మిగులు కాదు.. లోటే !

23 Sep, 2019 01:47 IST|Sakshi

వాస్తవానికి రూ.284.74 కోట్ల ఆదాయలోటు

రూ.3743.1 కోట్ల ఆదాయ మిగులున్నట్లు తప్పుగా చూపారు

వాస్తవ ద్రవ్యలోటు సైతం రూ.27,654 కోట్లు.. రూ.954 కోట్లు తగ్గించి చూపారు

2017–18 రాష్ట్ర బడ్జెట్‌ అంచనాలపై కాగ్‌ మొట్టికాయలు

2015–16 నుంచి 2017–18 మధ్యకాలంలో రాష్ట్ర ఆదాయ, వ్యయాలు పెరిగాయి

జీఎస్‌డీపీతో పోలిస్తే ఆదాయ, వ్యయాల వృద్ధిరేటు తగ్గిందని నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మిగులు ఆదాయం గల రాష్ట్రం కాదని, వాస్తవానికి ఆదాయలోటు ఉందని కాగ్‌ కుండబద్దలు కొట్టింది.వాస్తవానికి రూ.284.74 కోట్ల రెవెన్యూలోటు ఉండగా, రూ.3743.47 కోట్ల రెవెన్యూ మిగులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తప్పుగా చూపిందని అభ్యంతరం వ్యక్తం చేసింది. పద్దులను తప్పుగా వర్గీకరించడం, తప్పనిసరిగా జమ చేయాల్సిన చట్టబద్ధ నిధులకు కోతలు పెట్టడం, రాయితీలు, సహాయక గ్రాంట్లను రుణాలుగా చూపడం వంటి కారణాలతో రెవెన్యూ మిగులును రూ.3743.47 కోట్ల మేర ఎక్కువగా, ద్రవ్యలోటును రూ.954.60 కోట్ల మేర తక్కువగా చూపెట్టిందని మొట్టికాయలు వేసింది. వాస్తవానికి తెలంగాణ రూ.284.74 కోట్ల ఆదాయలోటు, రూ.27,654.60 కోట్ల ద్రవ్యలోటును కలిగి ఉందని స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి 3.50 శాతానికి మించి 3.55 శాతం ద్రవ్యలోటు ఉందని తేల్చింది. 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్‌ రూపొందించిన ప్రత్యేక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో ముఖ్యాంశాలు.. 

రూ.1,42,918 కోట్ల అప్పులు  
రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చి 31 నాటికి రూ.1,42,918 కోట్ల అప్పులు చెల్లించాల్సి ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 18 శాతం అప్పులు పెరిగిపోయాయి. వడ్డీ చెల్లింపులు క్రమంగా పెరిగి ఆదాయ రాబడులను మింగేస్తున్నాయి. రెవెన్యూరాబడితో పోలిస్తే వడ్డీ చెల్లింపులు 12.19 శాతానికి పెరిగిపోయాయి. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 8.31 శాతం పరిమితి కన్నా రాష్ట్రం అధికశాతం వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. వచ్చే ఏడేళ్లలో రూ.65,740 కోట్ల అప్పులను తీర్చాల్సి ఉంటుంది.  

బడ్జెట్‌ అంచనాలు తలకిందులు.. 
వార్షిక బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే రెవెన్యూ రాబడులు రూ.24,259 కోట్లు తగ్గాయి. 2017–18లో రూ.88,824 కోట్ల రాబడి రాగా, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది రూ.6,006 కోట్లు అధికం. రూ.85,365 కోట్ల రెవెన్యూ వ్యయం జరగగా, బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే రూ.23,147 కోట్లు తక్కువే. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ అంచనాలు, వాస్తవాలకు మధ్య అంతరాన్ని తగ్గించాల్సి ఉంది. 2015–16 మధ్యకాలంలో రెవెన్యూరాబడి, రెవెన్యూ వ్యయం పెరిగాయి. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి(జీఎస్డీపీ)తో పోలిస్తే రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం రెండూ తగ్గాయి. 2016–17తో పోలిస్తే 2017–18లో రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం వృద్ధిరేటు తగ్గింది.  

పన్నుల వసూళ్లలో సమర్థత 
మూడేళ్లగా రాష్ట్రం పన్నుల వసూళ్లకు అయ్యే ఖర్చులను తగ్గించుకోవడం పన్నుల వసూళ్లలో సమర్థతకు నిదర్శనమని కాగ్‌ ప్రశంసించింది. రూ.84,006 కోట అభివృద్ధి వ్యయం, రూ.23,902 కోట్ల పెట్టుబడి వ్యయంతో సాధారణ హోదా గల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ముందంజలో ఉందని తెలిపింది. విద్యారంగంలో మాత్రం వెనుకబడిందని అభిప్రాయపడింది.  

ఇలా అయితే సీపీఎస్‌ దివాలా 
కాంట్రిబ్యూటరీ పింఛను పథకం(సీపీఎస్‌) కింద 2017–18లో ఉద్యోగులు తమ వాటాగా రూ.481.61 కోట్లు చెల్లించగా, ప్రభుత్వం రూ.431.74 కోట్లను జమ చేసింది. ప్రభుత్వం రూ.49.87 కోట్లు తక్కువగా జమ చేసింది. 2016–17లో రూ.71.91 కోట్లు, 2014–15లో రూ.20.01 కోట్లను ఇలానే తక్కువగా చెల్లించింది. ప్రభుత్వవాటా తక్కువగా జమ చేయడం, పింఛను నిధిలోని నిల్వలపై వడ్డీలు చెల్లించకపోవడం వంటి చర్యలను సరిదిద్దకపోతే జాతీయ పింఛను వ్యవస్థ మూలనిధి దివాలాతీసే ప్రమాదముందని, దీనితో ఉద్యోగులు నష్టపోతారని కాగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.  

జాప్యంతో తడిసి మోపెడైన ప్రాజెక్టుల వ్యయం  
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో 3 నుంచి 11 ఏళ్ల వరక జరిగిన జాప్యం కారణంగా 19 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.41,201 కోట్ల నుంచి రూ.1,32,928 కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే రూ.70,758 కోట్లు ఖర్చు చేసినా ఇంకా పూర్తి కాలేదని, ఈ ప్రాజెక్టుల వల్ల కలిగిన ఆర్థిక ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడంలేదని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని కాగ్‌ పేర్కొంది. 2014–18 మధ్యకాలంలో ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.79,236 కోట్లు ఖర్చు చేసింది. 2016–17 మినహాయిస్తే 50 శాతానికిపైగా పెట్టుబడిని సాగునీటి ప్రాజెక్టులపైనే పెట్టింది.  

సంక్షోభంలో డిస్కంలు 
రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లపై రాష్ట్ర ప్రభుత్వచర్యలు ప్రతికూల ప్రభావం చూపాయి. 2017–18లో ప్రభుత్వరంగ సంస్థలకు వచ్చిన నష్టాల్లో 94 శాతం విద్యుత్‌ రంగానికి చెందినవే. రూ.6,202 కోట్ల నష్టాల్లో డిస్కంలు కూరుకుపోయాయి. డిస్కంలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలం టే ప్రభుత్వ బకాయిలను విడుదల చేయడంతోపాటు విధానపర నిర్ణయాల అమలుతో కలిగే నష్టపరిహారాన్ని చెల్లించాలని సిఫారసు చేసింది.

పూర్తికాని పంపకాలు 
రాష్ట్ర విభజన జరిగి 4 ఏళ్లు పూర్తి అవుతున్నా రూ.1,51,349.67 కోట్ల ఆస్తులు, రూ.28,099.68 కోట్ల రుణాల పంపకాలు ఇంకా పూర్తి కాలేదు. షెడ్యూల్‌ 9లోని 91 సంస్థల విభజన జరగాల్సి ఉండగా, నిపుణుల కమిటీ 86 సంస్థల విభజనకు సిఫారసు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రెండు సంస్థల విభజనకు మాత్రమే సమ్మతించింది.

ఖర్చుల లెక్కలేవి... 
అత్యవసర ఖర్చుల బిల్లులను నిర్దేశిత గడువులోగా సమర్పించడం లేదని కాగ్‌ అభ్యంతరం తెలిపింది. ఇలా చేయడం ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని, ఇలాంటి అవాంఛనీయ ధోరణలతో ప్రజాధనం దుర్వినియోగమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. 2,164 అత్యవసర బిల్లుల ద్వారా రూ.280.45 కోట్లను డ్రా చేశారని, వీటికి సంబంధించిన బిల్లులను సమర్పించలేదని తెలిపింది. రూ.81.64 కోట్లు విలువ చేసే అత్యవసర బిల్లులు రాష్ట్ర విభజనకు ముందు నాటివని పేర్కొంది.

మరిన్ని వార్తలు