‘మిగులు’ తెలంగాణ

18 Oct, 2016 02:32 IST|Sakshi

2015-16లో రూ.250 కోట్ల రెవెన్యూ మిగులు
సాక్షి, హైదరాబాద్: అపారమైన వనరులున్న తెలంగాణ వరుసగా రెండో ఏడాది రెవెన్యూ మిగులు సాధించిన రాష్ట్ర ఖ్యాతిని నిలబెట్టుకుంది. 2015-16 ఆర్థిక సంవత్సరపు వార్షిక ఆదాయ వ్యయాలను పరిశీలించిన అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పద్దుల ఆధారంగా ఆదాయ వ్యయాలకు సంబంధించిన తుది గణాంకాలను ఏజీ వెల్లడించింది. పన్నులు, పన్నేతర ఆదాయంతోపాటు కేంద్ర గ్రాంట్లన్నీ కలిపితే రాష్ట్ర రెవెన్యూ రాబడి మొత్తం రూ.76,000 కోట్లు.

అందులో రెవెన్యూ వ్యయం రూ.75,750 కోట్లు కాగా, రెవెన్యూ మిగులును రూ.250 కోట్లుగా ఏజీ లెక్కతేల్చింది. ఈ మేరకు ఆర్థిక లావాదేవీల తుది ఖాతాలను రాష్ట్ర ఆర్థిక శాఖకు అందించింది. తొలి ఏడాది రాష్ట్రం రూ.368.65 కోట్ల రెవెన్యూ మిగులు నమోదు చేసింది. అదే పంథాను ఇప్పుడు కూడా కొనసాగించడంతో రాష్ట్ర ఆదాయానికి ఢోకా లేదని తేటతెల్లమైంది.
 
 

మరిన్ని వార్తలు