తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్

11 Mar, 2016 01:34 IST|Sakshi
తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్

వాస్తవాలకు దూరంగా గవర్నర్ ప్రసంగం
 కాంగ్రెస్ శాసనసభాపక్షం విమర్శ

హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ శాసనసభా పక్షం పెదవి విరిచింది.   ప్రభుత్వం గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించిందని విమర్శించింది. గవర్నర్ ప్రసంగం వాస్తవాలను ప్రతిబింబించలేదని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. గురువారం వారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ దేశం కన్నా రాష్ట్ర వృద్ధిరేటు ఎక్కువగా ఉందని గవర్నర్ చెప్పడం శోచనీయమన్నారు. మైనస్ నాలుగుగా ఉన్న వ్యవసాయం వృద్ధిరేటును 0.8గా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పారిశ్రామిక, సేవారంగాల్లో రోజురోజుకు పరిస్థితులు అడుగంటుతుండగా అవాస్తవాలను చెప్పించడం విచారకరమన్నారు. కరువుతో అల్లాడిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకునేందుకు ఈసారైనా ఒకేసారి రుణమాఫీ చేస్తారని భావించగా నిరాశే మిగిలిందన్నారు. దళిత, గిరిజనులకు మూడెకరాల వ్యవసాయభూమి, మైనారిటీలు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, 2 లక్షల ఖాళీ ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు గురించి మాట్లాడలేదని విమర్శించారు.     
 
కొత్తదనం లేని గవర్నర్ ప్రసంగం: బీజేఎల్పీ
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను గవర్నర్ అసెంబ్లీలో మరోసారి చదివి వినిపించారని బీజేపీ శాసనసభా పక్షం విమర్శించింది. బీజేఎల్‌పీ నేత కె.లక్ష్మణ్, పార్టీ ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావుతో కలసి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడం, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూపంపిణీ, ఎస్సీ సంక్షేమానికి రూ. 50వేల కోట్లు, బీసీ సబ్‌ప్లాన్, కేజీ టూ పీజీ ఉచిత విద్య వంటి  వేవీ గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించలేదన్నారు.
 
గవర్నర్‌కు కరువు కనిపించలేదా?:
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు కరువుతో విలవిల్లాడుతుంటే గవర్నర్ నరసింహన్‌కు కనిపించలేదా అని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ ప్రశ్నించారు. రైతాంగం తీవ్ర కరువుతో ఉంటే ప్రసంగంలో కనీస ప్రస్తావన లేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం నుంచి స్పందనలేదన్నారు. రాష్ట్రం నుంచి 60 లక్షల మంది ఉపాధి కోసం వలస పోయారని అన్నారు. గ్రామీణ ప్రాంత వాసులను ఆదుకోవలసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రవీంద్రనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.   
 
ఇరవై నెలల్లోనే అభివృద్ధి బాట: కర్నె
హైదరాబాద్: తమ ప్రభుత్వం చేసేదే చెబుతుందని, చెప్పేదే చేస్తుందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. 50 ఏళ్ల సమైక్య పాలనలో లేని అభివృద్ధిని కేవలం 20 నెలల్లోనే పట్టాలెక్కించామని చెప్పారు. కేసీఆర్ స్వయంగా రైతు కావడంతో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారని తెలి పారు. గోదావరిపై చేపట్టనున్న ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌తో తెలంగాణ భూముల్లో బంగారు పంటలు పండనున్నాయని ఆయన వివరించారు.
 
హామీల అమలు ఊసేదీ?: పాయం
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి, వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ముస్లిం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తామన్న సీఎం రెండేళ్లు గడిచినా ఆ ఊసే ఎత్తడంలేదన్నారు.  15వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి భరోసా ఇచ్చే ఒక్క కార్యక్రమమూ చేపట్టడంలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణలోని ప్రాజెక్టులను 80 శాతం పూర్తి చేస్తే.. సీఎం కేసీఆర్ మిగిలిన 20 శాతం ప్రాజెక్టుల పనులను విస్మరించి... రీడిజైనింగ్ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు.
 
అమరుల కుటుంబాల అడ్రస్ దొరకడం లేదట!
హైదరాబాద్: తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. వారి కుటుంబాలకు సాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. వారి అడ్రస్‌లు దొరకడం లేదని  చెప్పడం సిగ్గుచేటన్నారు.  ఉద్యమంలో 1,200 మంది ప్రాణత్యాగం చేశారని  ప్రకటించిన సీఎం కేసీఆర్ కేవలం 400 కుటుంబాలకే రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఇందులో 29 మంది కుటుంబాల అడ్రస్‌లు దొరకడం లేదని చెప్పడం వీరికే చెల్లుతుందన్నారు.
 
గిరిజనులను సమాధి చేస్తున్నారు: సున్నం
 ఏపీలో విలీనం చేసిన ఏడు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. రెండు ప్రభుత్వాలు కలసి గిరిజనులను సమాధి చేసేందుకు కంకణం కట్టుకున్నట్లుందని చెప్పారు. గవర్నర్ ప్రసంగం అరచేతిలో వైకుంఠం చూపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీచ్‌ను అచ్చుగుద్దినట్లు గవర్నర్ చదవి వినిపించారని రాజయ్య విమర్శించారు.
 
ఎన్నికల వాగ్దానాలు ప్రతిబింబించలేదు: చాడ
ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ చేసిన వాగ్దానాల అమలు గవర్నర్ ప్రసంగంలో పూర్తిస్థాయిలో ప్రతిబింబించలేదు. దళితులకు మూడెకరాల భూమి, జీవో 58 ప్రకారం గుడిసెలు వేసుకున్న వారికి ఇళ్ల పట్టాలు, కేజీ టు పీజీ వంటి ప్రధాన సమస్యల ప్రస్తావన లేకపోవడం దాటవేత వైఖరికి అద్దం పడుతోంది. పాతబస్తీకి మెట్రోరైలు విస్తరణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం. బడ్జెట్‌లో పొందుపరిచిన నిధులతో వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి నీరు ఎలా సాధ్యపడుతుంది. కోటి ఎకరాలకు సాగునీరు, 45 వేల చెరువుల పునరుద్ధరణ ఎలా సాధ్యమవుతుంది.
 
సామాజిక న్యాయంపై నిర్లక్ష్యం: తమ్మినేని
సామాజిక న్యాయంపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలి గించింది. 92 శాతం మంది ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గురించి, వారి సంక్షేమం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ రూల్స్ రూపొందించడం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల చైర్మన్ పోస్టుల భర్తీ గురించి ప్రస్తావనే లేదు. బీసీ, మైనారిటీ, వికలాంగుల సబ్‌ప్లాన్ చట్టాల గురించి పేర్కొనకపోవడం శోచనీయం. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల గురించి పట్టించుకోలేదు.
 
గిరిజనులపై చిత్తశుద్ధి లేదు: గిరిజన సంఘం
రాష్ట్రం బంగారు తెలంగాణ అయిపోయినట్లే గవర్నర్ తన ప్రసంగంలో భ్రమ కల్పించారు. ప్రత్యేక సమస్యలు ఎదుర్కొంటున్న గిరిజన ప్రాంతాలు, గిరిజనుల ప్రస్తావనే లేదు. మారుమూల ప్రాంతాల్లో మాతా శిశు మరణాలు, గిరిజనుల గురించి మాట్లాడలేదు. గిరిపుత్రుల వైద్య, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చర్యల గురించి పేర్కొనలేదు.
 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా