ఎన్టీఆర్ వల్లే తెలంగాణ దివాళా

23 Nov, 2014 00:16 IST|Sakshi

ధారూరు: దివంగత ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు అధికారంలోకి వచ్చినపుడే తెలంగాణలోని ఐటీ రంగం బెంగళూర్‌కు తరలివెళ్లిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాలో 705 గ్రామ పంచాయతీలు ఉండగా ఎంపీ ధారూరు మండలంలోని నాగసమందర్ గ్రామాన్ని  సంసాద్ ఆదర్శ దత్తత గ్రామంగా ఎంపిక చేసుకున్నారు.

శనివారం ఎంపీ గ్రామానికి చేరుకుని సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. ఎన్టీఆర్ పాలన వల్ల తెలంగాణ దివాళా తీసిందని, ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందిందని విమర్శించారు.  కిలో రూ. 2ల బియ్యం పంపిణీ వల్ల ఆంధ్రకే మేలు జరిగిందన్నారు. ప్లానింగ్ లేకుం డా మద్యపాన నిషేధం అమలు చేయడంతో రాష్ట్ర ఆదాయానికి గండి పడిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం వేరుపడిన చరిత్ర, జియోగ్రఫీని మర్చి పక్క రాష్ట్ర దివంగత నేత పేరిట శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్‌కు ఎన్టీఆర్ టెర్మినల్‌గా పేరు పెట్టడం సరి కాదన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన దిగంగత ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు పేరును పెడితే తమకు అభ్యంతరం లేదన్నారు. విజయవాడకు ఎన్టీఆర్ పేరును ఖరారు చేస్తే మంచిదని ఆయన ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు సూచించారు. ఎన్టీఆర్ పేరును తొలగించకపోతే తాను పార్లమెంట్‌లో నిలదీస్తానని హెచ్చరించారు.

తాను దత్తత తీసుకున్న నాగసమందర్ గ్రామానికి నెలకోసారి వస్తానని, 3 నెలల్లో అనుకున్న విధంగా అభివృద్ధి జరిగితే మరో రెండు గ్రామాలను దత్తత తీసుకుంటానని పేర్కొన్నారు.  గ్రామానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించి అందులో గ్రామస్థుల పూర్తి వివరాలను నమోదు చేయిస్తానని చెప్పారు. ఇక్కడ రూపే కార్డును అందరికీ అందజేస్తామని, దీనితో 6 నెలల పాటు లావాదేవీలు జరిపితే ప్రభుత్వ పరంగా వారి ఖాతాలో రూ. 5 వేలు జమ చేయిస్తామని పేర్కొన్నారు.

 టూరిజం ప్రాజెక్టును  ఏర్పాటు చేస్తాం
 జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టుగా ఉన్న కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేయిస్తామని  ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.  నాగసమందర్  గ్రామంలోని సమస్యలను తెలుకునేందుకు శనివారం ఎంపీ గ్రామంలో పాదయాత్ర చేసి ప్రజలతో మాట్లాడారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రాజెక్టు ప్రాంతంలో టూరిజంను ఏర్పాటు చేస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల నుంచి కొంత మొత్తంలో రుసుమును వసూలు చేసి ఆ డబ్బులను ఈ గ్రామంలోనే ఖర్చు పెడతామని అన్నారు.  

ఐటీ కంపెనీలు, ఎన్‌ఆర్‌ఐలతో మాట్లాడి గ్రామంలో అభివృద్ధి చేసేందుకు వారి సహకారాన్ని కోరుతామని అన్నారు.  ఎమ్మెల్యే బి. సంజీవరావు మాట్లాడుతూ    నాగసమందర్ గ్రామాన్ని పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేయడానికి ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని, గ్రామంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. దారూరు పీఏసీఎస్ చెర్మైన్ హన్మంత్‌రెడ్డి మాట్లాడుతూ పత్తి రైతులకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 5 వేలు వచ్చేలా పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించి రైతులకు న్యాయం చేయాలని ఎంపీని కోరారు.


 ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ ఉమాపార్వతి, ఎంపీటీసీ సభ్యుడు బాలప్ప,  సర్పంచ్ శ్రీనివాస్, ధారూరు పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, డెరైక్టర్ బస్వరాజ్, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు వరద మల్లికార్జున్, రాజునాయక్‌లు, మండల టీఆర్‌ఎస్ కన్వీనర్ కుమ్మరి శ్రీనివాస్, రాష్ట్ర టీఆర్‌ఎస్ కార్యదర్శి కనకయ్య, రాష్ట్ర  విద్యార్థి విభాగం కార్యదర్శి శుభప్రదపటేల్, జిల్లా కార్మిక విభా గం అధ్యక్షుడు కృష్ణయ్య, రైతు విబాగం అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, తహసీల్దార్ విజయ, ఇన్‌చార్జీ ఎంపీడీఓ కాలుసింగ్, ఎబ్బనూర్ సర్పంచ్ రాజేం దర్‌రెడ్డి, జిల్లా, మండల టీఆర్‌ఎస్ నాయకులు రవీందర్‌రెడ్డి, రాజారత్నం, శాంతకుమార్, సర్వేశం, శేఖర్, ప్రశాంత్, రామచంద్రయ్య, మల్లారెడ్డి, సంతోష్‌కుమార్, రాములు, రాంరెడ్డి, దస్తయ్య, రామస్వామి, రుద్రారం వెంకటయ్య, కావలి అంజయ్య, విజయకుమార్, నందు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు