నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

10 Mar, 2016 07:21 IST|Sakshi
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఉదయం 11 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రసంగం

సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. బడ్జెట్‌లోని ముఖ్యాం శాలు, సంక్షేమం, అభివృద్ధి పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలు గవర్నర్ ప్రసంగంలో ఉండొచ్చని భావిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ శుక్రవారానికి వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్ చాంబర్‌లో బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశం జరగనుంది. శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, వివిధ పార్టీల సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, సెలవులు తదితర అంశాలపై ఇందులో చర్చిస్తారు. శుక్రవారం సంతాప తీర్మానంతో సభ వాయిదా పడనుంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి(కాంగ్రెస్) అనారోగ్యంతో ఇటీవలే హఠాన్మరణం చెందారు. సిట్టింగ్ సభ్యుడైన ఆయన మృతికి సంతాపం తెలిపిన తర్వాత ఆయా పార్టీల నుంచి సభ్యులు రాంరెడ్డి వెంకట్‌రెడ్డితో తమకున్న అనుబంధాన్ని సభకు తెలియజేస్తారు. శనివారం నుంచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చేపడతారు. ఇది రెండు రోజులు ఉంటుందా? లేదా ఒకరోజుకే పరిమితం చేసి ఆదివారం సెలవు ఇస్తారా అన్న విషయం బీఏసీ సమావేశంలో తేలనుంది. ముందే నిర్ణయించిన మేరకు ఈ నెల 14వ తేదీన ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.

 ఉత్సాహంలో అధికార పక్షం
 వరుస ఎన్నికల్లో విజయంతో టీఆర్‌ఎస్ బడ్జెట్ సమావేశాలకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమైంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు ప్రజల దీవెన ఉందని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయన్న భావనలో టీఆర్‌ఎస్ నాయకత్వం ఉంది. 6 ద శాబ్దాలుగా మహారాష్ట్రతో పెండింగ్‌లో ఉన్న గోదావరి జలాలు, 5 బ్యారేజీల నిర్మాణానికి ఒప్పందం చేసుకోవడాన్ని టీఆర్‌ఎస్ తమ విజయంగా పేర్కొంటోంది. సమావేశాల్లో విపక్షాలకు దీటైన జవాబిస్తామన్న ధీమాతో ఉంది.

 ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
 అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు వేర్వేరుగా శాసన సభాపక్ష సమావేశాలను నిర్వహించాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరాజయంతో విపక్షాలు ఒకింత ఆత్మరక్షణలో ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ గూటికి చేరడం ఆ పార్టీని కుంగదీసింది. ఈ సమావేశాల్లో కూడా విపక్షాలు ఎమ్మెల్యేల వలసలపై పట్టుబట్టే అవకాశం ఉంది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై అసెంబ్లీలో చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ ఇప్పటికే పలు ూర్లు ప్రకటించింది. సీఎల్పీ సమావేశంలోనూ వలసలు, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై పాలక పక్షాన్ని నిలదీయాలన్న చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు టీడీపీ మిత్రపక్షం బీజేపీ సైతం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత అధికార టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టే స్థైర్యాన్ని కోల్పోయిందని అంటున్నారు. ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ లెక్కన ప్రతిపక్షాల నుంచి పాలక పక్షంపై పెద్దగా దాడి ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 ఏర్పాట్లను సమీక్షించిన స్పీకర్
 ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా శాసనసభ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు స్పీకర్ మధుసూదనాచారి ఏర్పాట్లను సమీక్షించారు. ఇద్దరు సీఎంల రాకపోకలు, మంత్రుల రాకపోకలకు గేట్ల కేటాయింపు, ప్రొటోకాల్, భద్రత తదితర అంశాలపై చర్చించారు. గేట్-1 నుంచి ఇరు రాష్ట్రాల సీఎంలు, మంత్రుల వాహనాలు, గేట్-2 నుంచి ఎమ్మెల్యేల వాహనాలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.
 

>
మరిన్ని వార్తలు