బర్గర్లు, చిప్స్‌ వద్దు.. సంప్రదాయ ఆహారమే మేలు

11 Oct, 2019 07:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సంప్రదాయ వంటకాలతో పాటు, పోషకాహారాన్ని పిల్లలకు ఇవ్వడం ద్వారా వారిని ఆరోగ్యసౌభాగ్యవంతులుగా తయారు చేయవచ్చని రాష్ట్రంలోని మాతృమూర్తులకు గవర్నర్‌ డా.తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. పిల్లల ఆధునిక జీవనశైలి కారణంగా 25%మంది ఊబకాయంతోపాటు, మరో 33 శాతం మంది పోషకాహార లేమితో బాధపడుతున్నట్టు పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి తాను ఆందోళనకు గురైనట్టు చెప్పారు.తాను డాక్టర్‌ను కూడా అయినందున పిల్లలకు బర్గర్లు, చిప్స్‌కు బదులు పోషక విలువలున్న సంప్రదాయ ఆహారాన్ని ఇవ్వాలని సూచిస్తున్నానన్నారు.

గురువారం జలవిహార్‌లో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె బి.విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా మిలన్‌ ’అలయ్‌ బలయ్‌’లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేందుకు సంప్రదాయబద్ధమైన ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని, 15 ఏళ్లుగా దీన్ని నిర్వహించడం గొప్ప విషయమని తమిళిసై పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన చిందు భాగవతం, యక్షగానం, గుస్సాడి, ఇతర సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.   

హిమాచల్, తెలంగాణల సహకారానికి కృషి : దత్తాత్రేయ
 
హిమాచల్‌ప్రదేశ్‌ను తెలంగాణతో అనుసంధానించి, పర్యాటకం, పరిశ్రమలు, తదితర రంగాల్లో పరస్పర సహకరించుకోడానికి ఆ రాష్ట్ర మంత్రులు, అధికారులు ఇక్కడ పర్యటించేలా చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తన ప్రసంగంలో తెలిపారు. అలయ్‌ బలయ్‌ స్ఫూర్తితో రాజకీయాలకు అతీతంగా దేశాభివృద్ధికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమ నిర్వహణ అభినందనీయమని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. అందరినీ ఒకచోటకు చేర్చేలా ఈ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.  తెలంగాణ సంస్కృతి, తెలుగు భాషను అభివృద్ధి చేసి సాంస్కృతిక విప్లవం తేవాలని మహారాష్ట్ర మాజీ గవ ర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగరరావు అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లోని ప్రముఖులను సత్కరించారు. 

మరిన్ని వార్తలు