తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్ర మాదే..

2 Jun, 2014 23:29 IST|Sakshi

కందుకూరు, న్యూస్‌లైన్:  స్వాతంత్య్రానికి పూర్వం నుంచే తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలదేనని సీపీఎం సౌత్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఈఎస్‌ఎన్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో సోమవారం తెలంగాణ అవతరణ సందర్భంగా తెలంగాణ సమగ్రాభివృద్ధి పునరంకిత సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరవీరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కొత్త రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన కొలువుదీరిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అన్నివర్గాల ప్రజలు కోటి ఆశల పెట్టుకున్నారన్నారు.

 ప్రజల ఆశల మేరకు ప్రభుత్వ పనితీరు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నివర్గాల వారికి సమన్యాయం జరిగే వరకు ప్రభుత్వానికి సీపీఎం మద్దతు తప్పకుండా ఉంటుందన్నారు. నిత్యావసరాల ధరలు అందుబాటులోకి తేవాలని, రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరాతోపాటు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి డి.రాంచందర్, డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకులు ఆర్.చందు, మండల కమిటీ సభ్యులు జి.పారిజాతం, సీహెచ్ నర్సింహ, శ్రీశైలం, డి.వెంకటరమణ, కె.భిక్షపతి, పి.శ్రీరాములు, నరహరి, ప్రభాకర్, శిమయ్య, మహేందర్, జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి సీపీఎం సంపూర్ణ మద్దతు
 అనంతగిరి : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీపీఎం సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకట్ అన్నారు. వికారాబాద్‌లోని సీపీఎం కార్యాలయంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ సభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సమగ్ర అభివృద్ధి చేయాలన్నారు.

 పోలవరం డిజైన్ మార్పు చేయాలన్నారు. ఆర్డినెన్సును ఆపే విధంగా ఉద్యమించి కొత్త ముఖ్యమంత్రి చిత్తశుద్ది చూపించుకోవాలన్నారు. కేసీఆర్ ఇచ్చిన రైతుల రుణమాఫీ, సొంతిళ్లు, రూ.100 పెన్షన్ వంటి హామీలన్నింటినీ నెరవేర్చాలన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే ప్రజాపోరాటాలకు వెనుకాడబోమన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు కేటాయించిన నిధులను వారికే కేటాయించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సంలు, అమరేశ్వర్, అశోక్, వెంకటేశం, వెంకటయ్య, శ్రీనివాస్, మహేందర్, మల్లేశం పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా