంట. పైసల్‌ పంచనీకి డబ్బులు కట్లు కట్లు దీస్కొస్తుంటే పోలీసోల్లు పట్టేసుకుంటుండ్రని.. పికర్‌ గాకుండ్రి మీ బాంకుల ఏస్తం అని కాండేట్లు డబ్బు పంచుడుకు కొత్తదార్లు ఎదుకుతుండ్రు. గట్లనే మందు పోయడానికి ముందుగనే సీసాలు దెచ్చి నిల్వబెట్టిండ్రు. ఏం తెల్వి గీల్లది. గా దిమాకేదో జనాల్కి జరంత మంచి జేసేందుకు వాడ్తే ఎంత మంచిగుండు. అయినా గింత సొమ్ము పెట్టినోల్లు గెల్సినంక యిడుస్తర.. అంతకంత తింటరు. అందుకే ఈల్లు ఎందుకింత కరుసు జేస్తుండ్రో మనం కూడా తెల్సుకోవాలె. పనిజేసేటోల్లనే గెలిపించుకోవాలె!!      – రామదుర్గం మధుసూదనరావు   

మరిన్ని వార్తలు