ముగిసిన తెలంగాణ అసెంబ్లీ

17 Mar, 2020 03:07 IST|Sakshi

8 రోజుల పాటు సాగిన సమావేశాలు 

ఈ నెల 6న గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభం 

వార్షిక బడ్జెట్‌తో పాటు ఆరు బిల్లులకు ఆమోదం 

చివరి రోజు సీఏఏ, మరో తీర్మానంపై అసెంబ్లీలో చర్చ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రసంగంతో ఈ నెల 6న ప్రారంభమైన రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం ముగిశాయి. తొలుత ఈ నెల 20 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని శాసనసభ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీలో నిర్ణయించారు. అయితే ఈ నెల 14న సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌ ‘కరోనా’పై పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను కుదించారు. దీంతో నిర్ణీత గడువు కంటే నాలుగు రోజుల ముందుగానే సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి.

8 రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2020–21ను సభ్యులు ఆమోదించారు. ఏడో తేదీన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాలు తెలుపుతూ చర్చ జరగ్గా, ఎనిమిదో తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు సభలో ప్రవేశపెట్టారు. హోలీ సందర్భంగా 9, 10 తేదీల్లో విరామం అనంతరం 11న ప్రారంభమైన అసెంబ్లీలో రెండు రోజుల పాటు బడ్జెట్‌పై సాధారణ చర్చ జరిగింది.

ఈ నెల 13న ప్రభుత్వ శాఖల వారీగా పద్దులపై చర్చ మొదలై 19 వరకు కొనసాగాల్సి ఉండగా, మూడు రోజుల్లోనే 40 పద్దులపై చర్చించి సభ ఆమోదించింది. శాసనసభ సమావేశాల చివరి రోజు సోమవారం ద్రవ్య వినిమయ, వినియోగ బిల్లులను ఆమోదించిన తర్వాత అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. 

ఎనిమిది రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో రెండు తీర్మానాలు, ఆరు బిల్లులపై చర్చ జరిగింది. సమావేశాల చివరి రోజు సోమవారం అత్యంత కీలకమైన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీపై తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించారు. దీం తో పాటు పదేళ్లపాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పొడగింపునకు సంబంధించి పార్లమెంటు ఆమోదించిన ‘126వ రాజ్యాంగ సవరణ బిల్లు 2019’కు మద్దతుగా తీర్మానం చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం ఆరు బిల్లుల ను ప్రవేశ పెట్టగా, ద్రవ్య వినిమయ బిల్లు, ద్రవ్య వినియోగ బిల్లులతో పా టు మరో నాలుగు బిల్లులకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. లోకాయు క్త సవరణ బిల్లు–2020, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సవరణ బిల్లు 2020, లాభదాయక సంస్థల సవరణ బిల్లు, ఎస్‌హెచ్‌జీ వాటా రద్దు బిల్లు 2020 ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు పల్లె ప్రగతి, కరోనా అంశం పై స్వల్పకాలిక చర్చ జరిగింది. మొత్తంగా ఎనిమిది రోజుల పాటు వివిధ అంశాలపై జరిగిన చర్చలో 63 శాతం మంది సభ్యులు ప్రసంగించారు. 

పార్టీల వారీగా సభ్యులు మాట్లాడిన సమయం 
టీఆర్‌ఎస్‌: 11 గంటల 6 నిమిషాలు, ఎంఐఎం: 5 గంటల 14 నిమిషాలు, కాంగ్రెస్‌: 7 గంటల 02 నిమిషాలు, టీడీపీ: 27 నిమిషాలు, బీజేపీ: 57 నిమిషాలు, ఇతరులు: 10 నిమిషాలు, ప్రశ్నోత్తరాలు, పద్దులపై మంత్రుల సమాధానం–17 గంటల 47 నిమిషాలు 

మరిన్ని వార్తలు