బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌!

21 Mar, 2019 02:25 IST|Sakshi

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అసంతృప్తులతో మంతనాలు 

ఇప్పటికే చేరిన పలువురు నాయకులు 

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేలా కసరత్తు 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్ కు తెరలేపింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకునేందుకు మంతనాలు ప్రారంభించింది. ఇప్పటికే కాం గ్రెస్‌ సీనియర్‌ నేత డీకే అరుణ బీజేపీలో చేరగా, గతంలో బీజేపీలో పని చేసిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడా బుధవారం బీజేపీలో చేరారు. మరోవైపు మంగళవారం పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ సమక్షంలో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావ్‌ బీజేపీలో చేరారు. బీజేపీ కేంద్ర నాయకత్వం డైరెక్షన్‌లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, రాష్ట్ర బీజేపీ నేతలు రంగంలోకి దిగి టికెట్‌ దక్కని సిట్టింగ్‌ ఎంపీలు, అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతు న్నారు. దీంతో రాష్ట్రానికి చెందిన మరో 20 మంది బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

మహబూబ్‌నగర్‌ నుంచి డీకే అరుణ 
మహబూబ్‌నగర్‌ నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా డీకే అరుణ బరిలోకి దిగే అవకాశం ఉంది. మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణతో కూడా బీజేపీ ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. వరంగల్‌ లోక్‌సభ లేదా మల్కాజిగిరి లోక్‌సభ నుంచి బరిలో దింపాలన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకునేలా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. మాజీ మంత్రి ముకేశ్‌గౌడ్‌ కుమారుడు విక్రమ్‌గౌడ్, విజయరామారావు, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, షాద్‌నగర్‌కు చెందిన ప్రతాప్‌రెడ్డితోనూ బీజేపీ నేతలు మాట్లాడినట్లు తెలిసింది. ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకాచౌదరితోనూ బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఆమె పార్టీలో చేరితే మల్కాజిగిరి నుంచి పోటీలో దింపాలన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.

మరోవైపు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌తోనూ సంప్రదింపులు జరిపారని సమాచారం. ఆమెను మెదక్‌ లోక్‌సభ నుంచి పోటీ చేయా లని బీజేపీ నేతలు కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే సునీతా లక్ష్మారెడ్డి, డీఎస్‌లు ఇద్దరూ ఆ వార్తలను ఖండించారు. నాగర్‌కర్నూల్‌కు చెందిన మందా జగన్నాథం, టీఆర్‌ఎస్‌ పెద్దపల్లి లోక్‌సభ టికెట్‌ ఆశిస్తున్న జి.వివేక్‌లతో కూడా బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. లోక్‌సభ లేదా రాజ్యసభ సీట్లు ఇస్తామన్న హామీలతో ఆపరేషన్‌ ఆకర్ష్‌ను బీజేపీ ముందుకు నడుపుతోంది. నరేంద్ర మోదీ చరిష్మా, పార్టీ కేడర్‌తో పాటు ఆయా అభ్య ర్థులకు ఉన్న కేడర్‌ సహకారంతో తెలంగాణలో లోక్‌ సభ సీట్లను గెలుచుకోవాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేలా బీజేపీ కార్యాచరణ మొదలుపెట్టడం, 2 రోజుల్లోనే కాంగ్రెస్‌ సీనియర్లను పార్టీలో చేర్చుకునేలా చర్యలు చేపట్టడంతో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు అవాక్కు అయినట్లు తెలిసింది.

కాంగ్రెస్‌ నుంచి భారీగా వలసలు..
కాంగ్రెస్‌ నుంచే ఎక్కువ మంది ముఖ్య నేత లు బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన ముఖ్య కాంగ్రెస్‌ నేతలు కొందరు బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మంగళవారమే ప్రకటించాల్సి ఉన్నా పార్టీలోకి వచ్చే నేతలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో.. అలాగే గెలుపు గుర్రాలను బరి లో నిలపాలన్న ఆలోచనతో అభ్యర్థుల ఖరారులో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒక్క స్థానం మినహా కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ఖరా రు కావడం, ఈ నెల 21న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో అప్పటివరకు వేచి చూద్దామా అన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌లో గెలిచే అవకాశం ఉండీ టికెట్‌ దక్కని వారికి టికెట్లు ఇవ్వడం ద్వారా ఆయా స్థానాల్లో సత్తా చాటాలన్న ఆలోచనలో ఉంది.

>
మరిన్ని వార్తలు