మా వాటా పెంచండి

22 Jun, 2016 02:03 IST|Sakshi

కృష్ణాలో నికర జలాలపై కేంద్ర జలవనరుల శాఖ సమావేశంలో తెలంగాణ విజ్ఞప్తి
మా వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచండి
ఏపీ వాటా 512 టీఎంసీల నుంచి 422 టీఎంసీలకు తగ్గించండి
పట్టిసీమ, పోలవరంలో తెలంగాణకు నిర్ణీత వాటా ఉంటుంది
811 టీఎంసీలపైన వచ్చే నీటిని 66.7:33.3 నిష్పత్తిలో పంచండి
పాలమూరు, డిండి పాత ప్రాజెక్టులేబోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల నియంత్రణ అవసరం లేదు
గతేడాది ఏపీ అదనంగా వాడుకున్న 13 టీఎంసీలను
ఈ ఏడాది సర్దుబాటు చేయాలి

 
సాక్షి, హైదరాబాద్
కృష్ణా నదీ జలాల్లో తమకున్న నికర జలాల కేటాయింపులను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ప్రస్తుతం ఉన్న 299 టీఎంసీల నీటి వాటాకు అదనంగా మరో 90 టీఎంసీల మేర నీటి వాటా తమకు న్యాయంగా దక్కుతుందని తెలిపింది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు వాటాలు దక్కుతాయన్న అంశాన్ని వివరిస్తూ... తమ వాటాను 389 టీఎంసీలకు పెంచాలని, ఏపీ వాటాను 422 టీఎంసీలకు తగ్గించాలని కోరింది. 2016-17 వాటర్ ఇయర్‌లో కృష్ణా నీటి కేటాయింపులు, వినియోగంపై మంగళవారం కేంద్ర జల వనరుల శాఖ వద్ద జరిగిన సమావేశానికి తెలంగాణ తరఫున నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషీ, ఈఎన్‌సీ మురళీధర్, అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు కోటేశ్వర్‌రావు, నరసింహారావు, అడ్వొకేట్ రవీందర్‌రావు తదితరులు హాజరయ్యారు.
 
పట్టిసీమ కొత్త ప్రాజెక్టే: ఏపీ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో భాగం కాదని తెలంగాణ స్పష్టంచేసింది. ‘‘1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. 80 టీఎంసీల కేటాయింపుల్లో 22 టీఎంసీలు కర్ణాటకకు, 13 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీ వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఈ నీటి వాటా హక్కు తెలంగాణదే. బచావత్ అవార్డులో పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణం పై రాష్ట్రాలకు వాటా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఏపీ పట్టిసీమ ప్రాజెక్టు చేపడుతోంది.
 
 పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కాదని లోక్‌సభలో వైఎస్సార్‌సీసీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. అంటే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగానే పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా ఇవ్వాలి. ఈ లెక్కన మొత్తంగా తెలంగాణ నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచి, ఏపీ వాటాను 512 టీఎంసీల నుంచి 422 టీఎంసీలకు తగ్గించాలి. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని ఆచరణలోకి తేవాలి’’ అని కోరింది. దీంతోపాటే గతేడాది నిర్ణీత వాటాలో తక్కువగా వాడుకున్న 13 టీఎంసీల నీటిని కూడా ఈ ఏడాది నీటి పంపకాల్లో సర్దుబాటు చేయాలని కోరింది. మొత్తంగా తెలంగాణకు 402 టీఎంసీలను కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే ఏడు దశాబ్దాలుగా ఆయకట్టు అభివృద్ధి విషయంలో తెలంగాణ ఒడిదుడుకులను ఎదుర్కొందని, మొత్తం కృష్ణా బేసిన్‌లో సాగుకు యోగ్యంగా 37.19 లక్షల హెక్టార్లు ఉన్నా.. కేవలం 6.39 లక్షల హెక్టార్లే సాగు చేసుకోగలుగుతోందని తెలిపింది. ఈ దృష్ట్యా 811 టీఎంసీల నికర జలాలకుపైన వచ్చే అదనపు జలాలను 63.7ః33.3 నిష్పత్తిన తెలంగాణ, ఏపీలకు పంచాలని విజ్ఞప్తి చేసింది.
 
 తెలంగాణ వాదనలోని ముఖ్యాంశాలివీ..
 - కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తేవాలని కోరుతూ బోర్డు వర్కింగ్ మాన్యువల్ సిద్ధం చేసి నోటిఫికేషన్ కోసం కేంద్రానికి పంపింది. అయితే దీన్ని రాష్ట్రం కేంద్రం దృష్టికి తీసుకెళ్లి బ్రజేశ్ ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చే వరకు ఆమోదించరాదని కోరింది. ప్రస్తుతం ఇది కేంద్ర పరిశీలనలో ఉన్నందున నియంత్రణపై తొందర అక్కర్లేదు.

 - రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89(ఏ), (బీ)ల ప్రకారం ట్రిబ్యునల్ కాల పరిమితిని రెండేళ్లు పెంచారు. దీనిలో కృష్ణా జలాల వివాదం రెండు రాష్ట్రాల మధ్యా లేదా నాలుగు రాష్ట్రాల మధ్యా అన్న అంశం తేలలేదు. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేవు. నీటి కేటాయింపులకు సంబంధించిన అంశాలు బ్రజేశ్ ట్రిబ్యునల్ పరిశీలనలో ఉన్నాయి. అలాంటప్పుడు బోర్డు నియంత్రణ అన్న ప్రశ్నే ఉదయించదు.

 - ఇదే చ ట్టంలోని 85(8), 87(1) సెక్షన్‌ల ప్రకారం కృష్ణా బోర్డు.. కేవలం ట్రిబ్యునల్‌లు ఇచ్చిన నిర్ణయాన్ని మాత్రమే అమలు పరచాలి. అంతే తప్ప నోటిఫికేషన్ తయారు చేయలేదు. బ్రజేశ్ ట్రిబ్యునల్ అమల్లోకి రానందున బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని ఉమ్మడి ఏపీలో చేసుకున్న తాత్కాలిక ఏర్పాట్ల మేరకు తెలుగు రాష్ట్రాలు తమ సరిహద్దుల్లో ఎక్కడైనా వాడుకునేలా మాత్రమే చూడాలి.
 

- పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు కొత్త ప్రాజెక్టులు అనడం సరికాదు.  కృష్ణాలో 70 టీఎంసీల నీటిని వినియోగించుకుంటూ చేపట్టనున్న పాలమూరు ఎత్తిపోతలపై డీపీఆర్ తయారు చేయాలంటూ 2013లోనే జీవో 72 ఇచ్చారు. అదే కృష్ణాలో 30 టీఎంసీల నీటిని వాడుకుంటూ డిండి ప్రాజెక్టును చేపట్టేందుకు 2007 జూలై 7న జీవో 159 ఇచ్చారు. అలాంటప్పుడు అవి ముమ్మాటికీ పాత ప్రాజెక్టులే. ఈ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రుల స్థాయిలో ఉంటే అపెక్స్ కౌన్సిల్ సమావేశం అవసరం లేదు.

మరిన్ని వార్తలు