రీ వెరిఫికేషన్‌ ప్రాసెసింగ్‌కు స్వతంత్ర సంస్థ

2 May, 2019 01:48 IST|Sakshi

గ్లోబరీనాతో పాటు సమాంతరంగా ప్రాసెసింగ్‌

సంస్థ ఎంపిక బాధ్యత టీఎస్‌టీఎస్‌కు అప్పగింత

12 లక్షల జవాబు పత్రాల రీ వెరిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయి లైన విద్యార్థుల జవాబు పత్రాల రీ వెరిఫికేషన్‌ చేయా లని నిర్ణయించిన బోర్డు.. వాటి ప్రాసెసింగ్‌ కోసం మరో స్వతంత్ర సంస్థను నియమించనుంది. ప్రస్తు తం ఫలితాల ప్రాసెసింగ్‌ చేస్తున్న గ్లోబరీనా సంస్థకు సమాంతరంగా మరో సంస్థ చేత రీ వెరిఫికేషన్‌ ఫలితాల ప్రాసెసింగ్‌ చేయించేలా ఏర్పాట్లు చేస్తోంది. స్వతంత్ర సంస్థ ఎంపిక బాధ్యతను తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌కు (టీఎస్‌టీఎస్‌) అప్పగించింది. ఈ ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఇంటర్‌ ఫలితాల్లో తప్పులపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు బోర్డు కార్యదర్శి అశోక్‌ పేర్కొన్నారు. 

భారీ కసరత్తు చేయాల్సిందే... 
ఇంటర్‌ పరీక్షల్లో 3.28 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఫలితాల్లో చాలా మంది విద్యార్థులకు మార్కులు వచ్చినా సున్నాలు పడటం, పరీక్షలకు హాజరైనా ‘ఆబ్సెంట్‌’ అని రావడం వంటి తప్పిదాలు చోటుచేసుకోవడం తెలిసిందే. దీంతో విద్యా ర్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కొందరు విద్యార్థులు ఫెయిలయ్యామనే బాధతో ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించి నివేదిక తెప్పించుకుంది. పొరపాట్లు దొర్లడం వాస్తవమని గుర్తించిన కమిటీ... ఫెయిలైన విద్యార్థులందరి జవా బు పత్రాలనూ రీ వెరిఫికేషన్‌ చేయాలని సూచించింది. దీంతో 3.28 లక్షల మంది విద్యార్థులకు చెందిన దాదాపు 11 లక్షల జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్‌ చేసేందుకు బోర్డు చర్యలు చేపట్టింది.

మరోవైపు 48,960 మంది విద్యార్థులు తమకు తక్కువ మార్కు లు వచ్చాయంటూ రీ వెరిఫికేషన్‌ కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మరో 10,576 మంది రీ కౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి సంబంధించిన 1,13,339 జవాబు పత్రాలను కూడా రీ వెరిఫికేషన్‌ చేయాల్సి ఉంది. మొత్తంగా 3,76,960 మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు 12 లక్షల జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్‌ చేయాల్సి ఉంది. లెక్చరర్ల ఆధ్వర్యంలో పది రోజులకుపైగా జరిగే రీ వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక గ్లోబరీనాతోపాటు కొత్త కంప్యూటర్‌ సంస్థ ఆధ్వర్యంలో సమాంతరంగా రీ వెరిఫికేషన్‌ ఫలితాల ప్రాసెసింగ్‌ను బోర్డు చేపట్టనుంది. 

>
మరిన్ని వార్తలు