లేదు అలుపు.. వరుస గెలుపు..! 

3 Dec, 2018 10:26 IST|Sakshi
గంగుల కమలాకర్‌ శ్రీధర్‌బాబుకొప్పుల ఈశ్వర్‌ సోమారపు జీవన్‌రెడ్డి ఈటల రాజేందర్‌ రమేశ్‌బాబు కేటీఆర్‌ విద్యాసాగర్‌రావు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: క్రికెట్‌ ఆటలో హ్యాట్రిక్‌ పదాన్ని ఎక్కువగా వింటూ ఉంటాం. మూడు వరుస బంతుల్లో వికెట్లు తీసిన బౌలర్, మూడు బౌండరీలు దాటిన బ్యాట్స్‌మెన్‌ ఉత్సాహం నేరుగా చూడాల్సిందే.. కానీ మాటల్లో వర్ణించలేం. అదే తరహాలో ఎన్నికల్లో మూడుసార్లు, అంతకంటే ఎక్కువసార్లు విజయం సాధించిన ఎమ్మెల్యేల ఆనందానికి అవధులు ఉండవు. ఇదే సమయంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వరుస ఓటమి, వరుస విజయాలు సాధించిన నేతలు చాలామంది ఉన్నారు. హ్యాట్రిక్‌ చేసిన వారు ఉన్నారు. హ్యాట్రిక్‌ చేసి డబుల్‌ హ్యాట్రిక్‌ కోసం తహతహలాడుతున్న వారు ఉన్నారు.

వరుస ఓటములను లెక్క చేయకుండా బరిలో దిగిన వారు ఉన్నారు. టికెట్‌ కోసం ఆశించి భంగపడటం, ఒకవేళ టికెట్‌ వచ్చినా ఓటమి చెందడం.. ఈ అనుభవాలు రాజకీయ పార్టీల నేతలకు మరపురానివే. గెలుపు ఓటములు దైవాధీనం.. ప్రజల్లో ఉండటమే ప్రధానం అనుకుని తరచూ ఎన్నికల్లో పోటీ చేసే నేతలది కూడ జిల్లాలో రికార్డే. డిసెంబర్‌ 7న జరిగే పోలింగ్‌ కోసం టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నుంచి పోటీచేసే ఐదారుగురు మినహా అందరూ అభ్యర్థులు ఓటర్లకు సుపరిచితులే. ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచిన కొందరు నేతల  గత వివరాలను పరిశీలిస్తే..

హ్యాట్రిక్‌వీరులు... డబుల్‌ హ్యాట్రిక్‌ రేసు
ఈటల రాజేందర్‌.. 2004లో కమలాపూర్‌లో ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడినుంచే 2008 ఉప ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఆ తర్వాత అనూహ్యంగా హుజురాబాద్‌ నియోజకవర్గానికి రాజకీయ మకాం మార్చిన ఈయన 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో వరుస విజయాలతో సత్తాచాటారు. తాజాగా ఈ ఎన్నికల్లో బరిలో నిలిచి డబుల్‌ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు. తాజామాజీ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ ఏడోసారి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒకసారి ఓడిన ఈయన వరుస విజయాలే సాధించారు. రద్దైన మేడారం నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ తరఫున 1994లో తొలిసారి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

తర్వాత 2004లో రామగుండం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మారి ఎమ్మెల్యేగా తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత 2008 ఉపఎన్నికలో విజేతగా నిలిచారు. తరువాత ధర్మపురి నియోజకవర్గానికి మారిన ఆయన 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో వరుస విజయాలతో దూసుకెళ్లారు. ఈ ఏడాది మళ్లీ పోటీలో ఉన్నారు. డబుల్‌ హ్యాట్రిక్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. వేములవాడ తాజామాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతోపాటు మంత్రి కేటీఆర్‌ 2009, 2010 (ఉప ఎన్నిక), 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. 

హ్యాట్రిక్‌తో సరి.. ఈ సారి గెలుపే లక్ష్యం..
కోరుట్ల మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు 2009లో కోరుట్ల నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో గెలిచిన ఈయన.. రద్దైన మెట్‌పల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి ఐదో ప్రయత్నంగా పోటీకి సై అంటున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హ్యాట్రిక్‌తో కూడా సరి పెట్టుకున్నారు.

1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2014లో ఓటమి చెందిన ఆయన... ఈ ఎన్నికల్లో ఐదోసారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. 1999లో పెద్దపల్లి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి తర్వాత నాలుగుసార్లు ఓటమి చెంది.. ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పెద్దపల్లి నుంచి పోటీ చేయనున్న ఈయన 1999లో ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత 2004లో  2009లో ఓటమి చెందారు. 2014లో రామగుండం నుంచి పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఈసారి మళ్లీ పెద్దపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగానే బరిలో నిలిచారు. 

గెలుపోటములు ఇలా.. 
 2004లో మంథని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోమారపు సత్యనారాయణ రెండోస్థానంలో నిలిచారు. తరువాత రామగుండం నియోజకవర్గం నుంచి 2009, 2014లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగోసారి ఈ ఎన్నికల్లో ఆయన పోటీ పడుతున్నారు. 2009లో టీడీపీ నుంచి కరీంనగర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన గంగుల కమలాకర్‌ 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి పోటీలో నిలిచి హాట్రిక్‌ కోసం ప్రయత్నం చేస్తున్నారు.  వీరిని మినహాయిస్తే రెండోసారి పోటీలో ఉన్నవారు 10మంది వరకు ఉన్నారు. ఇందులో రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డి గత ఎన్నికల్లో గెలిచారు.

ఇక కరీంనగర్‌ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పొన్నం ప్రభాకర్‌ రెండోసారి శాసనసభకు పోటీ చేస్తున్నారు. 2004లో కరీంనగర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 23,012 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మూడోసారి పోటీలో ఉన్నవారు 9 మంది ఉన్నారు. ఇందులో చింతకుంట విజయరమణారావు, బొడిగె శోభ, ఆరెపల్లి మోహన్, పుట్ట మధు ఎమ్మెల్యేలుగా గెలిచినవారే.

బొడిగె శోభ గతంలో కమలాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందగా.. చొప్పదండి నుంచి 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మేడారం నుంచి ఒకసారి.. ధర్మపురి నుంచి గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందిన అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్‌ ఈ ఎన్నికల్లో అదష్టాన్ని పరీక్షించుకోబోతున్నా రు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్క సీటును కోల్పోయిన టీఆర్‌ఎస్‌.. ఈసారి మళ్లీ అదే అభ్యర్థి సంజయ్‌కుమార్‌ను జగిత్యాల నుంచి బరిలోకి దిం పింది. అలాగే మొదటి సారిగా ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా చాలామందే ఉన్నారు.

విలక్షణ నేత జీవన్‌రెడ్డి పదోసారి
విలక్షణ రాజకీయవేత్తగా పేరున్న జగిత్యాల తాజామాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి పదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 1983 నుంచి జగిత్యాల నియోజకవర్గంలో జరిగిన ప్రతి శాసనసభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిన నేతగా ఆయన గుర్తింపు పొందారు. సుమారు 35 ఏళ్లుగా రాజకీయాల్లో తన ప్రాధాన్యం చూపిస్తున్నారు. టీడీపీ నుంచి మొదటగా ఆయన 1983లో పోటీ చేసి గెలిచారు.

తర్వాత వరుసగా జరిగిన ప్రతి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. 1983, 1989, 1996 (ఉపఎన్నిక), 1999, 2004, 2014లో విజయం సాధించారు. 1985, 1994, 2009 ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. వరుసగా గతంలో జరిగిన తొమ్మిది ఎన్నికల్లో నామినేషన్‌ వేసి పోటీకి సిద్ధమైన నాయకుడిగా రాష్ట్రస్థాయిలో రికార్డు ఉంది. ఈసారి కూడా ఆయన జగిత్యాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు