దిగుబడి తగ్గినా.. విత్తన కంపెనీదే బాధ్యత

13 Nov, 2019 02:27 IST|Sakshi

కేంద్ర విత్తన ముసాయిదాలో కీలక సవరణలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన

సాక్షి, హైదరాబాద్‌ : పంట దిగుబడి తక్కువైనా విత్తన కంపెనీలే బాధ్యత వహించడంతోపాటు రైతులకు నష్ట పరిహారం చెల్లించేలా చూడాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయశాఖ కీలక ప్రతిపాదన చేసింది. కేంద్ర విత్తన ముసాయిదా బిల్లు–2019పై ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. ప్రైవేటు కంపెనీలు విత్తనాల సామర్థ్యంపై చేస్తున్న అధిక ప్రచారం వల్ల రైతులు వాటిని కొనుగోలు చేసి పంటలపై ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారని సర్కారు పేర్కొంది. తీరా పంట దిగుబడి తక్కువయ్యే సరికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యవసాయశాఖ ఆ సమావేశంలో ప్రస్తావించింది. అందువల్ల నిర్ధారించిన మేరకు పంట దిగుబడి రాకపోతే కంపెనీలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్రం కోరింది. దీనివల్ల కంపెనీల ఇష్టారాజ్య ప్రచారానికి అడ్డుకట్ట వేయొచ్చనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. మరోవైపు విత్తనం ద్వారా పంట నష్టం జరిగితే పరిహారాన్ని వినియోగదారుల రక్షణ చట్టం–1986 ప్రకారం ఆయా కోర్టుల్లో నిర్ధారించాలని ముసాయిదా బిల్లులో పేర్కొన్నారని, దీనివల్ల పరిహారం ఆలస్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ అభిప్రాయపడింది. దానికి బదులుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉండే వ్యవసాయ నిపుణుల కమిటీలు నష్ట పరిహారాన్ని నిర్ధారించాలని కేంద్రానికి ప్రతిపాదించింది. 

నకిలీ విత్తన దందా అడ్డుకట్టకు అనుమతి అక్కర్లేదు... 
నకిలీ విత్తనాలు విక్రయించే ముఠాలపై దాడులు చేయడం, ఆయా విత్తనాలను స్వాధీనం చేసుకోవడానికి ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ అనుమతి తీసుకోవాలని కేంద్ర విత్తన ముసాయిదాలో ప్రస్తావించడాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ తప్పుబట్టింది. మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ అనుమతిని అప్పటికప్పుడు తీసుకోవడం కష్టమని, దీనివల్ల నకిలీ విత్తన విక్రయదారులు తప్పించుకునే ప్రమాదముందని అభిప్రాయపడింది. అందువల్ల ప్రత్యేకంగా అనుమతి అవసరంలేదని సూచించింది. ముసాయిదాపై జరిగిన సమావేశంలో పాల్గొన్న పలు బడా కంపెనీలు కంపెనీకి, ప్రతి విత్తన వెరైటీకి ప్రతి రాష్ట్రంలోనూ రిజిస్ట్రేషన్‌ చేయాలన్న నిబంధనను ఎత్తేయాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను అంగీకరించొద్దని స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా అన్ని వెరైటీ విత్తనాలు అన్ని రాష్ట్రాల వాతావరణానికి తగ్గట్లుగా ఉండవని, అన్నిచోట్లా పండవని, కాబట్టి ప్రతి రాష్ట్రంలోనూ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని కేంద్రాన్ని కోరింది.  

ధరల నియంత్రణపై అస్పష్టత 
విత్తన ధరల నియంత్రణపై ముసాయిదా బిల్లులో అస్పష్టత నెలకొంది. అవసరమైతే విత్తన ధరలను నియంత్రిస్తామని మాత్రమే ముసాయిదాలో ఉంది. దీనివల్ల ధరల నియంత్రణ సక్రమంగా జరిగే అవకాశం ఉండదు. విత్తన ధరలపై స్పష్టమైన నియంత్రణ లేకపోతే కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలను పెంచే అవకాశముంది. దీనిపై ముసాయిదాలో మార్పులు చేయాలని కోరుతాం. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు   

ఇకపై అన్ని విత్తనాల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి...
ఇకపై అన్ని రకాల విత్తనాలు, వెరైటీలకు రిజిస్ట్రేషన్‌ తప్పనసరి చేయడాన్ని ముసాయిదా బిల్లులో ప్రస్తావించడం మంచి పరిణామమని రాష్ట్ర వ్యవసాయశాఖ అభిప్రాయపడింది. ప్రస్తుతం ప్రైవేటు హైబ్రిడ్‌ విత్తనాల రిజిస్ట్రేషన్‌ జరగట్లేదని, కొత్త నిబంధన వల్ల ఇది తప్పనసరి అవుతుందని పేర్కొంది. ఖరీఫ్‌లో అన్ని పంటల కంటే పత్తి, మొక్కజొన్నను తెలంగాణలో ఎక్కువగా సాగు చేస్తారని, అవన్నీ ప్రైవేటు హైబ్రిడ్‌ విత్తనాలేనని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ఆయా ప్రైవేటు విత్తనాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయడం వల్ల కంపెనీలకు బాధ్యత ఏర్పడుతుందని అంటున్నారు. మామిడి, మిరప, టమాట తదితర అన్ని రకాల నర్సరీలు కూడా రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందేనని ముసాయిదాలో పేర్కొన్నారని వ్యవసాయశాఖ తెలిపింది. 

మరిన్ని వార్తలు