విద్యార్థుల అరెస్ట్‌.. రేపు రాష్ట్ర బంద్

28 Mar, 2018 19:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రవేటు యూనివర్శిటీల బిల్లును వ్యతిరేకిస్తూ బుధవారం అసెంబ్లీ ముట్టడికి యత్నంచిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులు చేశారంటూ విద్యార్థి సంఘాలు గురువారం తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రముఖ విద్యార్థి సంఘాలు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, టీవీవీ, ఏఐఎస్‌ఓ, టీఎస్‌ఎఫ్‌ల ఆధ్యర్యంలో విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు.

ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని తీవ్రగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడించేందుకు బుధవారం ఉదయం నిజాం కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థులను అదుపు చేసేందుకు పోలీసు లాఠీ చార్జ్‌ చేయడానకి యత్నించడంతో తోపులాట జరిగింది. చివరకు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్‌లకు తరలించారు.

విద్యార్థినులని కూడా చూడకుండా.. ముట్టడిలో పాల్గొన్న విద్యార్థినులను సైతం మగ పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్‌లలోకి ఎక్కించారు. పోలీసుల తీరుపై విద్యార్థులు తీవ్ర నిరసనలను వ్యక్తం చేశారు. అరెస్ట్‌ అయి పోలీసు స్టేషన్‌లో ఉన్న నాయకులు అక్కడే మీడియాతో మాట్లాడారు. విద్యార్థి సంఘ నాయకులు కోట రమేష్‌, శివరామకృష్ణ, జూపాక శ్రీనివాస్‌, గంగాధర్‌, సందీప్‌, శోభన్‌ నాయక్‌లు మాట్లాడుతూ.. విద్యను అందించడం ప్రభుత్వం ప్రాథమిక విధి అని, ప్రభుత్వం తన భాద్యతను మరిచి ప్రైవేట్‌కు దాసోహమవుంతోందని విమర్శించారు.

ప్రైవేటు విశ్వవిద్యాలయాల వల్ల విద్య వ్యాపారంగా మారుతుందని, ప్రభుత్వాలకు వాటిపై నియంత్రణ ఉండదని పేర్కొన్నారు. ఫీజులు, పాఠ్యాంశాలు, ప్రవేశ విధానాలను అవే నిర్ణయించడం వల్ల దళిత, గిరిజన, బలహీన, మైనారిటీ వర్గాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగవచ్చని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ప్రజాతంత్ర హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. అలాగే, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును వెనక్కి తీసుకోవాలని, విద్యసంస్థల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని, అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు