మా ‘మిగులు’ మాకే..

2 Jun, 2020 03:32 IST|Sakshi

గతేడాది కోటాలో రాష్ట్రం వినియోగించని జలాలు 50 టీఎంసీలు

దీన్ని ఈ ఏడాది కోటాలో కలపాలని కృష్ణాబోర్డును కోరనున్న తెలంగాణ

సాక్షి, హైదరాబాద్ ‌: కృష్ణా నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణ మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. గతేడాది వాటర్‌ ఇయర్‌లో వినియోగించే హక్కు కలిగి ఉండి కూడా వాడుకోని నీటిని ఈ వాటర్‌ ఇయర్‌లో తమకే ఇవ్వాలని కృష్ణాబోర్డును కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యంగా నాగార్జునసాగర్‌ పరిధిలో గడిచిన వాటర్‌ ఇయర్‌లో తెలంగాణ 50 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉండగా, ఆ కోటా అలాగే ఉండిపోయింది. ఈ నీటిని జూన్‌ 1 నుంచి మొదలైన వాటర్‌ ఇయర్‌లో తెలంగాణ కోటా కిందే పరిగణించాలని కోరనుంది. ఏటా వాటర్‌ ఇయర్‌ జూన్‌ నుంచి మే చివరి వరకు ఉంటుంది.

జూన్‌ నుంచి కొత్త వాటర్‌ ఇయర్‌ ఆరంభమవుతుంది. జూన్‌ నుంచి ప్రాజెక్టుల్లో ఉండే నీటి లభ్యత, వచ్చిన ప్రవాహాలు, రాష్ట్రాల అవసరాల మేరకు కృష్ణాబోర్డు తెలుగు రాష్ట్రాలకు నీటిని కేటాయిస్తుంది. గతేడాది 34:66 నిష్పత్తిన రెండు రాష్ట్రాలకు నీటిని పంచింది. ఇందులో ఏపీ తన కోటాకు మించి వినియోగించగా, తెలంగాణకు మాత్రం బోర్డు కేటాయించిన లెక్కల మేరకు మరో 50 టీఎంసీల మేర నీటిని   వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ నీరంతా సాగర్‌లోనే ఉంది. సాగర్‌లో ప్రస్తుతం 531 అడుగుల పరిధిలో 170 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇందులో కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన లభ్యత మరో 50 టీఎంసీల మేర ఉంది. ఈ వాటా అంతా తెలంగాణదేనని ఇటీవలే బోర్డు స్పష్టంచేసింది. అయితే మే 31తో వాటర్‌ ఇయర్‌ ముగియడం, జూన్‌ నుంచి కొత్త వాటర్‌ ఇయర్‌ ఆరంభం కావడంతో కొత్త వాటాలు తెరపైకి వస్తాయి. దానికి అనుగుణంగానే బోర్డు పంపకాలు చేస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది గరిష్ట నీటిని వినియోగించుకోలేకపోవడంతో తన వాటాను ఈ ఏడాది కింద దక్కే వాటాలో కలపాలని తెలంగాణ కోరనుంది. ఈ నెల 4న జరిగే బోర్డు భేటీలో ఈ అంశం కీలకం కానుంది. 

గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల జీవోలన్నీ బయటికి తీయండి : కేసీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలో నిర్మించిన అన్ని ప్రాజెక్టుల ప్రభుత్వ ఉత్తర్వులను బయటకు తీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇరిగేషన్‌ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. గోదావరి, కృష్ణాలపై చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలు లేవనెత్తడంతో సోమవారం ఇరిగేషన్‌ శాఖ ఇంజనీర్లతో సీఎం ప్రగతి భవన్‌లో సమీక్షించారు. భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి ఇచ్చిన జీవోలను, పనులు పూర్తయిన సంవత్సరాలను సమగ్రంగా ఓ నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు