బీసీ కులాలను సాధించుకుంటాం

29 Oct, 2018 02:07 IST|Sakshi
ఆత్మ గౌరవ సభలో మాట్లాడుతున్న జేఏసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌

తమ డిమాండ్‌లు నెరవేర్చిన పార్టీకే మద్దతు 

తెలంగాణ బీసీ కులాల జేఏసీ 

అధ్యక్షుడు కందిబోయిన శ్రీనివాస్‌

హైదరాబాద్‌: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమస్ఫూర్తితోనే తెలంగాణలో బీసీ జాబితానుంచి తొలగించిన 26 కులాలను తిరిగి సాధిస్తామని తెలంగాణ బీసీ కులాల జేఏసీ అధ్యక్షుడు కందిబోయిన శ్రీనివాస్‌ అన్నారు. కూకట్‌పల్లిలో ఆదివారం జరిగిన బీసీ కులాల ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకుముందు తెలంగాణ 26 బీసీ కులాల లోగోను జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చేందుకు అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నామని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. 26 కులాలకు చెందిన వారంతా ఐక్యతతో పోరాడి మన హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. తొలగించిన కులాలన్నింటితో త్వరలోనే నగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అనంతరం పలువురు జేఏసీ సభ్యులు మాట్లాడుతూ..2014 వరకు బీసీలుగా ఉన్న తమకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తీరని అన్యాయం జరిగిందన్నారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో న్యాయం చేస్తానని హామీనిచ్చిన కేసీఆర్‌ తమకు ఇప్పటివరకూ అపాయింట్‌మెంటే ఇవ్వలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోని కేసీఆర్‌ను ఇప్పుడు ఎన్నికల ముందు అసలు నమ్మవద్దన్నారు. రానున్న ఎన్నికల్లో తమ సమస్యకు ఎవరు పరిష్కారం చూపితే వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఒక కుటుంబంలో పెద్ద కొడుకు బీసీ అయితే చిన్న కుమారుడు ఓసీ ఎలా అవుతాడని ప్రశ్నిం చారు. తమ పిల్లల చదువులను, జీవితాలను నాశనం చేయవద్దని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బాబూరావు, శ్రీరామచంద్రమూర్తి, యుగంధర్, వెంకటి, జల్లు హేమచందర్‌రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు