వైభోగ బోనం

14 Jul, 2014 03:41 IST|Sakshi
వైభోగ బోనం

* కన్నుల పండువగా లష్కర్ సంబురాలు
* అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు
* భక్తి పారవశ్యాన ఊగిన శివసత్తులు
* తల్లి దర్శనానికి ప్రముఖుల తాకిడి
* భక్తి పారవశ్యాన ఊగిన శివసత్తులు
* ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు
* కన్నుల పండువగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి సంబురాలు  
* అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు

 
సాక్షి, హైదరాబాద్: డప్పుల దరువులు....పోతరాజుల వీరంగాలు....శివసత్తుల పూనకాలు....అమ్మాబయలెల్లినాదో తల్లీ బయలెల్లినాదో... అంటూ  మహంకాళి అమ్మవారిపై అచంచల భక్తివిశ్వాసాలతో ఊగిపోయిన భక్తులు...ఘనంగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మహిళలు, దర్శించుకున్న అశేష భక్తజనవాహిని,డీజేల హోరులో ఉర్రూతలూగిన యువత. తెలంగాణ రాష్ట్ర పండుగ వేళ సికింద్రాబాద్ ఉజ్జయినీ మాత బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. జగజ్జననిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు.
 
 సికింద్రాబాద్‌లోని అన్ని ప్రధాన రహదారులు,వీధులు కిటకిటలాడాయి. ఉదయం 4 గంటలకు అభిషేకాలు, మహా హారతితో తల్లికి విశేష పూజలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ , మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డిలు తొలి పూజలో పాల్గొన్నారు. వారితో పాటు ఆలయ ఈవో అశోక్‌కుమార్, ఫౌండర్ ట్రస్టీ సురిటీ కృష్ణలు ఉన్నారు. జంటనగరాలతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
 
పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్
రాష్ట్ర పండుగగా గుర్తించిన ఈ ఉత్సవాలకు  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సతీ సమేతంగా మధ్యాహ్నం 1.30 గంటలకు అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 10 గంటలకు దర్శించుకున్నారు. బోనాలు, సాక సమర్పించే భక్తులతో పాటు , శివసత్తుల పూనకాలు, ఫలహార బండ్ల, తొట్టెల సమర్పణల ఊరేగింపులతో ఆదివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సికింద్రాబాద్ పరిసరాల్లో కోలాహలం నెలకొంది.  వీఐపీల తాకిడి ఆలయంలోకి వెళ్లేందుకు పలువురు ప్రయత్నించడంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. ప్రముఖుల రాకపోకలతో క్యూలైన్‌లో ఉన్న వారు అమ్మవారి దర్శనంకోసం రెండు గంటలకు పైగా  ఉండాల్సి వచ్చింది.
 
అమ్మ ఆశీర్వాదంతో అభివృద్ధి: హోం మంత్రి
 మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. ఇందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడాలని మొక్కుకున్నానని చెప్పారు. ఈ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకూ, భక్తులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసులను నియమించామని చెప్పారు.
 
ప్రముఖుల పూజలు
 ఆలయాన్ని దర్శించుకున్న పలువురు నేతలకు స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి టీ పద్మారావులు కలసి అమ్మవారికి పూజలు చేశారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీలు బండారు దత్తాత్రేయ, కె.కేశవరావు, కవిత, మల్లారెడ్డి, నంది ఎల్లయ్య, బీబీ పటేల్, సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, వివేకానందగౌడ్, ఎర్రబెల్లి దయాకర్, జీ సాయన్న, గీతారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు.

మాజీ ఎంపీలు అంజన్‌కుమార్‌యాదవ్, అల్లాడి రాజ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కృష్ణయాదవ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, విమలక్క ప్రత్యేక పూజలు చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్‌రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, ఐపీఎస్ అధికారులు జితేందర్, శివప్రసాద్, మల్లారెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
 
 రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలి: కేసీఆర్
 తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరినీ అమ్మవారు చల్లగా చూడాలని తాను మొక్కుకున్నానని సీఎం కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. మహంకాళి అమ్మదయ వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. వర్షాలు పడి ప్రజలంతా పాడి పంటలతో, సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. బోనాలను రాష్ట్ర ఉత్సవాలుగా ప్రకటించామని ప్రస్తుతం ఎలా ఉన్నా వచ్చే  వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు.
 
సయోధ్య చెదరకూడదని : చంద్రబాబు

 రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు ప్రజల మధ్య సయోధ్య చెదరకుండా వారు కలసిమెలసి జీవించేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. వానలు కురిసి రైతుల ఇబ్బందులు తొలగిపోవాలని మొక్కుకున్నట్లు  తెలిపారు. అలాగే బాబు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన  శ్రీగురు రేణు దత్తాత్రేయస్వామి పాదపూజలో పాల్గొని, భగవాన్ రామదూత స్వామి ఆశీస్సులు అందుకున్నారు.

మరిన్ని వార్తలు