హైకోర్టులో హోంశాఖల ముఖ్య కార్యదర్శులు

31 Dec, 2019 03:15 IST|Sakshi

ధిక్కార కేసులో హాజరు

రాష్ట్ర భద్రతా కమిషన్‌ ఏర్పాటు చేయని తెలుగు రాష్ట్రాలు

4 వారాల గడువు ఇచ్చిన ధర్మాసనం

సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని గుర్తుచేసిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర భద్రతా కమిషన్, పోలీస్‌ ఫిర్యాదుల సంస్థ ఏర్పాటు చేయాలన్న ఆదేశాల్ని అమలు చేయలేదనే కోర్టు ధిక్కార కేసులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల హోంశాఖల ముఖ్య కార్యదర్శులు రవి గుప్త, కేఆర్‌ఎం కిశోర్‌ కుమార్‌లు సోమవారం తెలంగాణ హైకోర్టుకు హాజరయ్యారు. రాష్ట్ర భద్రతా కమిషన్, పోలీస్‌ కంప్లయింట్‌ అథారిటీలను ఏర్పాటు చేయాలని 2017 ఏప్రిల్‌ 27న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు అమలు చేయలేదంటూ ఎన్‌ఎస్‌ చంద్రశేఖర శ్రీనివాసరావు అనే వ్యక్తి రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా కోర్టుధిక్కార పిటిషన్‌గా పరిగణించింది.

కమిషన్, అథారిటీలను ఈ నెల 27లోగా ఏర్పాటు చేయనిపక్షంలో 30వ తేదీన స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఈనెల 4న ధర్మాసనం ఆదేశించింది. దీంతో వారివురూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఎదుట సోమవారం హాజరయ్యారు. కమిషన్, అథారిటీల ఏర్పాటుకు నాలుగు వారాల సమయం ఇస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. తొలుత తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌ కుమార్‌ వాదిస్తూ, హైకోర్టు ఉత్తర్వుల అమలుకు 8 వారాల గడువు కోరారు.

ఒక ప్యానల్‌ తయారు చేసే నిమిత్తం రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు లేఖ రాశారని, దీనికి జవాబు రాగానే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దీనిపై సీజే స్పందిస్తూ.. ఆలేఖను తాను చూశానని నియమనిబంధనలు రూపొందించకుండా ప్యానల్‌ తయారు చేయాలని ఎలా కోరతారని ప్రశ్నించారు. ఏపీ హోం శాఖ ముఖ్య కార్యదర్శి తరఫు న్యాయవాది వాదిస్తూ, ఏపీలో కమిషన్, అథారిటీలకోసం ఉత్తర్వులు (జీవో 173) జారీ చేసిందని తెలిపారు. ఏర్పాటుకు 3 నెలల సమయం కావాలని కోరగా, ధర్మాసనం అంగీకరించలేదు. వీటి ఏర్పాటు వల్ల హైకోర్టుకు ఏమీ ప్రయోజనం చేకూర్చడం లేదని, సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నామని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలని హితవు చెప్పింది.

నేపథ్యం ఇదీ..
పోలీసుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారి సమస్యల్ని పరిష్కరించేందుకు అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్ర భద్రతా కమిషన్, జిల్లా స్థాయిలో పోలీసులపై ఫిర్యాదులను విచారించేందుకు పోలీస్‌ కంప్ల యింట్‌ అథారిటీలను ఏర్పాటు చేయాలని 2006లో ప్రకాశ్‌ సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.ప్రకాశం, కామారెడ్డి, చిత్తూరు జిల్లాల్లో పోలీసులపై నమోదైన కేసులను విచారించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి 2017 ఏప్రిల్‌ 27న ఇచ్చిన ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు తీర్పులోని మార్గదర్శకాలను అమలు చేయాలని తేల్చి చెప్పారు.

సీఎం లేదా హోం మంత్రి చైర్మన్‌గా ఉండే కమిషన్‌లో డీజీపీ ఎక్స్‌అఫీషియో సెక్రటరీగా, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిని సభ్యుడిగా ఉండాలని, జిల్లా స్థాయి పోలీసు ఫిర్యాదుల మండలిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. హైకోర్టు తీర్పు అమలు చేయకపోవడాన్ని చంద్రశేఖర శ్రీనివాసరావు అనే వ్యక్తి 2017 అక్టోబర్‌ 26న లేఖ ద్వారా హైకోర్టు దృష్టికి తేచ్చారు.

మరిన్ని వార్తలు