తొలిరోజే తెలంగాణ బడ్జెట్.!

29 Oct, 2014 02:09 IST|Sakshi
తొలిరోజే తెలంగాణ బడ్జెట్.!

 నవంబర్ 5వ తేదీనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం
 ఎక్కువ అంశాలపై చర్చ కోసం శనివారాల్లోనూ సభ!
 
 సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల తొలిరోజే బడ్జెట్ ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 5న సమావేశాలను ప్రారంభించి, 7న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని మొదట్లో భావించినప్పటికీ.. సమావేశాలు ప్రారంభమైన రోజే బడ్జెట్‌ను సభ లో ప్రవేశపెట్టాలని తాజాగా నిర్ణయించారు. 5వ తేదీన అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటెల రాజేం దర్, శాసనమండలిలో ఉపముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర బడ్జెట్ దాదాపు 90 వేల కోట్లు ఉండవచ్చని అం చనా. ఇదిలా ఉండగా బడ్జెట్‌ను సభ్యులు అధ్యయనం చేసేందుకు 6వ తేదీన సమావేశాలకు విరామం ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం తనక్యాంపు కార్యాలయంలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి అసెంబ్లీ కా ర్యదర్శి రాజాసదారాం, ముఖ్యకార్యదర్శి నర్సిం గ్‌రావులతో బడ్జెట్ సమావేశాలపై సుదీర్ఘం గా సమీక్షించారు. ఈసారి శాసనసభ సమావేశాల్లో సమస్యలపై ఎక్కువ చర్చ జరిగేందుకు, సభ్యు లు మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో శనివారాలతోపాటు, రోజూ సాయంత్రం వేళల్లో కూడా సభను కొనసాగించాలని సీఎం అభిప్రాయపడ్డారు. అయితే శనివారాల్లో సభ నడపాలా? వద్దా? అనే విషయంపై శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయిస్తారు. సమావేశాలు నవంబర్ 28 వరకు జరపాలని  నిర్ణయించారు.  అవసరమైతే మరో రెండు రోజులు పొడిగించాలని కూడా భావి స్తున్నారు. నవంబర్ 7,8,10 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ, సమాధానం ఉంటాయని సమీక్ష అనంతరం సీఎం కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. ఆ తరువాత వివిధ పద్దులపై చర్చ జరుగుతుందని, 40 దాకా పద్దులు ఉండే అవకాశం ఉన్నందున, 8 విభాగాలుగా విభజించి ఒక్కో విభాగంపై  ఒక్కోరోజు చర్చ జరిగే విధంగా సమయం కేటాయిస్తే బావుంటుందని ప్రభుత్వం భావిస్తోందని అందులో పేర్కొన్నారు. ప్రతిరోజు గంటసేపు ప్రశ్నోత్తరాల సమయాన్ని పార్లమెంట్‌లో మాదిరిగా కచ్చితంగా నిర్వహించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. బడ్జెట్‌పై చర్చ అనంతరం ఒకరోజు జీరో అవర్, మరొక రోజు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించడానికి వీలుగా సమయం కేటాయించాలని ప్రభుత్వం భావి స్తోంది. అసెంబ్లీ, మండలిలలో ఆయా పార్టీలకు ఉన్న సభ్యుల సంఖ్య ఆధారంగా సమయాన్ని కేటాయిస్తారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైనందున, కొత్తచట్టాలను రూపొందించే అంశా న్ని సభలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కొత్తచట్టాల రూపకల్పన కోసం బిల్లులపై ప్రతి రోజు సాయంత్రం చర్చ జరుగుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ఏయే చట్టాలను మార్చాలన్న అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంలు బుధవారం నుంచి కసరత్తు చేపట్టాలని నిర్ణయించారు.
 
 నోటిఫికేషన్ జారీ
 
 నవంబరు 5వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. గవర్నర్ ఆమోదం తర్వాత ఈ నోటిఫికేషన్ జారీ అయింది.
 
 జవాబుల బాధ్యత ఇతర మంత్రులకు..
 
 శాసనసభ సమావేశాల్లో తాను నిర్వహిస్తున్న వివిధ శాఖలకు సంబంధించి సభలో సమాధానాలు ఇచ్చే బాధ్యతను పలువురు మం త్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించా రు. మంత్రులు తమ శాఖలతోపాటు సీఎం తమకు అప్పగించిన శాఖలపై కూడా సభలో బదులిస్తారు. మంత్రులకు అదనంగా కేటాయించిన శాఖలు ఇవి.. నాయిని నర్సింహారెడ్డి (శాంతిభద్రతలు), ఈటెల రాజేందర్ (సంక్షేమ శాఖ, దేవాదాయ), మహమూద్ అలీ (మైనారిటీసంక్షేమం), టి.రాజయ్య(క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటకం,సాంస్కృతికం), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (పురపాలక, పట్టణాభివృద్ధి), హరీష్‌రావు (విద్యుత్, సాధారణ పరిపాలన), మహేందర్‌రెడ్డి ( వాణిజ్య పన్నులు), కేటీ రామారావు (పరిశ్రమలు, జౌళిశాఖ), జోగు రామన్న (పర్యావరణం, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం), జగదీష్‌రెడ్డి (మహిళా శిశు సంక్షేమం, న్యాయశాఖ), పద్మారావు( అర్ అండ్ బీ).
 

మరిన్ని వార్తలు