వలస కార్మికులను రప్పించే ప్రక్రియ ప్రారంభం

4 Jun, 2020 01:44 IST|Sakshi

వలస కార్మికులను రప్పించే ప్రక్రియ ప్రారంభం

వారొస్తేనే.. నిర్మాణ రంగం పట్టాలెక్కేది 

లేబర్‌ కాంట్రాక్టు సంస్థల ద్వారా సంప్రదింపులు 

లక్ష మందికి కౌన్సెలింగ్‌.. 80 వేల మంది సంసిద్ధత

‘న్యాక్‌’ శిక్షణ ఇస్తున్న స్థానిక యువత సంఖ్య  30,000

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా భయం.. లాక్‌డౌన్‌తో ఉపాధి కరవు.. వెరసి వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లారు. వారిపై ఆధారపడ్డ అన్ని రంగాలు కుదేలయ్యాయి. లాక్‌డౌన్‌కు సడలింపులు వచ్చి తిరిగి పనులు ప్రారంభమైనా, వలస కూలీలు లేకపోవటంతో ఇప్పుడు ఆ రంగాల్లో పని మొదలుకావట్లేదు. అవి పట్టాలెక్కాలంటే కచ్చితంగా వలస కూలీలు తిరిగి రావాల్సిందే. కాదంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరగాలి. వలస కూలీలే కీలకంగా ఉన్న నిర్మాణ రంగంలో ఇప్పుడు ఈ దిశగా ఏర్పాట్లు మొదలయ్యాయి. సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన వలస కార్మికులను తిరిగి రప్పించే చర్యలు సాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు లక్ష మంది కార్మికులతో సంప్రదింపులు జరిపి వారు తెలంగాణకు తిరిగి వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో 80 వేల మంది వరకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. నిర్మాణ రంగంలో కీలకంగా ఉండే దాదాపు 12 రకాల ట్రేడ్స్‌లో స్థానిక యువకులకు శిక్షణ ఇచ్చి పనిలోచేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బాధ్యతను నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌) తీసుకుంది. జిల్లాకు వెయ్యి మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

రంగంలోకి లేబర్‌ కాంట్రాక్టర్లు..
నిర్మాణ రంగానికి సంబంధించి రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేసేవారు. వీరికి సంబంధించి లెక్కల్లో స్పష్టత లేదు. ఏ విభాగం కూడా వీరికి సంబంధించిన అంశాలను నేరుగా పర్యవేక్షించే పద్ధతి లేకపోవటంతో ఎంతమంది, ఏయే రాష్ట్రాలకు చెందిన వారు పనిచేస్తున్నారో లెక్కల్లేవు. అయితే వలస కూలీలను సమకూర్చే బాధ్యత లేబర్‌ కాంట్రాక్టర్లది. మ్యాన్‌ పవర్‌ సప్లయర్స్‌ తరహాలో వీరు వ్యవహరిస్తారు. బడా నిర్మాణ సంస్థలు తమకు ఎంతమంది కార్మికులు కావాలో వీరికి చెబితే, వీరు ఆయా రాష్ట్రాల్లో నైపుణ్యం ఉన్న వారిని గుర్తించి పనుల్లో పెట్టేవారు. వీరికి ఆయా రాష్ట్రాల్లోని లేబర్‌ కాంట్రాక్టర్లతో ప్రత్యక్ష సంబంధాలుంటాయి. ఇప్పుడు వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవటంతో వారిని తిరిగి రప్పించే బాధ్యత కూడా లేబర్‌ కాంట్రాక్టర్లకే అప్పగించారు. బడా నిర్మాణ సంస్థలే ఈమేరకు పురమాయించాయి. దీంతో రంగంలోకి దిగిన లేబర్‌ కాంట్రాక్టర్లు ఆయా రాష్ట్రాల్లోని కాంట్రాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. అవి క్రమంగా కొలిక్కి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌ఘఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్నవారిలో కదలిక వస్తున్నట్టు సమాచారం.

ముందు వెళ్లిన వారే..
సాధారణంగా వలస కార్మికులు ప్రతి సంవత్సరం వారి సొంత ప్రాంతాలకు వెళ్తారు. గత డిసెంబర్‌ నుంచి లాక్‌డౌన్‌ వరకు కూడా దాదాపు 50 వేల మందికిపైగా వెళ్లారు. లాక్‌డౌన్‌ తర్వాత దాదాపు రెండున్నర లక్షల మంది వెళ్లారు. వారు ఇప్పటికిప్పుడు తిరిగి వచ్చేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇక గత డిసెంబర్‌ నుంచి మార్చి లోపు వెళ్లిన వారిపై లేబర్‌ కాంట్రాక్టర్లు దృష్టి సారించారు. వారు ఈ పాటికే తిరిగి పనుల్లోకి రావాల్సి ఉండగా, లాక్‌డౌన్‌ వల్ల సొంత ప్రాంతాల్లోనే చిక్కుకుపోయారు. కొద్ది నెలలుగా పనుల్లేక వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడినట్లు సమాచారం. దీంతో వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ధైర్యం చెప్పటంతో పాటు, నిర్మాణ స్థలాల్లో ప్రత్యేక జాగ్రత్తలు చేపడుతున్నందున భయం లేదని పేర్కొంటున్నారు. ఆయా కార్మికులు ఉంటున్న ప్రాంతాల్లో కూడా కరోనా ప్రభావం ఉన్నందున, ఆ ప్రాంతం కూడా సురక్షితం కాదని వారు భావిస్తున్నారు. అదే తిరిగి తెలంగాణకు వస్తే డబ్బులు వస్తాయన్న భావనకు వచ్చినట్లు తెలిసింది. ఇలా ఇప్పటివరకు దాదాపు 80 వేల మంది సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

గల్ఫ్‌ నుంచి వచ్చిన వారి కోసం..
కరోనా భయంతో ఎడారి దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణ కార్మికులు తిరిగి వచ్చారు. వారు పనుల్లేకుండా ఖాళీగా ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్న నిర్మాణ రంగంలో వీరికి పనిచేసిన అనుభవం ఉంది. దీంతో వీరిని కూడా సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నారు. అందులో వారు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారిని గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గల్ఫ్‌ దేశాల్లో యంత్రాలతో పని ఎక్కువ. మన వద్ద మనుషులే చేస్తారు. యంత్రాలతో పనులకు అలవాటు పడ్డ వారికి స్వయంగా చేసే విషయంలో శిక్షణ ఇవ్వనున్నారు. వీలైనంత తొందరలో ఈ మొత్తం ప్రక్రియలు పూర్తి చేసి నిర్మాణ రంగానికి ఊపు తేవాలని నిర్మాణ సంస్థలు, న్యాక్‌ యంత్రాంగం భావిస్తోంది.  

న్యాక్‌ కీలక భూమిక
ఇప్పటికిప్పుడే యువత పనుల్లోకి వచ్చేలా జిల్లాకు వెయ్యి మంది చొప్పున ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వాలని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ నిర్ణయించింది. కనిష్టంగా 30 వేల మంది సిద్ధమవుతారని అంచనా. 12 రకాల ట్రేడ్స్‌లో వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. ప్లంబింగ్, వైరింగ్, తాపీ పని, సెంట్రింగ్, రంగులు వేయడం మొదలు.. సైట్‌ సూపర్‌వైజింగ్‌ వరకు శిక్షణ ఇస్తారు. దశల వారీగా వీరిని సిద్ధం చేస్తారు. తరగతి గదుల్లో శిక్షణ ఇవ్వాలంటే.. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో అనుమతి లేనందున పని ప్రదేశాల్లోనే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు బడా నిర్మాణ సంస్థలతో న్యాక్‌ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు