'రాష్ట్ర బడ్జెట్ అద్భుతంగా ఉండబోతుంది'

1 Nov, 2014 12:08 IST|Sakshi
'రాష్ట్ర బడ్జెట్ అద్భుతంగా ఉండబోతుంది'

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు రాబోయే అయిదేళ్లలో ఉపయోగపడే విధంగా బడ్జెట్ సమావేశాలు ఉంటాయని ఐటీ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.  రాష్ట్ర బడ్జెట్ అద్భుతంగా ఉండబోతుందని, కొత్తగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని ఆయన శనివారమిక్కడ తెలిపారు. 

 

 ప్రతిపక్షాలు ప్రభుత్వంపై లేనిపోని విమర్శులు చేస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.  రైతుల ఆత్మహత్యలకు, విద్యుత్ సంక్షోభానికి కారణమైనవారే ఇప్పుడు ఆందోళనలు చేయటం విడ్డూరమన్నారు.  ప్రజలకు తాము జవాబుదారీ అని, ప్రతిపక్షాలు చేసే రాజకీయాలను ప్రజల దృష్టికి తీసుకు వెళతామన్నారు.

కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలపై బీజేపీ నేతలే సమాధానం చెప్పాలని కేటీఆర్ అన్నారు. నలభై నిమిషాల్లో చేయాల్సిన పనిని నాలుగు నెలల పాటు నాన్చుతున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సరైన గౌరవం ఇవ్వటం లేదని అన్నారు.  తమతో సంప్రదించకుండా తెలంగాణలో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపటం, హైదరాబాద్పై పోలీసుల పెత్తనం తదితర అంశాలను బీజేపీ నేతలు గమనించి మాట్లాడితే బాగుంటుందని కేటీఆర్ హితవు పలికారు.

మరిన్ని వార్తలు