తెలంగాణ లైవ్‌ అప్‌డేట్స్‌ : 67శాతం పోలింగ్‌ నమోదు!

7 Dec, 2018 07:15 IST|Sakshi

తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు సుమారు 67శాతం పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు. మొత్తం వివరాలు అందాక పోలింగ్‌ శాతం కొద్దిగా మారే అవకాశముందని ఆయన తెలిపారు.

సర్వే వివరాలను వెల్లడిస్తున్న లగడపాటి..

  • తెలంగాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తన సర్వే వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు 65 స్థానాలు వస్తాయని, అధికార టీఆర్‌ఎస్‌కు 35 స్థానాలు వస్తాయని, ఇందులో పది స్థానాలు ఎక్కువ, తక్కువ కావొచ్చునని ఆయన పేర్కొన్నారు. కూటమి మిత్రపక్షమైన టీడీపీకి ఐదు నుంచి ఏడు స్థానాలు వచ్చే అవకాశముందని చెప్పారు. బీజేపీకి ఏడు స్థానాలు, స్వతంత్రులకు ఏడు స్థానాలు వస్తాయని, ఇందులో రెండు స్థానాలు అటు-ఇటు కావొచ్చునని తెలిపారు. ఎంఐఎం ఆరు నుంచి ఏడు స్థానాలు రావొచ్చునని చెప్పారు.

టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌: టీఆర్‌ఎస్‌ 66, కాంగ్రెస్‌ 37, బీజేపీ 7, ఇతరులు 9

న్యూస్‌-18 ఎగ్జిట్‌ పోల్స్‌: టీఆర్‌ఎస్‌ 50-65, కాంగ్రెస్‌ 38-52. బీజేపీ 4-7, ఇతరులు 8-14

ఇండియా టుడే: 79-91, కాంగ్రెస్‌ 21-33, బీజేపీ 1-3, ఇతరులు 4-7 

అనధికారికంగా తెలంగాణ పోలింగ్‌ శాతం 69.5

సాయంత్రం 5 గంటలు: చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సుమారు 70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలుస్తోంది.  గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పెద్దసంఖ్యలో ఓటు వేయగా.. హైదరాబాద్‌ నగరంలో మాత్రం ఓటర్లు ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దీంతో నగరంలోని చాలా నియోజకవర్గాల్లో అతి తక్కువ పోలింగ్‌ శాతం నమోదైంది. చంద్రాయణగుట్ట, నాంపల్లి నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటింగ్‌పై అంతగా ఆసక్తి చూపకపోవడంతో దారుణమైన పోలింగ్‌శాతాలు నమోదయ్యాయి. ఈ నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై నెలకొంది. మరికాసేపట్లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడనున్నాయి.

నక్సల్స్‌ ప్రభావిత నియోజవకవర్గాల్లో ముగిసిన పోలింగ్‌
నక్సల్స్‌ ప్రభావిత 13 నియోజవకవర్గాలు సిర్పూర్, చెన్నూర్(ఎస్సీ), బెల్లంపల్లి(ఎస్సీ), మంచిర్యాల్, అసిఫాబాద్ (ఎస్టీ), మంథని, భూపాలపల్లి, ములుగు(ఎస్టీ), పినపాక(ఎస్టీ), ఎల్లందు (ఎస్టీ), కొత్తగూడెం, అశ్వారావుపేట(ఎస్టీ), భద్రాచలం (ఎస్టీ)ల ఓ గంట ముందుగానే పోలింగ్‌ ముగిసింది. మిగతా 106 నియోజకవర్గాలకు మరో గంట సమయం ఉంది. 

హైదరాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్నపోలింగ్‌

  • మధ్యాహ్నం నాలుగు గంటలు: హైదరాబాద్‌ నగరంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశాం. చివరి గంటలో కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులను అలర్ట్ చేశాం. హైదరాబాద్‌లో ఉన్న లక్షపైగా కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నాం. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్పెషల్ టీమ్ లు అలర్ట్‌గా ఉంటాయి.

- సాక్షి టీవీతో అంజనీ కుమార్, హైదరాబాద్ పోలీసు కమిషనర్‌

3గంటల వరకు 56.17శాతం పోలింగ్‌ ..
తెలంగాణలో మధ్యాహ్నం 3గంటల వరకు 56.17శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 5గంటలలోగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. 

సూర్యాపేట జిల్లా : మధ్యాహ్నం 3.00 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 65.07 శాతం. హుజుర్ నగర్ - 63.78 శాతం, కోదాడ - 59 శాతం, సూర్యాపేట- 64.51శాతం, తుంగతుర్తి -73 శాతం. 

జగిత్యాల జిల్లా: మధ్యాహ్నం 3 గంటల వరకు 61.23%  పోలింగ్ శాతం నమోదు. కోరుట్ల -59.72%, జగిత్యాల 60.44%, ధర్మపురి 63.52%
 
మధ్యాహ్నం 3 : హుజుర్‌నగర్‌లో ఓ పోలింగ్‌ అధికారిని స్థానికులు చితకబాదారు. ఓ దివ్యాంగుడు ఓ గుర్తుకు ఓటేయమంటే.. ఆ అధికారి మరో గుర్తుకు ఓటేసారు. అనుమానం రావడంతో ఆ వికలాంగుడు వీవీ ప్యాట్‌ స్లిప్‌ను చెక్‌చేసాడు. వేరే గుర్తుకు ఓటు వేసాడని స్పష్టం కావడంతో ఆ అధికారిపై స్థానికులు దాడి చేశారు.

మధ్యాహ్నం 2.45: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల్ డిబి తాండలోని పోలింగ్ బూత్ నెంబర్ 188లో ఓటు హక్కుని వినియోగించుకొని  గూగులోత్‌ దేశయ్య అనే వృద్ధుడు గండెపోటుతో మృతి చెందాడు.


​​​​​మధ్యాహ్నం 2.25: ఎన్నికల కోడ్‌కు విరుద్దంగా వ్యవహరించిన ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్‌ నేత నల్లూ ఇంద్రసేనా రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ గెలువబోతున్నామని స్టేట్‌మెంట్‌ ఇచ్చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. ముషీరాబాద్‌, అంబర్‌పేట్‌లో రౌడీలు హల్చల్‌ చేస్తున్నారని, ముస్లిం మహిళలు ఉండే ప్రాంతంలో లేడి కానిస్టేబుల్‌లను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

జనగామ మండలం చీటకోడూర్ గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచే విషయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు గండి విజయ్, బొట్ల అశోక్  మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ గండి విజయ్‌ని జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మధ్యాహ్నం 2 : సూర్యాపేటలోని తిరుమలగిరి మున్సిపాలిటీలోని బీసీ కాలనీ 291వ బూత్‌కి సిబ్బంది తాళం వేసి భోజనానికి వెళ్లడంతో రిటర్నింగ్ అధికారి సంజీవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా నవాబు పేట మండలం ఎల్లకొండలో కాంగ్రెస్ అభ్యర్థి కె.ఎస్.రత్నం కారు ధ్వంసం చేశారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో 500 ఓట్లు గల్లంతు అయ్యాయని ఓటర్ల ఆందోళనకు దిగారు. సినీదర్శకుడు రాఘవేందర్‌ రావు, జగపతి బాబు, మంచు మనోజ్‌, కృష్ణ, విజయ నిర్మల, చార్మి, ఆలీ, నరేశ్‌, దామోదర రాజనర్సింహా, కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


 

మధ్యాహ్నం 1.30 : రామాంతపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో బూత్ నెంబర్ 259 లో ఈవీఎం బ్యాటరీ డిశ్చార్జ్ కావడంతో దాదాపు గంట నుండి పోలింగ్ ఆగిపోయింది. కొంత మంది ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఇప్పటి వరకు కూడా బ్యాటరీ మార్చడానికి అధికారులు రాలేదు. బీజేపీ అభ్యర్థి బాబూ మోహన్, కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డిలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మధ్యాహ్నం 1 : తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 47.8 శాతం పోలింగ్‌ నమోదైంది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో 40 వేల ఓట్లు గల్లంతయ్యాయి. జాంబాగ్ డివిజన్‌, జూబ్లీహిల్స్‌లో కూడా భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. తమ ఓట్లు గల్లంతవ్వడంతో పలుచోట్ల ఓటర్లు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట కాలనీలో 50 మంది ఓట్లు గల్లంతయ్యాయి. తమకు ఓటు హక్కు కల్పించాలంటూ ఎంఆర్ఓ పరమేశ్వర్‌ను బాధితులు నిలదీశారు. ఈటల రాజేందర్, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, కూనా శ్రీశైలంగౌడ్‌లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన ఓటు గల్లంతు కావడంపై గుత్తా జ్వాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబితాలో పేర్లు లేనప్పుడు ఎన్నికలు పారద్శకంగా ఎలా జరుగుతాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని సొంత ఊర్లకు వెళ్లే వారి  వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని సీఎస్‌ను అదేశించానని సీఈఓ రజత్ కుమార్ అన్నారు. సీఎస్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాజకీయ పార్టీల నేతలపై దాడులకు సంబంధించి కొన్ని ఫిర్యాదులు అందాయన్నారు. జిల్లా అధికారులను నివేదిక ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

మధ్యాహ్నం 12.30 : చింతమడకలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హీరో మహేష్‌ బాబు, నమ్రతా శిరోద్కర్, గవర్నర్‌ నరసింహన్‌, కేటీఆర్‌, ఉప్పల్ బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డిలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మధ్యాహ్నం 12 : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఓటర్ లిస్ట్ లో పేర్లు లేవని ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ఆందోళకు దిగారు. ఎన్నికలను రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ఎదట ఓటర్ లిస్టులో తమ పేర్లు లేవని బాధితులు ఆందోళనకు దిగారు. ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో చనిపోయిన వారి పేర్లు ఓటర్ లిస్టులో ఉన్నాయి, కానీ బ్రతికి ఉన్న వారి పేర్లు ఓటర్ లిస్టులో లేవని బాధితులు తమ నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో 1500 ఓట్లు గల్లంతు అవ్వడంతో బీక్కనూర్ ఎంఆర్‌ఓనీ గ్రామస్థులు నిలదీశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఓటర్ లిస్టులో తమ పేరు లేదని చెన్నూరు ఎమ్మార్వో ఆఫీస్ ముందు బాధితులు నిరసన తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ పోలింగ్ కేంద్రంలో మేయర్ రవీందర్ సింగ్ తల్లి 103 సంవత్సరాల వృద్ధురాలు ధన్నాకౌర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మేయర్ కుటుంబ సభ్యులు 32 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు దాసరి మనోహర్ రెడ్డి, ఏనుగు రవిందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్‌, ఎంపీ బీబీ పాటిల్‌లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ఉదయం 11.30 : ఓటు వేసేందుకు సొంత ఊర్లకు వెళ్లే వారి వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ఉచిత రవాణా కల్పించాలని సీఈఓ రజత్ కుమార్ సీఎస్‌ను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా మంథని‌లో పోలింగ్ కేంద్రంలో పార్టీ కండువా కప్పుకొని ప్రచారం చేశారని, టీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమదు ఆయన సతీమణి పుట్ట శైలజపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్, మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచి రెడ్డి కిషన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గణేష్‌ గుప్తా, జీవన్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌, బండారు దత్తాత్రేయ, జిట్టా బాలకృష్ణా రెడ్డి, గొంగిడి సునితా మహేందర్‍రెడ్డి, కే లక్ష్మణ్‌, సానియా మీర్జా, మంచు లక్ష్మి, నటుడు రాజేంద్ర ప్రసాద్‌లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఉదయం 11 : నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో 18వ బూతులో ఓటు వేసేందుకు వచ్చిన నరసింహ అనే వృద్ధుడు గుండెపోటుతో పడిపోగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని అమనగల్ మండలం జంగారెడ్డి పల్లి లో కాంగ్రెస్ అభ్యర్ధి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి పై బీజేపీ నాయకులు దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన వంశీచంద్‌ను నిమ్స్‌కు తరలించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కునిపూర్‌లో 106 పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు మోరాయించడంతో అర గంట నుండి పోలింగ్‌ నిలిచిపోయింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నెం.100 పోలింగ్‌ బూతులో విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించడంతో, పది నిమిషాలపాటూ అధికారులు పోలింగ్ నిలిపివేశారు.  పోలీసులతో చర్చించి మళ్లీ పోలింగ్‌ పునరుద్ధరించారు. మాజీ  ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, మాజీ మంత్రి ముకేశ్ గౌడ్, గద్దర్, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రవణ్, విజయశాంతి, నితిన్, డీజీపీ మహేందర్ రెడ్డి, స్వామి పరిపూర్ణానంద, కమెడియన్‌ సునీల్‌, నటుడు నాగేంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలో ఉ.11 గంటల వరకు 21.97 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఉదయం 10.30 : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో 50% ఓట్లు గల్లంతు అవ్వడంతో రోడ్డు పై గ్రామస్థులు రాస్తా రోకో చేస్తున్నారు. కరీంనగర్‌లో వైష్ణవి కాలేజీలో టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి అమ్మారెడ్డి ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎంపీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, బీజేపీ అభ్యర్థి మదవనేని రఘునందన్ రావు, బీజెపి అభ్యర్థి బండి సంజయ్, డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ, టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గంప గోవర్ధన్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ లోకాయుక్త జస్టిస్ సుభాషన్ రెడ్డి, టెస్కోబ్ చైర్మన్ రవీందర్ రావు, మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు, మాజీ మంత్రి డీకే అరుణ, మంద జగన్నథం, మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, మధుసూదనాచారి, చల్లా ధర్మారెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిలు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం మైబునగరంలో ఈవీఎం మొరాయించింది. గంటన్నర నుండి పోలింగ్‌ నిలిచిపోయింది. ఈవీఎంను అధికారులు రీప్లేస్ చేస్తున్నారు.

ఉదయం 10 : జూబ్లీహిల్స్‌ ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌లోని పోలింగ్‌ బూత్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులతో పాటూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కార్వాన్‌లోని ఈవీఎం  మిషన్స్ పనిచేయకపోవడంతో బీజేపీ అభ్యర్థి అమర్ సింగ్ రీ పోలింగ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని కార్మికశాఖ కార్యాలయంలో సీపీఎం జాతీయ నాయకులు బీవీ రాఘవులు ఓటు వేశారు. గండిపేట్ మండల్ కిస్మాత్ పూర్‌లో శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్‌ అరగంటకు పైగా లైన్‌లో వేచి ఉన్నారు. బోధన్‌లో ఎంపీ కవిత, రాజేంద్ర నగర్‌లో అసదుద్దీన్‌ ఒవైసీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలో ఉ.10 గంటల వరకు 10.15 శాతం పోలింగ్‌ నమోదైంది. 

ఉదయం 9.30 : తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్‌ కొనసాగుతోంది. పోలింగ్‌ విషయంలో ఎన్నికల సంఘం సరైన ఏర్పాట్లు చేయలేదని చాలా కేంద్రాల్లో ఓటర్లు ఆందోళనకు దిగారు. ఉదయాన్నే ఓటువేద్దామని పోలింగ్‌ కేంద్రాలకు వచ్చినా కూడా ఈవీఎంలు పని చేయక, ఏజెంట్లు కొన్ని చోట్ల రాక పోలింగ్‌ ఆలస్యమవుతోంది. దీంతో చాలా మంది ఓటర్ల వెనుదిరిగి వెళుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 229 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మోరాయించాయి. 20 కేంద్రాల్లో ఇంకా పోలింగ్‌ ప్రారంభం కాలేదు. జహీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాణిక్‌ రావు ఓటు వేస్తుండగా ఈవీఎం మోరాయించింది. మరో ఈవీఎంను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.


ఉదయం 9 : రంగారెడ్డి పుప్పులగూడ బాలాజీ నగర్‌లో బీజేపీ మహాకూటమి నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బీజేపీ అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదాశివపేట పట్టణంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింత ప్రభాకర్‌ ఓటు వేశారు. ప్రశాసన్‌ నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఓటు వేశారు. కొండారెడ్డిపల్లిలో రేవంత్‌ రెడ్డి, గద్వాలలో డీకే అరుణ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి తన కుటుంబసభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలో 9 గంటల వరకు 8.97 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ శాతం వివరాలు.. కరీంనగర్‌- 8.5, నిజామాబాద్‌- 9, మెదక్‌- 8, వరంగల్‌- 9 నల్లగొండ- 10, మహబూబ్‌ నగర్‌- 7, ఆదిలాబాద్‌- 9, రంగారెడ్డి- 7, ఖమ్మం- 8.5

ఉదయం 8.30 : ఇంకా పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. మరికొన్ని చోట్ల పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు ఉన్న చోట లైటింగ్‌ సరిగా లేదని.. పార్టీల గుర్తులు సరిగా కనబడటంలేదని ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. గవర్నర్‌ నరసింహన్‌ వేస్తున్న సోమాజిగూడ రాజ్‌నగర్‌ అంగన్‌వాడి పోలింగ్‌ కేంద్రంలో కూడా ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. కిషన్‌ రెడ్డి, అయన కుటుంబ సభ్యులు కాచిగూడలో ఓటు వేశారు. కామారెడ్డిలోని మద్నూర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ గంట ఆలస్యంగా  ప్రారంభమైంది. 

ఉదయం 8 : పద్మా దేవెందర్‌రెడ్డి, జోగు రామన్న, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ దానకిషోర్‌, ఎంపీ వినోద్‌ కుమార్‌, రాథోడ్ రమేష్‌, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, సీపీ మహేష్‌ భగవవత్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పీవీ సింధు, రాజమౌళి ఇప్పటికే ఓటు వేయగా..జూబ్లీహిల్స్‌లో ఓటు వేసేందుకు అల్లు అర్జున్‌, నాగార్జున, అమల క్యూలైన్లో ఎదురుచూస్తున్నారు. 

ఉదయం 7.30 : ఏజెంట్లు ఆలస్యంగా రావడం, వీవీప్యాట్‌, ఈవీఎంల్లో సమస్యలు తలెత్తడంతో ఇంకా కొన్నిచోట్ల పోలింగ్‌ ప్రారంభం కాలేదు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, కొత్తగూడం, హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌, హయత్‌నగర్‌, వివేకానంద నగర్‌లో పోలింగ్‌ ఆలస్యమవుతుండటంతో ఓటర్లు పడిగాపులు కాస్తున్నారు.   

ఉదయం 7 : తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. ఆపద్ధర్మ మంత్రి హరీష్‌ రావు, తుమ్మల నాగేశ్వర రావు, ఇంద్ర కరణ్‌ రెడ్డి, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అయితే ఈవీఎంలో సమస్యలు తలెత్తడం వల్ల కొడంగల్‌లో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు