2,3 తడులతో సరిపోయేలా..

19 Jun, 2019 04:16 IST|Sakshi

ప్రత్యామ్నాయ ప్రణాళిక దిశగా అడుగులు

వర్షాభావ పంటలు.. స్వల్పకాలిక పంటల సాగుపైనే దృష్టి 

నైరుతి రుతుపవనాల ఆలస్యం.. ఖరీఫ్‌ పరిస్థితిపై సీఎం ఆరా 

మరో 2, 3 రోజులు చూసి ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌ : నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికపై దృష్టి సారించింది. ఒకవేళ రుతుపవనాలు ఈ మూడు, నాలుగు రోజుల్లో వచ్చినా, ఆ తర్వాత వర్షపాతం అనుకున్నస్థాయిలో నమోదు కాకపోయినా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు ముమ్మరం చేసింది. రైతులతో ఎటువంటి పంటలు సాగు చేయించాలనే దిశగా వ్యవసాయశాఖ ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసింది. మరో రెండు, మూడు రోజులు వేచి చూసి ఈ ప్రణాళిక విడుదల చేయనున్నట్లు తెలిసింది. స్వల్పకాలిక రకాలైన విత్తనాలను కూడా వ్యవసాయ శాఖ సిద్ధంగా పెట్టుకుంది.

ఈ నెల 23 వరకు రాష్ట్రానికి నైరుతి చేరుకునే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు ఇప్పటికే ప్రకటించారు. జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ, జాతీయ మెట్ట పంటల పరిశోధనల సంస్థ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా కలిసి విడతల వారీ ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఆలస్యం, రాష్ట్రంలోని పంటల సాగు పరిస్థితిపై జయశంకర్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు, అధికారుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివేదికలు తెప్పించుకున్నట్లు తెలిసింది. వానల రాకలో ఏం తేడా వచ్చినా వెంటనే ప్రత్యామ్నాయం వైపు మళ్లే విధంగా సిద్ధంగా ఉండాలని అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎలాంటి పంటలు సాగు చేయాలనే దానిపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. 

తక్కువ నీటితో పంటల సాగు... 
నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఈ నెల 8వ తేదీన రా>ష్ట్రంలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించినా ఇప్పటివరకు వాటి జాడలేదు. ఈ నెల 22 లేదా 23వ తేదీన వస్తాయని ప్రకటించారు. ఆ తేదీల్లోగా వచ్చినా రాకున్నా ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులు లక్షల ఎకరాల్లో విత్తనాలు ఇప్పటికే చల్లాల్సి ఉండగా, వేలాది ఎకరాల్లో కూడా వేయలేకపోయారు. ఆ మధ్య ఆదిలాబాద్‌సహా అక్కడక్కడా పత్తి విత్తనాలు వేసినా, చినుకు పడక వేడికి అవి భూమిలోనే మాడిపోయాయి. జూన్‌లో సాధారణం కంటే 60 నుంచి 70 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ఈ నెల 20 నాటికి వరి నార్లు పోసుకోవాల్సి ఉండగా ఎక్కడా ఆ ఊసు లేదు. ఖరీఫ్‌లో 7.50 లక్షల మెట్రిక్‌ టన్నుల విత్తనాల పంపిణీ లక్ష్యంగా ఉంది.

ఇందులో ఇప్పటివరకు 1.85 లక్షల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే విక్రయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇందులో వరి ఈసారి 2.80 లక్షల విత్తనాల పంపిణీ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 31 వేల క్వింటాళ్లు మాత్రమే అమ్ముడుపోయాయి. సోయాబీన్‌ 2 లక్షల క్వింటాళ్లకుగాను 85 వేల క్వింటాళ్లు విక్రయించారు. మొక్కజొన్న 80 వేల క్వింటాళ్లకుగాను ఒక క్వింటా కూడా రైతులు కొనుగోలు చేయలేదు. ఈ ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1.10 కోట్ల ఎకరాలలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ ముందుగా అంచనా వేసింది. అయితే, నైరుతి ఆలస్యంతో దీనిని తగ్గించనున్నారు. వర్షధార పంటల్లో కూడా చాలా తక్కువనీటితో రెండు, మూడు తడులు ఇస్తే పండే పంటల వైపు రైతులను మళ్లించనున్నారు.

వర్షాలు ఆలస్యం అవుతుండటంతో పత్తి సాగు తగ్గించడం, ఈ పంటను నల్ల నేలలకే పరిమితం చేయడం వంటివి ప్రత్యామ్నాయ ప్లాన్‌లో భాగంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎక్కువ నీటి అవసరంలేని మొక్కజొన్న, జొన్న, కంది, సోయాబీన్‌ సాగును ప్రోత్సహించనున్నారు. ఇందులో స్వల్పకాలిక రకాల విత్తనాలు వ్యవసాయశాఖ, విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అందుబాటులో ఉంచనుంది. మొక్కజొన్న, పత్తి, సోయాచిక్కుడు జూలై 15 వరకు విత్తుకోవచ్చని వ్యవసాయవర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. కంది జూలై 31 వరకు, పెసర, జొన్న జూన్‌ 30 వరకు, మధ్యకాలిక రకాలతో వరి నారు పోసుకోవడానికి జూలై 10, స్వల్పకాలిక రకాలకు జూలై 31 వరకు అవకాశముంది. వర్షాభావ పరిస్థితుల్లో ఎరువుల వాడకంపై, నీటి ఆదాపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. 

మూడు, నాలుగు రోజుల్లో అల్పపీడనం... 
కోస్తాంధ్ర తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 3, 4 రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 

మరిన్ని వార్తలు