‘ఉదయ్’లోకి తెలంగాణ

24 Jun, 2016 04:04 IST|Sakshi
‘ఉదయ్’లోకి తెలంగాణ

డిస్కంలను నష్టాల నుంచి గట్టెక్కించేందుకే: కేసీఆర్
  కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ
  రోజువారీ కరెంటు వాడకం తెలిపేలా యాప్‌లు

 
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకంలో తెలంగాణ భాగస్వామి అవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. డిస్కంల అప్పులను తీర్చడం ద్వారా వాటిపై ఆర్థికభారాన్ని తగ్గిస్తామన్నారు. ఇందుకోసం నిధులు సమీకరించుకోవడానికి ఎఫ్‌ఆర్‌బీఎం మినహాయింపులివ్వడం సానుకూలాంశమని అభిప్రాయపడ్డారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఉదయ్ పథకంలో చేరాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేయగా సీఎం సానుకూలంగా స్పందించారు. దీన్‌దయాళ్ పథకంలో ఎక్కువ నిధులివ్వడంతో పాటు తెలంగాణ విద్యుదుత్పత్తి ప్లాంట్లకు అవసరమైన బొగ్గును కేటాయించడానికి కూడా గోయల్ అంగీకరించారు. ఉదయ్‌లో చేరాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర అధికారులు మళ్లీ సమావేశమై ఒప్పందంపై సంతకాలు చేయాలని కేసీఆర్ కోరారు.

ఇంటింటికీ ఎల్‌ఈడీ బల్బులు
ఎల్‌ఈడీ లైట్ల వాడకంపైనా గోయల్, సీఎం మధ్య చర్చ జరిగింది. తెలంగాణలో 26 నగర పంచాయతీలు, 12 మున్సిపాల్టీల పరిధిలో ఇప్పటికే ఎల్‌ఈడీ లైట్లు వినియోగిస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. విద్యుత్ వాడకం బాగా తగ్గుతుంది గనుక ఇంటింటా ఎల్‌ఈడీ బల్బులుండేలా ప్రోత్సహిస్తామన్నారు. బల్బుల ధరలు బాగా తగ్గుతున్నందున ఈఈసీఎల్‌తో సంప్రదించి ఒప్పందాలు కుదుర్చుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. తెలంగాణలో 22 లక్షల పంపుసెట్లున్నాయని, వాటికే ఎక్కువ కరెంటు వినియోగమవుతుందన్నారు. తక్కువ కరెంటును వాడేవి, ఇంటినుంచే నిర్వహించుకునే పంపుసెట్లొచ్చాయని, తెలంగాణలో వాటిని విరివిగా వాడాలని మంత్రి సూచించారు. దశలవారీగా పంపుసెట్ల మార్పుకు కేంద్రం నుంచి సాయమందిస్తామని హామీ ఇచ్చారు. తక్కువ విద్యుత్ వాడే ఫైవ్ స్టార్ ఫ్యాన్ల వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. విద్యుత్ వాడకందారులు ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వపరంగా సహకరించాలని ఇరువురూ నిర్ణయించారు. వినియోగదారులు రోజూవారీగా తామెంత కరెంటు వాడిందీ తెలుసుకునేలా యాప్‌లు రూపొందిస్తామని కేసీఆర్ వెల్లడించారు.
 
బొగ్గు గనులు ఉన్నచోటే ప్లాంట్లు
బొగ్గు గనులున్న చోటే విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే మేలని గోయల్‌కు సీఎం సూచిం చారు. వాటికి స్థానిక గనుల నుంచి బొగ్గు సరఫరా చేయాలని కోరారు. తెలంగాణలోని ప్లాం ట్లకు స్థానిక గనుల నుంచే బొగ్గు సరఫరా చేస్తే రవాణా భారం తగ్గుతుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను అధిగమించడంతో పాటు మున్ముందు తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వ విద్యుదుత్పత్తి ప్రణాళికలు, సౌర విద్యుదుత్పత్తికి తీసుకుంటున్న చర్యల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డ్డి తదితరులున్నారు.

మరిన్ని వార్తలు