నేటి నుంచి దిద్దుబాట

15 Apr, 2019 07:29 IST|Sakshi

విధుల్లోకి వచ్చేందుకు కొందరు ఉపాధ్యాయులు విముఖత

ఈనెల 26 వరకు ‘పది’ మూల్యాంకనం 

కరీంనగర్‌ఎడ్యుకేషన్‌: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కరీంనగర్‌ జిల్లా కేంద్రం జ్యోతినగర్‌లోని సెయింట్‌జాన్‌ పాఠశాలలో ఉమ్మడి జిల్లా పరిధిలోని విద్యార్థుల జవాబు పత్రాల మూల్యంకనం జరుగనుంది. మూల్యంకనానికి కొందరు ఉపాధ్యాయులు హాజరయ్యేందుకు వెనుకాడుతున్నారు. నాలుగు జిల్లాల ఉపాధ్యాయులు హాజరుకావాల్సి ఉండగా కొందరు గైర్హాజరయ్యే అవకాశం ఉంది. గతేడాది ఆయా జిల్లాల పరిధిలో అనేక మంది ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారు. ఉన్నతాధికారులు వారికి నోటిసులు జారీ చేసినా.. ఎలాంటి ఫలితం కనిపించలేదు.. తాజాగా ప్రారంభం కానున్న మూల్యంకన ప్రక్రియకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు హాజరు కావడంపై సందేహాలు తలెత్తుతున్నాయి.

జిల్లా కేంద్రంలో 11 రోజులపాటు జరిగే ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులు రాకపోతే మూల్యాకంనం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 
ఉమ్మడి జిల్లాలో పదో తరగతి పరీక్షలు ఈనెల 3వ తేదీన పూర్తయ్యాయి. జిల్లాకు సంబంధించిన జవాబు పత్రాలు మూల్యాంకనం కోసం ఇతర జిల్లాలకు పంపించారు. వేరే జిల్లాలవి మన దగ్గరకు వస్తాయి. వీటిని మూల్యంకనం చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకు ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. జవాబుపత్రాల దిద్దే బాధ్యతలను సబ్జెక్టుల వారీగా స్కూల్‌ అసిస్టెంట్లు(ఎస్‌ఏ)లకు అప్పగించగా, వారి సహాయకులుగా ఎస్జీటీలకు విధులు కేటాయిస్తారు. ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి కరీంనగర్‌లోనే మూల్యాంకనం చేపడుతున్నారు.

మూడేళ్ల క్రితం జిల్లాల విభజన జరగడంతో ఆయా జిల్లాలోనే నిర్వహించాలని పలు డిమాండ్లు వినిపించాయి. కానీ ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే నిర్వహించాలని సూచించడంతో కరీంనగర్‌లోనే నిర్వహిస్తున్నారు. జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలతోపాటు కరీంనగర్‌ జిల్లాకు చెందిన కొందరు ఉపాధ్యాయులు మూల్యాంకనానికి హాజరయ్యేందుకు ఆసక్తి చూపడంలేదు. కొందరు అనారోగ్య కారణాలరీత్యా రాకపోగా.. మరికొందరు ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరవుతున్నట్లు ఆరోపణలున్నాయి. సబ్జెక్టుల వారీగా నియమించిన ఉపాధ్యాయులు రాకపోతే ఉన్నవారిపై భారం పడటంతోపాటు మూల్యాంకన ప్రక్రియ ఆలస్యం అయ్యేందుకు అస్కారం ఉంటుంది.

11 రోజులు మూల్యాంకనం..
సోమవారం నుంచి ప్రారంభమయ్యే మూల్యాంకన ప్రక్రియ ఈనెల 26వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13,727 మంది ఉపాధ్యాయులు ఉండగా ప్రశ్నపత్రాల మూల్యంకనానికి జిల్లా వ్యాప్తంగా చీఫ్‌ ఎగ్జామినర్లు, ఉపాధ్యాయులు, అసిస్టెంట్‌ సహాయకులుగా 4 వేల మంది ఇప్పటికే విధుల్లోకి హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కొంత మంది ఉపాధ్యాయులు అనారోగ్యంతోపాటు రకరకాల కారణాలు తెలుపుతూ విధుల్లో చేరేందుకు అనాసక్తి చూపుతున్నారు.

11 రోజులుగా ఇక్కడే  ఉండాలంటే ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతో కోందరు ఉపాధ్యాయులు వివిధ కారణాల చూపుతూ విధులను తప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది వివిధ జిల్లాలకు చెందిన సబ్జెక్టు ఉపాధ్యాయులు కొందరు రాకపోవడంతో వాటిని దిద్దే ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. నిర్దేశిత సమయంలో పూర్తికావాల్సి ఉండగా ఒకరోజు ఆలస్యమైనట్లు సమాచారం. గతేడాది తెలుగు, సాంఘికశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో అధికారులు తర్జనభర్జన పడ్డాడు.

ఆలస్యమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల ప్రకటనపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో అధికారులు హైరానపడ్డారు. ఆయా జిల్లాలకు సంబంధించిన ఉన్నతాధికారులు వీరికి నోటీసులు జారీ చేశారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో హాజరైన ఉపాధ్యాయులు అసంతృప్తికి గురయ్యారనే ప్రచారం జరిగింది. నిబంధనల ప్రకారం తప్పనిసరిగా సబ్జెక్టు ఉపాధ్యాయులు ఈ విధులకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ .. కొందరు బేఖాతరు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కూడా పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు హాజరు కావడం అనుమానంగానే ఉంది. 

హాజరు కావాల్సిందే... 
జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి మూల్యాంకన ప్రక్రియకు హాజరు కావాలని ఇప్పటికే ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులు, ప్రత్యేక సహాయకులకు ఆదేశాలు జారీ చేశాం. అన్ని జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలి. లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. –ఎస్‌.వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖాధికారి 

మరిన్ని వార్తలు