ఓబీసీ ఉప వర్గీకరణకు సూచనలిద్దాం

15 Feb, 2018 04:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రిజర్వేషన్లు, స్థితిగతులపై సమగ్ర నివేదిక రూపొందిస్తున్న బీసీ కమిషన్‌

ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాలతో రెండ్రోజుల సదస్సు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో కీలకమైన ఓబీసీ కోటా ఉపవర్గీకరణపై రాష్ట్ర బీసీ కమిషన్‌ సమాలోచనలు చేస్తోంది. ఓబీసీ ఉపవర్గీకరణ అధ్యయనం కోసం జస్టిస్‌ రోహిణి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అధ్యయన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అధ్యయన కమిటీకి తెలంగాణ స్థితిగతులను వివరించేందుకు బీసీ కమిషన్‌ కసరత్తు ముమ్మరం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మెజార్టీ జనాభా బీసీలదే. అయితే ప్రస్తుతం 50 శాతంలోపు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలంటే బీసీల వాటా 60 శాతం దాటుతుంది. ఈ అంశంపై రాష్ట్ర బీసీ కమిషన్‌ ఇప్పటికే అధ్యయనం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగాలు, నిరుద్యోగులు, బీసీల ఆర్థిక స్థితిగతులపై పరిశీలన దాదాపు పూర్తి చేసింది.

క్షేత్రస్థాయి సర్వే మినహా మిగతా ప్రక్రియ పూర్తయిందని సమాచారం. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ ఉపవర్గీకరణకు శ్రీకారం చుట్టడంతో రాష్ట్ర బీసీ కమిషన్‌ ఈమేరకు సమగ్ర నివేదిక రూపొందిస్తోంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు, బీసీల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రంగాల్లో పరిస్థితులను ఇందులో వివరించబోతోంది. ఇదే క్రమంలో ఓబీసీ ఉపవర్గీకరణపై దక్షిణాది రాష్ట్రాల్లోని బీసీ కమిషన్‌లతో హైదరాబాద్‌లో సదస్సు ఏర్పాటు చేయబోతోంది. ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ, సదస్సు నిర్వహించే తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడుతోపాటు మహారాష్ట్ర బీసీ కమిషన్‌లను ఆహ్వానించనుంది. ఈనెలాఖరు లేదా వచ్చేనెల మొదటివారంలో ఈ సదస్సు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సదస్సు అనంతరం ఓబీసీ ఉపవర్గీకరణపై చేసే తీర్మానాలను అధ్యయన బృందానికి అందించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు