16న అసెంబ్లీ.. రిజర్వేషన్లపై చట్టం: కేసీఆర్

12 Apr, 2017 19:46 IST|Sakshi
16న అసెంబ్లీ.. రిజర్వేషన్లపై చట్టం: కేసీఆర్

15వ తేదీన బీఏసీ సమావేశం
తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తాం
అవసరమైతే 50 శాతం మించి ఇస్తాం, అనుమతి తీసుకుంటాం
ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి
ఒక రాష్ట్రానికి ఒక నీతి, మరో రాష్ట్రానికి మరో నీతి సరికావు
21న ప్లీనరీ, 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ
14 నుంచి 20 వరకు గులాబి కూలీదినాలు
నేను కూడా రెండు రోజులు కూలిపనులు చేస్తా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి


హైదరాబాద్
ఈనెల 16వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందని, ఆ రోజు ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్లపై బిల్లును ఆమోదిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. అయితే మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి వారిని బీసీ-ఈ గానే పరిగణించి ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలో మంత్రివర్గంలో నిర్ణయించి ఆ మేరకు బిల్లును పెడతామన్నారు. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి రాష్ట్రపతి ఆమోదం కోరుతామని తెలిపారు. ఈ విషయమై బుధవారం నిర్వహించిన కేబినెట్ సమావేశం అనంతరం ఆయన సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లతో పాటు హెరిటేజ్ చట్టం వంటి పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

 • తెలంగాణ రాష్ట్రం సామాజిక నేపథ్యంలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉన్నారు
 • కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరైనా పరిస్థితిని సమీక్షించుకుంటారు
 • బీసీ-ఈ కింద పరిగణించే ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. వారిలో పేదరికం ఉంది
 • ముస్లింలు, గిరిజనులకు చెరో 12 శాతం రిజర్వేషన్ పెంచుతామని నేను గతంలో చెప్పాను
 • తమిళనాడులో 50 శాతం కంటే ఎక్కువ ఎలా అమలవుతోందో తెలంగాణలోనూ అలాగే చేస్తామని గతంలో చెప్పాను
 • సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్లు నియమించగా ఇద్దరూ నివేదికలు ఇచ్చారు
 • కుల మతాల పేరు మీద రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి వాళ్ల ఆర్థిక, రాజకీయ, సామాజిక వెనకబాటు ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వగలం కాబట్టి ఆ మేరకు బీసీ కమిషన్‌ నివేదికలు ఇచ్చింది
 • ఆ నివేదికను ప్రభుత్వం ఆమోదించింది
 • ఎస్టీ కమిషన్‌కు సంబంధించి చెల్లప్ప నివేదికను కూడా ఆమోదించాం
 • ఈనెల 16న అసెంబ్లీ సమావేశం ఏర్పాటుచేయాలని స్పీకర్‌ను కోరాం
 • బిల్లు తయారుచేయాల్సిందిగా న్యాయశాఖ కార్యదర్శిని కూడా ఆదేశించాం
 • 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ కేబినెట్ సమావేశం ఉంటుంది
 • 4.30 గంటలకు స్పీకర్ కార్యాలయంలో బీఏసీ సమావేశం నిర్వహించాలని కోరాం
 • 16వ తేదీన అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుంది
 • మంత్రులు అధ్యయనం చేసిన తర్వాత 15న ఎస్టీలకు ఎంత శాతం, బీసీ-ఈకి ఎంత శాతం ఇవ్వాలో నిర్ణయిస్తాం
 • మేం మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం లేదు, మేం ఇచ్చేది కొత్తది కూడా కాదు
 • ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే ఇస్తున్నారు
 • దూదేకులకు ఒక శాతం, బీసీ-ఈ కింద 4 శాతం ఇస్తున్నారు
 • దాన్ని కొంతమేరకు పెంచుతాం.. అంతేతప్ప కొత్తగా ఇవ్వడంలేదు
 • ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రక్షణ ఉంది. వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వడానికి అవసరమైతే 50 శాతం మించి ఇవ్వడానికి సుప్రీంకోర్టే అనుమతించింది
 • తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేరళ, కర్ణాటక, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఈ ఏడు రాష్ట్రాల్లో ముస్లింల వెనకబాటు తనాన్ని గుర్తించి అందులో కొన్ని గ్రూపులను గుర్తించి వారికి ఇప్పటికే రిజర్వేషన్ ఇస్తున్నారు.
 • తమిళనాడు 69%, జార్ఖండ్ 60%, మహారాష్ట్ర 52%, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మిజొరాం.. ఈ నాలుగు రాష్ట్రాలలో గిరిజనులకు 80% చొప్పున రిజర్వేషన్ అమలులో ఉంది.
 • గుర్జర్లు, జాట్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని రాజస్థాన్ ప్రభుత్వం అక్కడ రిజర్వేషన్లను 68 శాతానికి పెంచాలని తీర్మానించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది.
 • ఆ తరహాలోనే మేం 15న కేబినెట్ ఎంత శాతమో నిర్ణయించాక 16న అవసరమైన చట్టం చేస్తాం
 • తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ చట్టాన్ని ఆమోదిస్తాం
 • కేంద్రంతో మాట్లాడి దీనికి రాష్ట్రపతి ఆమోదం ఇప్పించాలని కోరుతాం, కేంద్రం కూడా ఇప్పిస్తుందనే ఆశాభావం ఉంది
 • దేశంలో ఒక రాష్ట్రానికి ఒక నీతి, మరో రాష్ట్రానికి మరో నీతి ఉండటానికి వీల్లేదు
 • తమిళనాడులో 68 శాతం రిజర్వేషన్ 32 ఏళ్లుగా కొనసాగుతోంది
 • 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మిగిలిన తమిళనాడులో రిజర్వేషన్లపై సమీక్షించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు.
 • ఇప్పుడు తెలంగాణది కూడా అదే పరిస్థితి. ఇక్కడి సామాజిక స్వరూపానికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది
 • ఇక్కడ ఎస్సీలకు 15 శాతం అమలుచేస్తున్నాం, కానీ రాష్ట్రంలో వారి జనాభా 16.3 శాతం ఉన్నట్లు జనాభా లెక్కల్లో తేలింది
 • బీసీల రిజర్వేషన్‌ను కూడా కొంత పెంచడానికి సుముఖంగా ఉన్నాం
 • వృత్తి పనుల్లో చెప్పులు కుట్టే వృత్తి తప్ప మిగిలిన వృత్తులన్నీ బీసీ కులాలే చేస్తున్నారని, వాళ్లు వెనకబడి ఉన్నందున వాళ్లకు ఎంత శాతం రిజర్వేషన్ పెంచాలి, అందులో అత్యంత వెనకబడిన (ఎంబీసీ)ల పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్లకు ఏంచేయాలి, సంచార జాతుల స్థితిగతులేంటనే విషయాలపై సమగ్ర అధ్యయనం చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ను కోరాం
 • బీసీ కమిషన్ ఎక్కడ పర్యటించినా వారికి కలెక్టర్లు, కార్యదర్శులు పూర్తి సమాచారాన్ని అందించాలని తెలిపాం
 • ఇప్పుడు బీసీలకు ఉన్న రిజర్వేషన్ ఒక్కశాతం కూడా తగ్గదు.. నివేదిక అందిన తర్వాత మరింత పెంచుతాం
 • ఎవరూ ధర్నాలు, డిమాండ్ చేయకపోయినా దేశంలో తొలిసారిగా మార్కెట్ కమిటీ చైర్మన్లలోనూ రిజర్వేషన్లు అమలు చేశాం
 • పార్టీల మేనిఫెస్టోలు చిత్తు కాగితాలా.. వాటిని అమలు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల వ్యాఖ్యానించారు.
 • అందువల్ల ప్రోగ్రెసివ్ థింకర్స్ ఎవరూ దీన్ని వ్యతిరేకించొద్దని కోరుతున్నా
 • త్వరలోనే ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్లను నియమించి స్థితిగతులపై అధ్యయనం చేస్తాం
 •  
 • సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు హెరిటేజ్ చట్టం అసంబద్ధంగా ఉండేది
 • దాన్ని అర్బన్ డెవలప్‌మెంట్ కింద పెట్టి కేవలం హైదరాబాద్ నగరంలోనే కొన్ని భవనాలనే తెచ్చారు, అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న చారిత్రక కట్టడాలను విస్మరించారు
 • వనపర్తి కోట, దోమకొండ గడీ  లాంటి వాటిని పెట్టలేదు
 • గతంలోనే దాన్ని మార్చాం. హెరిటేజ్ యాక్ట్ అంటే రాష్ట్రం మొత్తానికి ఉంటుంది. దాన్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం.
 • గతంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా చేసిన డి రాజేశ్వరరావు, ఫారుక్ హుస్సేన్ లను మరో టెర్మ్ నియమించాలని తీర్మానం చేశాం, గవర్నర్‌కు పంపుతాం
 • 17 వేల కోట్ల రుణమాఫీని విజయవంతంగా ముగించాం
 • తెలంగాణ రైతులకు ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం
 • లక్ష రూపాయల రుణభారం వారి తలమీద నుంచి తీసేశాం

21న ప్లీనరీ, 27న వరంగల్‌లో సభ

 • ఈనెల 21వ తేదీన హైదరాబాద్‌లో ప్లీనరీ, 27వ తేదీన వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం
 • టీఆర్ఎస్‌ సభ్యత్వం 75 లక్షలు దాటింది.. స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారు
 • దేశంలోని పెద్ద పార్టీలలో టీఆర్ఎస్ కూడా చేరింది
 • నాయిని నరసింహారెడ్డి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా ఉంటారు
 • 14 నుంచి 20 వరకు గులాబి కూలీ దినాలుగా ప్రకటిస్తున్నా
 • వీలును బట్టి ఈ ఆరు రోజుల్లో రెండు రోజుల పాటు కూలీ పనులు చేయాలి
 • నేను కూడా రెండు రోజులు కూలీ చేసి ఆ డబ్బుతో సభకు రావాలి, దాన్ని విజయవంతం చేయాలి

మరిన్ని వార్తలు