తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ విడుదల

5 Jan, 2019 18:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నూతన అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జనవరి 17 నుంచి 20 వరకు నూతనంగా ఏర్పడిన సభ తొలిసారి సమావేశం కానుంది. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగా శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నేత, చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌కు నియమితులుకానున్నారు. జనవరి 16న సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయనచే గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మర్నాడే (జనవరి 17న) నూతనంగా ఎన్నికైన సభ్యులతో అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ప్రమాణ స్వీకారం అనంతరం జూబ్లీహాల్‌లో సభ్యులకు విందు కార్యక్రమం ఉంటుంది. అదే రోజున శాసనసభ స్పీకర్‌ ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటన, నామినేషన్‌ స్వీకరణ కార్యక్రమాలు జరుగుతాయి. జనవరి 18న సభ్యులు శాసనసభ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఎన్నిక అనంతరం నూతన స్పీకర్‌ అధ్యక్షతన సభా కార్యక్రమాలు సాగుతాయి. అనంతరం స్పీకర్‌ బీఎసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. జనవరి 19న నూతనంగా ఏర్పడిన సభను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. ఆ మర్నాడే గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపడం కార్యక్రమం జరుగుతుంది.

కాగా డిసెంబర్‌ 11న వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్‌ఎస్‌ 88 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 13న కేసీఆర్‌ రెండోసారి సీఎంగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. వివిధ కారణాల వల్లన శాసన సభ్యుల ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేస్తూ వచ్చారు.

మరిన్ని వార్తలు