మార్చి 6 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

1 Mar, 2020 02:21 IST|Sakshi

నోటిఫికేషన్‌ విడుదల 

22వ తేదీలోగా ముగించేలా షెడ్యూలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ 15వ సమావేశాలు ఈనెల ఆరో తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ తరపున శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ నరసింహాచార్యులు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 6న శాసన మండలి, శాసనసభను ఉద్దేశించి గవర్నర్‌ హోదాలో తమిళిసై తొలిసారిగా ప్రసంగిస్తారు. మరుసటి రోజు గవర్నర్‌ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లోనూ చర్చ జరగనుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2020ను ఈ నెల 8 లేదా 10న అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎనిమిదో తేదీ ఆదివారం, మరుసటి రోజు సోమవారం హోలీ రావడంతో బిజినెస్‌ అడ్వైజరీ కమిటీలో బడ్జె ట్‌ ప్రవేశపెట్టే తేదీతో పాటు, సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపైనా చర్చిస్తారు.

ఆర్థిక మంత్రి హోదాలో తొలిసారి హరీశ్‌రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుండగా, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ ప్రసంగాన్ని వినిపిస్తారు. 2019–20కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ సమావేశాలు 2019 సెప్టెంబర్‌ 9 నుంచి 22 వరకు జరగ్గా, శాసనసభ 11 రోజులు, శాసన మండలి కేవలం నాలుగు రోజులు మాత్రమే సమావేశమైంది. ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాలు కూడా పన్నెండు పని దినాల్లో ముగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మార్చి 22వ తేదీ వరకు శాసనసభను నిర్వహించి, మండలి సమావేశాలను మాత్రం నాలుగైదు రోజులకు పరిమితం చేసే అవకాశం ఉంది. 

అసెంబ్లీ సమావేశాల్లోనే రాజ్యసభ ఎన్నిక 
రాష్ట్ర కోటాలో రాజ్యసభ నుంచి ఏప్రిల్‌ 9న ఇద్దరు సభ్యులు రిటైర్‌ అవుతుండటంతో, ఖాళీ అవుతున్న స్థానాలకు ఎన్నికల సంఘం ఇప్పటికే ద్వై వార్షిక ఎన్నిక షెడ్యూలును విడుదల చేసింది. ఈ నెల 6 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై, 18న ముగియనుంది. ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో ఈ నెల 26న పోలింగ్‌ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితం ప్రకటిస్తారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ప్రక్రియ జరుగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.  

మరిన్ని వార్తలు