బత్తాయి రైతులను ఆదుకోవాలి: బండి సంజయ్‌

12 May, 2020 17:18 IST|Sakshi

సాక్షి, నల్గొండ: బత్తాయి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలం ఊట్లపల్లిలో బత్తాయి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడి కూడా రాకపోవడంతో బత్తాయి రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వమే బత్తాయిలను కొనుగోలు చేయాలని కోరారు.
(ఖైరతాబాద్‌ గణేష్‌పై కరోనా ఎఫెక్ట్‌..)

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..
రైతు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఆరు సంవత్సరాలు క్వారంటైన్‌లో ఉన్నారని, రైతులతో మాట్లాడే సమయం ముఖ్యమంత్రికి లేదని విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ను క్వారంటైన్‌ ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. రైతులకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
(ఒవైసీ సంచలన వ్యాఖ్యలు)

కరోనాపై తప్పుడు లెక్కలు..
రైతుల సమస్యల పరిష్కారానికి రేపు(బుధవారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నల్లబ్యాడ్జిలతో నిరసన తెలిపాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. కరోనా టెస్ట్‌ల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుందని  ఆరోపించారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కలిసి వస్తే బీజేపీ సహకరిస్తుందని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు